నెవర్‌ బిఫోర్ … ఎవర్‌ ఆఫ్టర్‌!

ఓటుకు నోటు లేని ఎన్నిక‌ల‌ను ఊహించామా? అందులోనూ అన్ని ర‌కాలుగా ఆర్థిక, అంగ బ‌లాలున్న అధికార పార్టీ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఓటుకు నోటు పంపిణీ చేయ‌కూడ‌ద‌నే చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని క‌ల‌గ‌న్నారా? ఊహూ, లేనేలేదు.…

ఓటుకు నోటు లేని ఎన్నిక‌ల‌ను ఊహించామా? అందులోనూ అన్ని ర‌కాలుగా ఆర్థిక, అంగ బ‌లాలున్న అధికార పార్టీ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఓటుకు నోటు పంపిణీ చేయ‌కూడ‌ద‌నే చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని క‌ల‌గ‌న్నారా? ఊహూ, లేనేలేదు. రాజ‌కీయం అంటేనే వ్యాపార‌మయ‌మైన వ్య‌వ‌స్థ‌లో డ‌బ్బు ప్ర‌మేయం లేకుండా అధికార పార్టీ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం ఒక మాట‌లో చెప్పాలంటే సాహ‌స‌మే. అలాంటి సాహ‌సానికి వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుప‌తి ఉప ఎన్నిక‌ల వేదిక‌గా శ్రీ‌కారం చుట్టి …ఔరా అనిపించారు.

తిరుప‌తి ఉప ఎన్నిక‌లో భాగంగా కేవ‌లం సంక్షేమ ప‌థ‌కాల‌నే ప్ర‌చారాస్త్రాలుగా చేసుకుని వైసీపీ ఓట్ల‌ను అభ్య‌ర్థించింది. భార‌త‌దేశంలోనే ఏ ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌న‌న్ని సంక్షేమ ఫ‌లాల‌ను అందిస్తున్న ప్ర‌భుత్వంగా జ‌గ‌న్ స‌ర్కార్ యావ‌త్ దేశ దృష్టిని ఆక‌ర్షించింది. ఏపీలో సంక్షేమం త‌ప్ప‌, మ‌రేమీ లేద‌నే విమ‌ర్శ‌ల‌ను కూడా ఎదుర్కొంటోంది. ఇందులో నిజం కూడా లేక‌పోలేదు. ముఖ్యమంత్రిగా వైఎస్ జ‌గ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆ క్ష‌ణం నుంచి తాను హామీ ఇచ్చిన న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌ను అమ‌లు చేసేందుకు చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తున్నారు.

న‌వ‌ర‌త్నాల అమ‌లుకు సంబంధించి ఏడాది ముందుగానే క్యాలెండ‌ర్ కూడా ఇచ్చి, ఆ స‌మ‌యానికి ల‌బ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డ‌బ్బు జ‌మ చేస్తున్నారు. మ‌రోవైపు అభివృద్ధి, ఆర్థిక వ‌న‌రుల పెంపున‌కు సంబంధించి కార్య‌క్ర‌మాల ఊసేలేద‌ని కొన్ని వ‌ర్గాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లున్నాయి. ఇది నాణేనికి రెండో వైపు. ఇటీవ‌ల స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పల్లెలు, ప‌ట్ట‌ణాలు అనే తేడా లేకుండా అన్నీ వైసీపీకే ప‌ట్టం క‌ట్టాయి. దీనంత‌టికి కార‌ణం సంక్షేమ ప‌థ‌కాలే అని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

ఏ మాట‌కామాట చెప్పాలంటే …గ‌తంలో ఏనాడూ ఈ స్థాయిలో సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ల‌బ్ధి క‌ల‌గ‌లేదు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చిన తిరుప‌తి ఉప ఎన్నిక‌లో ఓట‌ర్ల‌కు డ‌బ్బు ఇవ్వ‌డంలో ఔచిత్యం లేద‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ భావించారు.

తిరుప‌తిలో ఓట‌ర్ల‌కు డ‌బ్బు పంపిణీ చేయ‌కూడ‌ద‌నే సాహ‌సోపేత నిర్ణ‌యాన్ని జ‌గ‌న్ తీసుకున్న‌ట్టు ఇటీవ‌ల “గ్రేటాంధ్ర” మొట్ట మొద‌టిసారిగా చెప్పింది. నేడు అదే నిజ‌మైంది. మ‌రి కొన్ని గంటల్లో ఉప ఎన్నిక మొద‌లుకానుంది. సాధార‌ణంగా ఎన్నిక‌ల‌కు రెండుమూడు రోజులు ముందు నుంచి ఓట‌ర్ల‌కు డ‌బ్బు పంపిణీ చేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. క‌నీసం అంటే ఓటుకు వెయ్యి రూపాయ‌లు త‌ప్ప‌ని స‌రి. అదే అధికార పార్టీ అయితే ప్ర‌తిప‌క్షాల కంటే రూ.500 లేదా రూ.1000 ఎక్కువ పంపిణీ చేస్తుంటుంది.

కానీ తిరుప‌తి ఉప ఎన్నిక‌లో విచిత్ర‌మైన ప‌రిస్థితికి అధికార పార్టీ కార‌ణ‌మైంది. అస‌లు డ‌బ్బే పంపిణీ చేయ‌కూడ‌ద‌ని మొట్ట మొద‌ట నిర్ణయించుకోవ‌డంతో అధికార పార్టీల త‌ల‌ల‌పై పాలు పోసిన‌ట్టు అయ్యింది. ఉప ఎన్నిక‌లో జ‌గ‌న్ డ‌బ్బు పంపిణీ చేయ‌డ‌ని చెబితే … అంతా ఉత్తుత్తిదేన‌ని కొట్టి పారేశారు. త‌మ‌ను మ‌భ్య‌పెట్టి, ఆ త‌ర్వాత తీరిగ్గా పెద్ద మొత్తంలో ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెట్ట‌డానికి వేసిన ఎత్తుగ‌డ‌గా ప్ర‌తిప‌క్షాలు అభివ‌ర్ణించాయి. తీరా ఎన్నిక‌లు స‌మీపించినా ఎక్క‌డా డ‌బ్బు పంపిణీ ఊసేలేక పోవ‌డంతో ఇది క‌లా? నిజ‌మా? అని ప్ర‌తిప‌క్షాలు సైతం న‌మ్మ‌లేని స్థితి.

అధికార పార్టీనే డ‌బ్బు పంపిణీ చేయ‌క‌పోతే, ఇక తాము మాత్రం పంచేదేముంద‌ని ప్ర‌తిప‌క్షాలు కూడా …వైఎస్ జ‌గ‌న్ బాటే ప‌ట్టాయి. ఎన్నిక‌ల చ‌రిత్ర‌లో జ‌గ‌న్ ట్రెండ్ సృష్టిస్తే , దాన్ని ప్ర‌తిప‌క్షాలు కూడా అనుస‌రించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి త‌లెత్తింది. నిజానికి ఒక ద‌శ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ క‌నీసం త‌మ ఓటర్ల వ‌ర‌కైనా డ‌బ్బు పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. అయితే ఇది కొత్త త‌ల‌నొప్పికి కార‌ణ‌మ‌వుతుంద‌ని వెన‌క్కి త‌గ్గిన‌ట్టు స‌మాచారం.

ఒక‌వేళ తిరుప‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలో వైసీపీ త‌ర‌పున ఎవ‌రైనా ఓట‌ర్ల‌కు డ‌బ్బు పంపిణీ చేస్తే …అలాంటి వారిని నిర్ధాక్ష‌ణ్యంగా పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తాన‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ హెచ్చ‌రించిన‌ట్టు స‌మాచారం. రాజ‌కీయాలు భ్ర‌ష్టు ప‌ట్టాయ‌ని, డ‌బ్బు మ‌యం అయ్యాయ‌ని, డ‌బ్బున్న వాళ్ల‌తో క‌లుషితం అయ్యాయ‌ని, పేద‌ల‌కు, సామాన్యుల‌కు స్థానం లేద‌ని.. ఇలాంటి విమ‌ర్శ‌ల‌ను చేస్తుంటారు. కానీ డ‌బ్బు తీసుకోకుండా ఏ మాత్రం ఓట్లు వేస్తార‌నేది ప్ర‌జ‌లు, మేధావులు, పౌర‌స‌మాజానికి కూడా ఇదో ప‌రీక్ష‌గా రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

రాజ‌కీయాల్లో సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చేందుకు తిరుప‌తి ఉప ఎన్నిక ఓ మంచి అవ‌కాశంగా భావించ‌వ‌చ్చ‌ని అవినీతి ర‌హిత రాజ‌కీయాల‌ను కాంక్షించే వ‌ర్గం అంటోంది. ఎందుకంటే నోటుకు ఓటు అమ్ముకుంటే ప్ర‌శ్నించే హ‌క్కును కోల్పోయిన‌ట్టే. అలాంటిది అస‌లు అమ్మ‌కం, కొనుగోలు అనే వాటికే ఆస్కారం లేకుండా తిరుప‌తి ఉప ఎన్నిక‌లు వేదిక కావ‌డం ఓ అద్భుత‌మనే చెప్పాలి. రాజ‌కీయంగా వైఎస్ జ‌గ‌న్‌పై ఎన్ని విమ‌ర్శ‌లైనా ఉండొచ్చు కానీ, ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌లో స‌మూల మార్పులు తీసుకురావ‌డానికి ప్ర‌స్తుతం ఆయ‌న ఎంచుకున్న మార్గం మాత్రం… నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌..!

సొదుం ర‌మ‌ణ‌