ఓ బాలీవుడ్ డైరక్టర్ ఈ కథ తీసుకొచ్చాడు
ఐదుగురు రచయితలు ఈ కథపై కూర్చున్నారు
ఇది ఏ సినిమాకు రీమేక్ కాదు, పక్కా ఒరిజినల్
దేవదాస్ సినిమాకు సంబంధించి విడుదలకు ముందు నాగార్జున, నానితో పాటు మేకర్స్ అంతా సినిమా కథ గురించి ఇలా కథలు కథలుగా చెప్పుకొచ్చారు. దాదాపు ఐదుగురు రచయితలు వర్క్ చేశారని ఘనంగా ప్రకటించారు. తీరా సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత అర్థమైంది. ఇది కూడా కొట్టుకొచ్చిన కథే అని.
అవును.. ఓ మలయాళ సినిమా ఆధారంగా దేవదాస్ కథ రాసుకున్నారు. మమ్ముట్టి, శ్రీనివాసన్ హీరోలుగా 2015లో భార్గవచరితం-మూనమ్ ఖండమ్ అనే సినిమా వచ్చింది. ఇందులో మమ్ముట్టి డాన్ గా నటించాడు. శ్రీనివాసన్ డాక్టర్ గా నటించాడు. సినిమా మంచి కామెడీగా ఉంటుంది. కానీ మలయాళంలో అట్టర్ ఫ్లాప్ అయింది.
ఇప్పుడిదే కథను దేవదాస్ సినిమా కోసం కూడా వాడుకున్నారు. దేవదాస్ లో నాగార్జున డాన్ గా నటించాడు. నాని డాక్టర్ గా నటించాడు. మలయాళం సినిమాలో ఆరోగ్య సమస్యతో మమ్ముట్టి, శ్రీనివాసన్ ఇంటికి వస్తాడు. అతడి ఇంట్లోనే ఉండి ట్రీట్ మెంట్ తీసుకుంటాడు. దేవదాస్ లో కూడా నాగార్జున బుల్లెట్ గాయంతో నాని హాస్పిటల్ కు వస్తాడు. తర్వాత అతడికి దగ్గరై ఫ్రెండ్ గా మారతాడు.
మలయాళం సినిమాలో శ్రీనివాసన్, మమ్ముట్టిని మంచివాడిగా మార్చడానికి ప్రయత్నిస్తాడు. మమ్ముట్టిని మాఫియాకు దూరం చేస్తాడు. దేవదాస్ లో కూడా నాని తన మంచితనంతో నాగ్ ను మార్చేస్తాడు. మాఫియాకు దూరం చేస్తాడు. డాక్టర్ ఇంట్లో డాన్ ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ చేపడతారు. దేవదాస్ లో కూడా నాని ఇంటిలో నాగ్ ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు స్పెషల్ ఆపరేషన్ మొదలుపెడతారు. ఇలా చెప్పుకుంటూ పోతే మలయాళం సినిమాకు, దేవదాస్ కు ఎన్నో పోలికలు.
కాకపోతే దేవదాస్ సినిమాలో టోటల్ సెటప్ మొత్తం మార్చేశారు. కాపీ కొట్టారనే విషయం కనిబెట్టకుండా ఉండేందుకు భారీ ఫైట్లు, హీరోయిన్ ఎపిసోడ్లు, రిచ్ లుక్ తీసుకొచ్చారు. మిగతాదంతా సేమ్ టు సేమ్. హాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఓ సినిమా ఆధారంగా భార్గవచరితమ్ తీశామని మమ్ముట్టి అప్పట్లో ఒప్పుకున్నాడు. కానీ భార్గవచరితమ్ ఆధారంగా దేవదాస్ తీశామనే విషయాన్ని మాత్రం ఈ మేకర్స్ అంగీకరించడం లేదు.
ఓ బాలీవుడ్ డైరక్టర్ ఈ కథ ఇచ్చాడని, ఐదుగురు రచయితలతో చాలా కష్టపడి స్టోరీని డెవలప్ చేశామనే మాటల్ని ఇకనైనా చెప్పడం మానేస్తే బాగుంటుంది. పోనీ ఇంతా చేసి దేవదాస్ లో బలమైన సన్నివేశాలు రాసుకున్నారా అంటే అదీ లేదు. నాగ్, నాని లాంటి ఇద్దరు స్టార్స్ ను పెట్టుకొని పేలవమైన సీన్లతో సినిమాను సాగదీశారు.