శబరిమలపై సుప్రీం తీర్పు.. విశ్వాసానిదే గెలుపు

మతం గొప్పదా.. దేవుడిపై విశ్వాసం గొప్పదా? అనే ప్రశ్నలు వస్తే కచ్చితంగా విశ్వాసమే అని చెప్పాలి. మతం కట్టుబాట్లను పెడితే, భగవంతుడిపై ఉన్న విశ్వాసం అచంచలమైనది. కఠినంగా ఉండే కట్టుబాట్లు ఎప్పటికైనా కాలగర్భంలో కలసిపోవాల్సిందే.…

మతం గొప్పదా.. దేవుడిపై విశ్వాసం గొప్పదా? అనే ప్రశ్నలు వస్తే కచ్చితంగా విశ్వాసమే అని చెప్పాలి. మతం కట్టుబాట్లను పెడితే, భగవంతుడిపై ఉన్న విశ్వాసం అచంచలమైనది. కఠినంగా ఉండే కట్టుబాట్లు ఎప్పటికైనా కాలగర్భంలో కలసిపోవాల్సిందే. అయితే ఆ కట్టుబాట్లపై ఉన్న విశ్వాసం మాత్రం ప్రజల్లో నరనరానా జీర్ణించుకుని ఉంటుంది. అది ఉన్నంతకాలం పేరు ఏదయినా నియమ నిష్టలకు మాత్రం ఢోకా ఉండదు. 

శభరిమల ఆలయంపై సుప్రీం తీర్పు విషయంలో కూడా ఇదే జరగబోతోంది. 10 నుంచి 50 ఏళ్ల లోపు వయసున్న స్త్రీలు.. కచ్చితంగా చెప్పాలంటే రుతుక్రమం వయసులో ఉన్నవాళ్లు ఆలయంలోకి వెళ్లరాదనేది ఇక్కడి ఆచారం. రుతుక్రమం సమయంలో సహజంగానే స్త్రీలు పూజలు, దైవ దర్శనాలకు దూరంగా ఉంటారు. దీన్ని ఇంకాస్త విస్తరిస్తూ ఆ వయసులో ఉన్నవారు శబరి ఆలయ ప్రవేశానికి అనర్హులంటూ అక్కడ నియమం ఉంది. 

ఏళ్ల తరబడి ఉన్న ఈ నియమాన్ని ఇప్పుడు కోర్టు కొట్టివేసింది. అయితే కోర్టు నియమం వెలువడక ముందు నుంచీ ఇటీవల కాలంలో శబరిమలకు మాల ధరించిన మహిళా భక్తుల రాక పెరిగింది. రుతుక్రమం వయసులో లేని మహిళలు అయ్యప్ప దర్శనానికి ఏడాదికేడాది పోటెత్తుతున్నారు. కొత్తగా మిగతా వారికి కూడా ఆలయ ప్రవేశానికి అర్హత కల్పించాలనే వాదన మొదలైంది. దీనిపైనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 

మతాన్ని, మత విశ్వాసాలను నమ్మేవారు ఎవరూ ఆచార సంప్రదాయాలను వ్యతిరేకించరు. కేవలం వ్యతిరేకమైన స్వభావం ఉన్నవాళ్లు మాత్రమే కట్టుబాట్లను తెంచేయాలంటూ కోర్టుల వరకూ వెళ్తారు. చివరకు వారు విజయం సాధించినా ప్రజల్లో ఉన్న సనాతన నమ్మకాలని మాత్రం మార్చలేరు. శబరిమల విషయంలో కూడా అదే జరగబోతోంది. 

తీర్పు వెలువడింది కాబట్టి రుతుక్రమం వయసులో ఉన్న మహిళలు దేవస్థానానికి తండోపతండాలుగా వస్తారని చెప్పలేం. నిత్యం స్వామి శరణుఘోషతో అలరారే శబరిమలకు తాజా తీర్పు వల్ల ఎలాంటి అపవిత్రతా అంటదని స్వయంగా మహిళలు చెబుతున్నారు. దర్శనం చేసుకునే వెసులుబాటు కలిగినప్పటికీ ఆచారాన్ని మంటగలపమని దాదాపు 99శాతం మహిళలు అభిప్రాయపడ్డారు.

మహారాష్ట్రలోని శని సింగాపోర్ దేవస్థానం విషయంలో కూడా ఇలాంటి తీర్పే వచ్చింది. మహిళల ఆలయ ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని కోర్టు ఎత్తివేసింది. తీర్పు వెలువడిన సమయంలో కొంతమంది మహిళలు ఆలయంలోకి వెళ్లారే తప్ప.. ఇప్పటికీ స్థానిక మహిళలు కానీ, యాత్రల కోసం వచ్చేవారు కానీ స్వచ్ఛందంగా ఆలయానికి దూరంగా ఉంటున్నారు. అదీ విశ్వాసమంటే. శబరిమల విషయంలో కూడా అదే జరుగుతుంది. 

కోర్టు తీర్పు ఎలా ఉన్నా తాము మాత్రం ఆలయ కట్టుబాట్లను గౌరవిస్తామంటూ ఎంతోమంది కేరళ మహిళలు తమ విశ్వాసాన్ని తెలియజేస్తున్నారు. అయ్యప్పపై భక్తి ఉన్న ఎవరూ ఈ నియమాన్ని ఉల్లంఘించరు. అదే భారతీయ సనాతన ధర్మం. భారతీయతలోని గొప్పదనం.