ఆయనో ఎమ్మెల్యే.. తెల్లవారి ఇంటి ముందు ఓ న్యూస్ యాంకర్ ప్రత్యక్షమైంది. తాను హైదరాబాద్ నుంచి వచ్చానంటూ, లోకల్ రిపోర్టర్ ని వెంటతీసుకుని వచ్చి పరిచయం చేసుకుంది. బొకే ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగింది. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.
మాటల్లో మెల్లగా బిజినెస్ డీల్ గురించి ప్రస్తావించింది ఆ మహిళా న్యూస్ యాంకర్. 50 లక్షల రూపాయల ప్యాకేజీ. స్పాట్ లో 10 లక్షలు కట్టాలి. ఆ తర్వాత ఎన్నికలయ్యే వరకు ఇక ఆ ఎమ్మెల్యే గురించి ఛానెల్ లో వరుసగా పాజిటివ్ కథనాలు వస్తుంటాయి. ఎక్కడ ఏం జరిగినా ఆయన స్పందన తీసుకుంటారు. ఇంటర్వ్యూలు, చిట్ చాట్ లు, వాక్ విత్ లీడర్, టీ విత్ లీడర్, డిన్నర్ విత్ లీడర్, వన్డే విత్ లీడర్ వంటి కార్యక్రమాలు మొదలవుతాయి. అన్నిట్లో ఆయనకే తొలి ప్రాధాన్యం. ఇలా చెప్పుకుంటూ పోతోంది యాంకర్.
ఇలా 3 రోజుల పాటు జిల్లాలోనే మకాం వేసి.. అందరు ఎమ్మెల్యేలను బొకేలతో పలకరించింది ఆ న్యూస్ యాంకరమ్మ. చివరిగా ఓ ఎమ్మెల్యే వంతు వచ్చింది. జనం తరపున నిలబడతాడు, పనిచేసి పెడతాడు అని పేరున్న ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యేకి కాస్త ఆవేశం ఎక్కువ. ఈసారి ఏకంగా ఓ మంత్రి ఈయనపై పోటీ చేస్తాడని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ఎమ్మెల్యే దగ్గరకి కూడా సదరు యాంకర్ వెళ్లి బొకే ఇచ్చి పలకరించింది.
50 లక్షల ప్రతిపాదన ముందు పెట్టింది. అంతే ఒక్కసారిగా ఎమ్మెల్యేకి ఒళ్లు మండింది. ముందు ఇక్కడి నుంచి వెళ్లిపొండి అంటూ ఆ యాంకర్, రిపోర్టర్ పై గట్టిగా అరిచేశాడు. ఎమ్మెల్యే నుంచి ఊహించని స్పందన రావడంతో సదరు యాంకరమ్మ షాక్ తింది. మెల్లగా అక్కడినుంచి జారుకుంది.
టీవీ ఛానెళ్లు మనుగడ కోసం రాజకీయనాయకులు, సంస్థల నుంచి అడ్వర్టైజ్ మెంట్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తుంటాయి. రిపోర్టర్లతో ఉన్న పరిచయం, వారిపై జాలితో చాలామంది ఆర్థిక సాయం చేస్తుంటారు. కానీ ఇలా డైరెక్ట్ గా బిజినెస్ డీల్, అదీ 50 లక్షలతో ముందుకొస్తే ఎవరికైనా కోపం వస్తుంది. ఈ ప్రతిపాదనతో ఫిమేల్ యాంకర్లను జిల్లాలకు పంపిస్తోంది పేరున్న న్యూస్ ఛానెలా అంటే అదీ కాదు. వీక్లీ రేటింగ్స్ లో చివరి ప్లేస్ కోసం కొట్టుకు చచ్చే ఛానెల్ అది. బ్లాక్ మెయిలింగ్ లో ఆ ఛానెల్ ది ముందు వరుస.