యుటర్న్ కోడలి సినిమా.. శైలజారెడ్డి అల్లుడు కొడుకు సినిమా.. దేవదాస్ తండ్రి నాగ్ సినిమా. మూడూ ఓ నెలలోనే విడుదలయ్యాయి. అది కూడా అక్కినేని ఫ్యామిలీకి ఇష్టమైన, ముఖ్యమైన సెప్టెంబర్ నెలలో. అందులో యుటర్న్-శైలజారెడ్డి అల్లుడు ఒకేసారి విడుదలయ్యాయి. పోటా పోటీగా. ఈ పోటీలో సమీక్షల వరకు టాక్ వరకు యుటర్న్ ఓ అడుగు ముందుకు వేసింది. కానీ కలెక్షన్లు యుటర్న్ రేంజ్ వేరు, శైలజారెడ్డి రేంజ్ వేరు. శైలజారెడ్డి అల్లుడు చాలాచోట్ల ఇప్పటికీ ఇంతో అంతో షేర్ తెచ్చుకుంటోంది.
ఇదిలా వుంటే ఈవారం నాగ్ 'దేవదాస్' విడుదలయింది. పైగా ఇందులో నాని కూడా వున్నాడు. పైగా ఈ సినిమా మేకింగ్ అండ్ అదర్స్ అంతాకలిపి నలభై కోట్ల రేంజ్. శైలజారెడ్డి అల్లుడు మేకింగ్ ఒకటికి రెండుసార్లు లెక్కపెట్టినా పాతిక కోట్లే. కానీ ఓపెనింగ్స్ చూసుకుంటే సోలో హీరో, చిన్న హీరో అయినా నాగచైతన్య సినిమాకే ఎక్కువ కలెక్షన్లు రావడం విశేషం. అక్కడ మారుతి పేరు యాడ్ కావడం కలిసి వచ్చింది. ఇక్కడ నాగ్ – నాని కలిసినా కలిసిరాలేదు.
తొలిరోజు శైలజారెడ్డి కలెక్షన్లు కేవలం తెలుగు రాష్ట్రాల వరకు చూసుకున్నా తొలి రోజు 5.45 కోట్లు వచ్చాయి. కానీ నాని-నాగ్ కలిసిన దేవదాస్ మాత్రం తొలిరోజు కలెక్షన్లు 4.57 కోట్ల దగ్గరే ఆగిపోయాయి. రెండు సినిమాలు వీక్ డేస్ లో విడుదలయ్యాయి. శైలజారెడ్డి బుధవారం విడుదలయితే దేవదాస్ గురువారం విడుదలయింది. ఆ విధంగా మొత్తంమీద తొలిరోజు నాగ చైతన్యదే ముందు అడుగు అయింది. అయినా పుత్రోత్సాహం, కోడలోత్సాహం అంటే నాగ్ కు కూడా ఆనందమే కదా?