బిగ్ బాస్ అంటే ఎన్టీఆర్.. ఎన్టీఆర్ అంటే బిగ్ బాస్ అనేంత పేరు వచ్చింది సీజన్ వన్ లో. దాంతో సీజన్ 2 కూడా ఎన్టీఆర్ నే హోస్ట్ అనుకున్నారు అందరూ. అలాగే ఫిక్స్ అయ్యారు. కానీ ఎన్టీఆర్ వ్యక్తిగత కారణాలు, అరవింద సమేత సినిమా ఇవన్నీ కలిసి బిగ్ బాస్ సీజన్ 2కు ఆయన హోస్ట్ గా రాకుండా చేసాయి. హీరో నాని ఆ సీట్ ను టేకోవర్ చేసారు.
సరే, ఆ తరువాత బిగ్ బాస్ 2 ఎలా నడిచింది. నాని కంట్రోలు వుందా? తప్పిందా? జనాల ట్రోలింగ్ అవన్నీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ సీజన్ 2 క్లోజింగ్ సెరమనీకి అయినా ఎన్టీఆర్ వస్తాడని అంతా ఊహించారు. ఎందుకంటే సీజన్ వన్ చేసిన అనుబంధంతో, మా టీవీ మొహమాటంతో వస్తాడని అనుకున్నారంతా. కానీ ఈ విషయంలో మాటీవీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని తెలుస్తోంది.
ఈ వీకెండ్ లో బిగ్ బాస్ సీజన్ 2 ఫంక్షన్ వుంది. కానీ అరవింద సమేత పనుల్లో ఎన్టీఆర్ పీకల్లోతు బిజీగా వున్నారు. అందువల్ల ఈ ఫంక్షన్ కు ఎన్టీఆర్ రాకపోవచ్చని తెలుస్తోంది. అందువల్ల ఆల్టర్ నేటివ్ గెస్ట్ కోసం మాటీవీ వెదుకులాడుతోన్నట్లు బోగట్టా. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్ అందుబాటులో లేరు. మహేష్ వున్నారు కానీ ఇలాంటి వాటికి కొంచెం దూరంగా వుంటారు. ఇక మిగిలింది సీనియర్ హీరోలు నాగ్, వెంకీ.
నాగ్ జస్ట్ రెండు రోజుల ముందే దేవదాస్ కోసం బిగ్ బాస్ హవుస్ కు వెళ్లి వచ్చారు. సో లాస్ట్ అండ్ లీస్ట్ ఆప్షన్ వెంకీ. ఇప్పుడు అందుకే వెంకీ పేరే వినిపిస్తోంది. కానీ వెంకీ-నాని కాంబినేషన్ అంటే అంత జోష్ ఏమీ వుండదు. ఫైనల్ ఎపిసోడ్ కాబట్టి అందరూ ఎలాగూ చూస్తారు. టీఆర్పీ వస్తుంది. కానీ చూసేవాళ్లకు ఏ మాత్రం జోష్ వుంటుందన్నదే డవుట్.
అదే రానా-నాని అయితే ఆ కాంబోనే వేరు. మరి నిర్వాహకులు అటు ఎందుకు ట్రయ్ చేయలేదో? ఎన్టీఆర్, రానా ఈ ఇద్దరిలో ఎవరు వున్నా, ఆ సరదా, ఆ సందడి వేరు. వెంకీ అంటే అందరికీ అలవాటైపోయిన రొటీన్ రొడ్డకొట్టుడే తప్ప వేరే ఏముంటుంది?