బీజేపీతో మాకు శత్రుత్వం లేదు, అలాగని మేం మిత్రులం కాదు అంటూ పదే పదే చెబుతున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇప్పటివరకూ వైసీపీకి బీజేపీకి మధ్య ఉన్న రిలేషన్ ఇలాంటిదే. అయితే ఇప్పుడిది బలపడుతుందని, ఎన్డీఏలో వైసీపీ భాగస్వామి అవుతుందని ఓ ప్రచారం నడుస్తుంది. పవన్ అయితే ఏకంగా దీనిపై ప్రకటన కూడా చేశారు. బీజేపీ-వైసీపీ కలిస్తే తను తప్పుకుంటానంటూ ప్రకటించేశారు. పవన్ సంగతి పక్కనపెడితే…వైసీపీ మాత్రం బీజేపీకి తాను మిత్రుడినో, శత్రువునో తేల్చుకునే సమయం మాత్రం వచ్చేసింది.
ఎన్డీఏలో భాగస్వామి అయ్యే అవకాశం ఉంటే.. జగన్ ఢిల్లీ పర్యటన వ్యవహారాలన్నీ పూర్తయిన తర్వాత ఓ క్లారిటీ వస్తుంది. అలా వియ్యం కుదిరితే మాత్రం సీఏఏ, ఎన్ఆర్సీల అమలుపై వైసీపీకి మారుమాట్లాడే అవకాశం లేనట్టే. ఒకవేళ వైసీపీ ఎన్డీఏలో చేరడం ఊహాజనితమే అయితే.. అటు శత్రుత్వం పెంచుకోడానికి కూడా అంతే అవకాశం కనిపిస్తోంది.
ఏపీ అసెంబ్లీ సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా తీర్మానం చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే సీఎం జగన్ సహా.. మంత్రులు కూడా సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా స్పందించారు. బీజేపీ తమకి తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లే పార్లమెంట్ లో సీఏఏకి అనుకూలంగా ఓటు వేశామని, అలాంటి తప్పు ఇక ఎన్నటికీ చేయబోమని అంటున్నారు నేతలు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా ఏకంగా పదవీ త్యాగానికైనా సిద్ధమంటూ చెబుతున్నారు. అటు మైనార్టీల బలం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సైతం సీఏఏ వ్యతిరేక నిరసనల్లో చురుగ్గా పాల్గొంటూ.. అసెంబ్లీలో వ్యతిరేక తీర్మానం చేస్తామంటూ వారికి భరోసా ఇస్తున్నారు.
ఈనేపథ్యంలో ఇప్పటికే తీర్మానం చేసి కేంద్రానికి సవాల్ విసిరిన రాష్ట్రాల జాబితాలో ఏపీ కూడా చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఇక ఎప్పటికీ ఎన్డీఏలో వైసీపీ చేరలేదు. బయట పుకార్లు నిజమైతే ప్రభుత్వంలో చేరి, మంత్రి పదవులు తీసుకుని సీఏఏకి సలాం కొట్టాలి. అలా కాకపోతే మైనార్టీలకు అండగా సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం చేసి బీజేపీపై యుద్ధం ప్రకటించాలి.
మొత్తమ్మీద ఏదో ఒకటి చేయాల్సిన సమయమైతే ఆసన్నమైంది. ప్రస్తుతం ఉన్నట్టు తటస్థంగా ఉండే పరిస్థితి అయితే రాబోయే రోజుల్లో కనిపించడం లేదు. బంతి ఇప్పుడు వైసీపీ కోర్టులోనే ఉంది. రణమా..? శరణమా..?