ఆయనో సీనియర్ నిర్మాత. పాపం బోలెడు ఖర్చు చేసి,కిందా మీదా పడి ఓ సినిమా తీసారు. క్రేజ్ వున్న హీరో కాబట్టి బాగానే ఖర్చుచేసారు. మంచి లాభాలు వస్తాయి అనుకుంటే విడుదల నాటికి సినిమా మీద నెగిటివ్ ముందుగానే స్ప్రెడ్ అయిపోయింది. దాంతో అమ్మకాలు అన్నీ తారు మారై, పంపిణీగా మారిపోయాయి.
సినిమా డిజాస్టర్ అయిపోయింది. సినిమా చూసిన వాళ్లకు అర్థం అయిపోయింది. హీరో కాళ్లు, చేతులు పెట్టి మరీ కెలికేసాడని. సినిమా విడుదలకు ముందే హీరోనే క్లయిమాక్స్ రాసేసుకున్నాడని, డైరక్టర్ ను పక్కన పెట్టి, తానే అన్నీ చేసేసుకున్నాడని గ్యాసిప్ లు వినిపించాయి. అవి నిజమో కాదో కానీ తీరా సినిమా విడుదలయ్యాక మాత్రం నిజమే అనిపించేసాయి.
ఇలాంటి నేపథ్యంలో ఆ సీనియర్ నిర్మాత హీరోను బండబూతులు తిడుతున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం వేళలో సరాదాగా కూర్చున్నవేళ కలిసిన ప్రతి ఒక్కరికీ, ఓదార్పుగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి, ఇలా అడిగిన వారికి, అడగని వారికి కూడా హీరో తన సినిమాను ఎలా సర్వనాశనం చేసిందీ పూసగుచ్చినట్లు చెబుతున్నారని తెలుస్తోంది.
సినిమా మొత్తం హీరోనే నాశనం చేసేసాడని, తన స్వంత పైత్యాలు అన్నీ జోడించి సినిమాను కెలికేసాడని నిర్మాత వాపోతున్నట్లు తెలుస్తోంది. చిత్రమేమిటంటే సదరు హీరో మీద గతంలో వచ్చిన ఓ భీకర ప్లాప్ విషయంలో కూడా ఇదే వినిపించింది. ఆ సినిమాకు పని చేసిన కొత్త డైరక్టర్ ను డమ్మీని చేసి, అన్నీ తానే చేసేసాడని టాక్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే గ్యాసిప్. మొత్తానికి హీరో అత్యుత్సాహం అతగాడి సినిమాలకు డ్యామేజ్ చేస్తోందని అనుకోవాలేమో?