అయాచితంగా వచ్చిన పబ్లిసిటీని పొలిటికల్ గా క్యాష్ చేసుకుందామనే ప్రయత్నం చేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి వి.లక్ష్మినారాయణ. ఇందులో సందేహాలు ఏమీ లేవు. వైఎస్ జగన్ పై నమోదు అయిన క్విడ్ ప్రో కేసుల విచారణ అధికారిగా.. టీడీపీ అనుకూల వర్గాల చేత హీరోగా పబ్లిసిటీ పొందడం, ఆ పబ్లిసిటీని వీలైనంత త్వరగా వాడుకోవాలని ఈయన ఉద్యోగాన్ని సైతం వదిలేసి, రాజకీయాల్లోకి వచ్చేశారు. ఆ పార్టీ, ఈ పార్టీ అంటూ.. చివరకు జనసేనలో చేరారు!
రాజకీయాల్లోకి రాకముందు తన గురించి తనే చాలా గొప్పలు చెప్పుకున్నారీయన. వంద మంది వివేకానందులను తయారు చేస్తానంటూ గప్పాలు కొట్టుకున్నారు ఈ పెద్దమనిషి. వివేకానందుడు అంటే ఈయనకు కూడా అంత లోకువ అయిపోయినట్టుగా ఉన్నారు పాపం! వందమంది వివేకానందులను తయారు చేయడం మాటేమిటో కానీ, పవన్ కల్యాణ్ ను మాత్రం మార్చలేకపోయారీయన. చివరకు చేసేది లేక తనే పార్టీ మారే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికైతే జనసేనకు రాజీనామా చేయడం అయ్యింది, ఇప్పుడు వేరే బంతిలో చోటు కోసం వెదుక్కొంటున్నట్టుగా ఉన్నారు.
ఈ క్రమంలో ఈయన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ శాఖకు నాయకుడు కాబోతున్నారని లీకులు ఇస్తున్నారు! ఢిల్లీలో ఆప్ మళ్లీ సంచలన విజయం సాధించడంతో.. ఆ పార్టీ ఇమేజ్ ను లక్ష్మినారాయణ కావొచ్చు, ఆయన భజంత్రీలు కావొచ్చు వాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు. ఇప్పటికే ఈయనను కేజ్రీవాల్ పిలిచేశారని, ఏపీ బాధ్యతలు అప్పగించేస్తూ ఉన్నారని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు.
ఇది వరకే పార్టీని నడపలేకపోయిన మరో మేధావి జేపీ కూడా తన పార్టీని లక్ష్మినారాయణకు అప్పగించేస్తానంటూ ప్రతిపాదించారట. అందుకు నో చెప్పి లక్ష్మినారాయణ జనసేనలోకి చేరారు. అక్కడ వివేకానందులను తయారు చేయలేక బయటపడ్డారు. ఇప్పుడేమో కేజ్రీవాల్ ఇమేజ్ ను వాడుకునే లీకులు వస్తున్నాయి! ఇదేనా వివేకానందులను తయారు చేసే ప్రక్రియ?