ప్రశాంత్ కిషోర్.. గెలుపు గుర్రం! గెలిచే గుర్రాన్ని పీకే ఎక్కుతాడా, పీకే ఎక్కిన గుర్రం గెలుస్తుందా అనేది ఒక మిస్టరీగానే మారుతూ ఉంది. ఇదంతా తేలాలంటే పీకే టీమ్ సక్సెస్ మీద పెద్ద పరిశోధనే చేయాలేమో! భారత రాజకీయాల్లో థర్డ్ పార్టీ వ్యూహకర్తల ట్రెండ్ ను మొదలుపెట్టి, తనే సక్సెస్ ఫుల్ గా నడుపుతూ.. సంచలనం అయ్యారు పీకే.
ఇక ప్రశాంత్ కిషోర్ తో దాదాపు నాలుగేళ్ల కిందట ఒప్పందాన్ని చేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 2014లో అందింది అనుకున్న అధికారం చేజారడంతో జగన్ 2019 తనకు కఠిన పరీక్ష అని ముందే ఫిక్సై.. ఐప్యాక్ తో ఒప్పందం చేసుకున్నారు. 2014లో ఘన విజయం సాధించిన సంగతీ తెలిసిందే. మరి జగన్ విజయంలో ఐ ప్యాక్ వాటా ఎంత? అంటే.. ఆ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి.
ఆ అభిప్రాయాలేమిటో వైసీపీ నేతలను కదిలిస్తే తెలుస్తుంది. వాళ్లు ఎలాంటి అభిప్రాయాలతో ఉన్నా.. ఐ ప్యాక్ మీద, ప్రశాంత్ కిషోర్ మీద మాత్రం జగన్ కు బ్రహ్మాండమైన గురి, గౌరవాలు ఉన్నట్టుగా స్పష్టం అవుతూ ఉంది. కేవలం పీకే మీదే కాదు.. పీకే టీమ్ లోని కుర్రాళ్ల మీదే జగన్ కు ఆపేక్ష ఉందని స్పష్టం అవుతూ ఉంది!
ఎక్కడో లక్నోలో జరిగిన పీకే టీమ్ మెంబర్ పెళ్లికి సీఎం జగన్ సతీ సమేతంగా వెళ్లారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఐ ప్యాక్ సభ్యుడు అయిన రిషి అనే వ్యక్తి లక్నోలో పెళ్లి చేసుకున్నాడు.ఆ పెళ్లికి ముఖ్యమంత్రి జగన్, ఆయన భార్య భారతి కూడా వెళ్లారు. పీకే కూడా ఆ పెళ్లిలో ఉన్నారు. వీరంతా కలిసి ఫొటోలు దిగారు!
పీకే టీమ్ లో ఐఐటీ గ్రాడ్యుయేట్లు, పొలిటికల్ సైన్స్ లో పీహెచ్డీ స్థాయి కుర్రాళ్లు ఉంటారు. ఉత్తరాదివారే ఎక్కువ. హైదరాబాదీలూ ఉన్నారు. అలాంటి కుర్రాళ్లకు కూడా జగన్ దగ్గర మంచి గుర్తింపు దక్కినట్టుగా ఉంది. ఫలితాల వెల్లడికి ముందే జగన్ వారితో సమావేశం అయిన సంగతీ తెలిసిందే. మొత్తానికి పీకే టీమ్ లో పని చేస్తే.. ఇలా ముఖ్యమంత్రులకు కూడా సన్నిహితులు అయిపోవచ్చనమాట!