కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలిన వ్యూహాలకు వెళ్తున్నట్టుగా ఉంది. పార్టీ ఓడినప్పుడల్లా ప్రియాంక పేరును తెర మీదకు తీసుకురావడం కాంగ్రెస్ కు కొత్త ఏమీ కాదు. ఇటీవలి ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ చిత్తు అయ్యింది. ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం చలాయించిన చోట ఇలా చిత్తు అయ్యే సరికి కాంగ్రెస్ వాళ్లు ప్రియాంక పార్టీ బాధ్యతలు తీసుకోవాలని అంటున్నారట! అయినా ప్రియాంక ఇప్పటి వరకూ పార్టీ బాధ్యతల్లో లేరని అనడం కాంగ్రెస్ వాళ్లు తమను తాము మోసం చేసుకోవడమే అవుతుంది.
ఆ సంగతలా ఉంటే.. ప్రియాంకను ఇప్పుడు రాజ్యసభకు నామినేట్ చేయబోతున్నారట. త్వరలో వివిధ ఖాళీలు, భర్తీలు ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రియాంకను రాజ్యసభకు నామినేట్ చేయనుందట కాంగ్రెస్ హై కమాండ్. ఇది కచ్చితంగా తప్పు వ్యూహమే అవుతుందని చిన్నపిల్లాడు కూడా చెబుతారు. మామూలుగా ప్రియాంక రాజ్యసభకు నామినేట్ అయి ఉంటే అదేం పెద్ద లెక్క కాదు. అయితే గత ఏడాది లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ తమ కంచుకోట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు!
ఇలాంటి నేపథ్యంలో… ఇప్పుడు ప్రియాంక రాజ్యసభకు నామినేట్ అయితే, ఇక ప్రజల నుంచి డైరెక్టుగా కనీసం ఎంపీలుగా నెగ్గగలమనే విశ్వాసం కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ వాళ్లకు లేనట్టే అవుతుంది. ఇప్పటికిప్పుడు ప్రియాంక రాజ్యసభలో కాంగ్రెస్ గళం వినిపించాల్సిన అవసరం ఏమీ కనిపించడం కూడా లేదు. ఆమెకు రాజకీయంగా సత్తా ఉంటే.. వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రచార సభల్లో, ఇతర రాజకీయ వేదికల మీద వాగ్ధాటిని ప్రదర్శించవచ్చు. రాహుల్ చేత కాదని తేలిపోతూ ఉంది, సోనియాకు వయసు మీద పడుతూ ఉంది. ఇలాంటి క్రమంలో.. లేస్తే మనిషి కాదన్నట్టుగా ప్రియాంకను ఆపి ఉంచినట్టుగా కాంగ్రెస్ వాళ్లు కలరింగ్ ఇస్తున్నారు. ఇలా ఎన్నాళ్లో మరి!