‘రైతులు కోసం పోరాడతా’ అని చెప్పుకోవడం అనేది.. కొత్తగా ప్రజాదరణను గంపగుత్తగా దండుకోవాలని చూసే ప్రతి ఒక్కరికీ ఫ్యాషనైపోయింది. ప్రజాదరణకు అదొక షార్ట్ కట్ మార్గంగా పలువురు భావిస్తున్నారు. ఇక్కడ తమాషా ఏంటంటే… తెలంగాణ రాష్ట్రంలో ఇదే రైతులను బాగుచేసే పోరాటాల పేరు చెప్పుకుంటూ రాజకీయం చేసిన పెద్దాయన, ఇక్కడ సాధించిందంటూ ఏమీ లేదు కానీ, ఇప్పుడు అమరావతి రైతుల కోసం పోరాడుతానని వాగ్దానాలు చేస్తున్నాడు.
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం.. ఇప్పుడు తన పోరాట కార్యక్షేత్రాన్ని అమరావతికి మార్చారు. తెలంగాణ రాష్ట్రం కోసం ముమ్మరంగా పోరాటం సాగుతున్న సమయంలో.. ఐకాసకు నేతృత్వం వహించి.. రాష్ట్రం సాధించిన కోదండరాం.. రాష్ట్రం వచ్చిన తర్వాత.. ప్రొఫెసర్గిరీలోకి వెళ్లిపోయి రిటైర్ కాగానే తిరిగి రాజకీయ బాట పట్టిన సంగతి తెలిసిందే.
తెలంగాణ జనసమితి పేరిట పార్టీ పెట్టుకుని.. కేసీఆర్ సర్కారు రైతులకు ద్రోహం చేస్తున్నదని విమర్శలు గుప్పిస్తూ రాష్ట్రమంతా పర్యటించారు. అప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏజంటుగా పనిచేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే సరిగ్గా ఎన్నికలకు ముందు.. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న కోదండరాం రైతుల పేరిట ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ ప్రజల మనసు గెలవలేకపోయారు.
అమరావతి రైతులు.. తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వంతో సంప్రదించుకోవాల్సిన మార్గం వదిలేసి రకరకాల గిమ్మిక్కులు ప్రదర్శిస్తున్న వైనం ఇటీవలి కాలంలో బాగా జరుగుతోంది. ఆ క్రమంలో భాగంగానే వారు హైదరాబాదు వచ్చి కోదండరాంను కూడా కలిసివెళ్లారు. మేడారం జాతర, షిర్డీ యాత్రలు కూడా నిర్వహించారు. ఇప్పుడు కోదండరాం ఒక సొంత పని మీద అమరావతి వెళ్లినప్పుడు.. అక్కడి రైతులతో కూడా మాట్లాడారు.
అమరావతి రైతులకు న్యాయం జరిగేందుకు తెలంగాణ మేధావులందరినీ తీసుకువచ్చి పోరాడుతానన్నారు. అయితే తనలాంటి మేధావులందరినీ పోగేసుకుని.. ఇంట గెలవకలేకపోయిన.. సొంత రాష్ట్రంలో రైతులకు ఏమీ చేయలేకపోయిన కోదండరాం.. అమరావతి రైతులకు ఏం చేస్తారా? అనే సందేహాలు రేగుతున్నాయి. ఏదో ముఖప్రీతి మాటలతో ఆయన పొద్దుపుచ్చుతున్నారని కూడా పలువురు ఎద్దేవా చేస్తున్నారు.