టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి చెంప ఛెళ్లుమనిపించేలా ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఒక టీవీ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చాడు. సుజనా చౌదరికి పరోక్షంగా ఘాటుగా గడ్డి పెట్టాడు. అంతే కాదు టీడీపీ విధానాల నుంచి బయటికొచ్చి….బీజేపీ పద్ధతులను పాటించాలని హితవు పలికాడు.
వారం క్రితం TV5 చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుజనా చౌదరి తన పార్టీ జాతీయ నేత జీవీఎల్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. రాజధాని విషయంలో జీవీఎల్ నరసింహారావు, మీ (సుజనా) మాటలకు మధ్య వ్యత్యాసం ఎందుకు? కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఆయన చెబుతున్నారని, మీరేమో అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని యాంకర్ ప్రశ్నించాడు.
సుజనా స్పందిస్తూ తాను జీవీఎల్‌ను పరిగణలోకి తీసుకోనని స్పష్టంగా చెప్పాడు. ఆయనకేమీ విశిష్ట అధికారాలు ఉంటాయని అనుకోనని జీవీఎల్‌ను తీసిపడేశాడు. అంతేకాదు, ఒక రాజ్యసభ సభ్యుడిగా తనకెన్ని అధికారాలు ఉంటాయో, జీవీఎల్‌కు కూడా అంతే ఉంటాయన్నాడు. అయినా జీవీఎల్ ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యుడన్నాడు. కాకపోతే ఆయన ఆంధ్రావ్యక్తి మాత్రమే అని తక్కువ చేసి మాట్లాడాడు.
తాజాగా ఆదివారం రాత్రి NTVకి జీవీఎల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. మండలి రద్దు, మూడు రాజధానుల ఏర్పాటులో మీరు చెబుతున్నంత స్పష్టంగా మీ పార్టీ నాయకులు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎందుకు మాట్లాడుతున్నారని యాంకర్ ప్రశ్నించాడు.
జీవీఎల్ స్పందిస్తూ…
‘కొంత మంది విభజన చట్టంలో కొన్ని అంశాలున్నాయని, దాని ద్వారా కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని, కొన్ని డిబేట్స్‌లో చెప్పడం విన్నా. అలా చెప్పే వాళ్లలో కొందరు అధికార ప్రతినిధులు కాదు. కొంత మందికి కేంద్ర పార్టీ, కేంద్ర ప్రభుత్వ ఆలోచనల పట్ల అవగాహన లేదు’ అని ఘాటుగా సమాధానమిచ్చాడు.
అంటే కేంద్ర పార్టీ లైన్ కూడా తెలియదనుకోవాలా? అని యాంకర్ ప్రశ్న.
జీవీఎల్ అంతే తీవ్ర స్వరంతో మాట్లాడుతూ..
‘మరి అదే అనుకోవాలి. నేను చెప్పేదే కేంద్ర పార్టీ, కేంద్ర ప్రభుత్వ లైన్. చాలా స్పష్టంగా చెబుతున్నా ఇది. కొంత మంది తెలుగుదేశం నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. వారికి ఇంకా పాత వాసనలు పోలేదేమో…అది కూడా కొంత ఆస్కారం ఉంది. తప్పనిసరిగా, పూర్తిగా బీజేపీ చెప్పే విధానాలనే వాళ్లు నడుచుకోవాలి’ అని గట్టిగా గడ్డి పెట్టాడు.
సుజనాచౌదరిని దృష్టిలో పెట్టుకునే జీవీఎల్ ఘాటుగా చెప్పాడని బహిరంగ రహస్యం. TV5 ఇంటర్వ్యూలో సుజనాచౌదరి మాట్లాడుతూ జీవీఎల్‌కు విశిష్ట అధికారాలేమీ ఉండవన్నందుకు…జీవీఎల్ NTV వేదికగా ఘాటైన సమాధానమిచ్చాడు. తాను చెప్పేదే కేంద్ర పార్టీ, కేంద్ర ప్రభుత్వ లైన్ అని జీవీఎల్ విస్పష్టంగా, ఖరాఖండిగా చెప్పడం గమనార్హం. అంతేకాదు సుజనాచౌదరికి పాత వాసనలు పోలేదని, బీజేపీ విధానాల ప్రకారమే నడుచుకోవాలని పరోక్షంగా చెబుతూ గట్టిగా హితవు పలికాడు. మొత్తానికి సుజనాచౌదరికి చెంప ఛెళ్లుమనేలా జీవీఎల్ జవాబిచ్చాడనే వాదన వినిపిస్తోంది