తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇళ్లపై జరిగిన ఐటీ రైడ్స్ గురించి తెలుగుదేశం పార్టీ రెండు రకాలుగా స్పందిస్తూ ఉండటం గమనార్హం. ముందుగా తెలుగుదేశం పార్టీ ఈ అంశంతో తమకేం సంబంధం అని ప్రశ్నించింది! శ్రీనివాస్ ఇంటిపై ఐటీ అధికారులు పడగానే సంచలన వార్తలు వచ్చాయి. తొలి రోజే నూటా యాభై కోట్ల రూపాయల వరకూ అక్రమాస్తులను ఐటీ శాఖ అధికారులు గుర్తించినట్టుగా ప్రచారం జరిగింది. చంద్రబాబు నాయుడి వద్ధ సుదీర్ఘ కాలం పని చేసిన శ్రీనివాస్ వద్ద అలాంటి స్థాయిలో ఆస్తులు బయటపడ్డాయనే విషయం సంచలనంగా మారింది.
చంద్రబాబు నాయుడి మాజీ పీఎస్ వద్దే ఆ స్థాయిలో అక్రమాస్తులు బయటపడ్డాయంటే.. అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక ఐదారు రోజుల పాటు ఆ ఐటీ రైడ్స్ జరిగాయి. చివరకు రెండు వేల కోట్ల రూపాయల వరకూ అక్రమాస్తులు వెలుగు చూశాయనే ప్రచారం జరిగింది. అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీ తప్పక స్పందించింది. ఎంతైనా చిక్కింది చంద్రబాబు నాయుడి మాజీ పీఎస్ కావడంతో.. తెలుగుదేశం స్పందించింది. అయితే ఆ వ్యవహారంతో తమకేం సంబంధం అని తెలుగుదేశం ప్రశ్నించింది!
ఆయన చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ అయితే కావొచ్చు కానీ, తమకు సంబంధం లేదన్నట్టుగా టీడీపీ రియాక్షన్ ఇచ్చింది. శ్రీనివాస్ ఉత్తముడు, ఆయన చంద్రబాబు తరహాలోనే నిప్పు.. అంటూ తెలుగుదేశం అప్పుడు వకాల్తా పుచ్చుకోలేదు. ఆయనతో తమకు సంబంధం లేదని ప్రకటించేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది.
అయితే ఇప్పుడు మరో ప్రెస్ నోట్ ను పట్టుకుని.. రెండు లక్షల రూపాయలే అంటూ తెలుగుదేశం నేతలు వెర్రినవ్వులు నవ్వుతున్నారు! అంటే ఇప్పుడు శ్రీనివాస్ తమ వాడే అయినట్టుగా టీడీపీ వాళ్లు రియాక్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు శ్రీనివాస్ తరఫున అధికార ప్రతినిధుల్లా మాట్లాడుతున్నారు టీడీపీ నేతలు. వీళ్ల కథలు మామూలుగా లేవు!