వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి కొడాలి నాని చెపుతున్న మాటలను గమనిస్తే ఇంకో రెండు ఏళ్ళు గడిచిన తరువాత మోడీ సర్కార్ మెడలు వంచడం జగన్మోహనరెడ్డికి పెద్ద కష్టం కాకపోవచ్చు. తన ఇష్టమొచ్చినట్లు కేంద్రాన్ని ఆడించడం అనేది ఆయనకు సాధ్యం కాకపోవచ్చు… తన డిమాండ్ల పట్ల కేంద్రాన్ని సానుకూలంగా స్పందించి చేసుకోవడం ఆయనకు సులువవుతుంది. ఎలా జరుగుతుందో కొడాలి నాని చాలా విపులంగా లెక్కలు చెప్పారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం రాజ్యసభ లో ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. రాజ్యసభలో ప్రతిష్ఠాత్మకమైన కీలక బిల్లులను ప్రవేశ పెట్టే సందర్భాలలో.. బలహీనమైన ఎన్డీఏ సర్కారు తమ కూటమిలో లేని ఇతర పార్టీల మద్దతు మీద ఆధార పడుతూ ఉండటం మామూలే. ఆ క్రమంలో ఇప్పటికే పలు సందర్భాలలో మోడీ సర్కార్ రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. బిల్లులు గట్టున పడేలాగా సహకరించింది.
ఈ సంవత్సరం రాజ్యసభకు జరిగే ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరో నలుగురు సభ్యులు పెరుగుతారు, వచ్చే ఏడాది ఇంకో నలుగురు సభ్యులు పెరుగుతారు. మొత్తం 10 మంది సభ్యుల బలం ఉంటుంది. మోడీ సర్కార్ కు తప్పనిసరిగా అవసరం అయ్యే బలం అది.
అప్పుడు జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి ప్రత్యేక హోదా కూడా సాధించుకు వస్తారని, కొడాలి నాని జోస్యం చెబుతున్నారు. అంటే ఇండైరెక్టుగా మరో రెండేళ్ల వరకు ప్రత్యేక హోదా గురించి ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దని ఆయన ప్రజలకు సంకేతం ఇస్తున్నారు. హోదా అంశానికి వస్తే రెండేళ్ల తర్వాత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం రాజ్యసభలో పెరిగిన తర్వాత కూడా వస్తుందో రాదో చెప్పడం కష్టమే.
కానీ జగన్మోహన్ రెడ్డికి కేంద్రం వద్ద ఇప్పుడు ఉన్న పట్టు కంటే, అప్పుడు మరింత మెరుగైన పరిస్థితి ఉంటుందని ఊహించవచ్చు. పార్లమెంటు ఆమోదం అవసరం అయ్యే కీలకమైన విషయాలను జగన్ ప్రతిపాదించినా కూడా, కేంద్రం వాటికి ఆమోదముద్ర వేయవచ్చు. కనీసం… మోడీ లేదా అమిత్ షాల అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి అవసరం మాత్రం ఉండదు గాక ఉండదు. జగన్మోహన్ రెడ్డి పట్ల కేంద్రంలోని పెద్దలు స్పందించే తీరులో అహంకారం పాళ్ళు… ఖచ్చితంగా తగ్గుతాయని పలువురు విశ్లేషిస్తున్నారు.