అచ్చం తండ్రిలాగానే జగన్ పాలన చేస్తున్నారు. ప్రజల కోసం పరితపించిన వైఎస్సార్ వారసత్వం ఏపీ పాలనలో కనిపిస్తోంది. సంక్షేమ పధకాల నుంచి సామాజిక న్యాయం వరకూ అన్నింటా బలమైన ముద్ర వేసుకున్న జగన్ సిసలైన వైఎస్సార్ వారసుడు అంటూ మరో సినీ ప్రముఖుడు కితాబు ఇచ్చేశారు.
వందల సినిమాలు చేసి నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్లో సీనియర్ నటుడుగా రాణిస్తున్న సుమన్ ఏపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ప్రశంసల జల్లు కురిపించారు. జగన్ ఒక నాయకుడు మాత్రమే కాదు, భావి తరాలకు మేలైన బాట చూపించే రాజనీతికోవిదుడు, ఆయన పాలనలో పరిణతి బాగా కనబరుస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం అని సుమన్ అంటున్నారు.
మూడు రాజధానుల ప్రతిపాదన ఎంతో ముందు చూపు ఉంటే తప్ప ఎవరూ కనీసం ఆలోచించలేరని ఆయన విశ్లేషించారు. అలాగే అన్ని ప్రాంతాలు బాగుండాలని, ఎప్పటికైనా ఏపీ అంతా ఒక్కటిగా నిలవాలన్న ఉద్దేశ్యంతోనే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేశారని ఆయన అంటున్నారు.
ఇక అయిదుగురు ఉప ముఖ్యమంత్రులను ఎంపిక చేసిన తీరు, అందులో పాటించిన సామాజిక న్యాయం చూస్తూంటే జగన్ సామాజిక న్యాయం ఏంటో అర్ధమవుతుందని కూడా సుమన్ చెబుతున్నారు. అనేక సంక్షేమ పధకాల అమలుతో వైఎస్సార్ పాలనను తిరిగి తీసుకువచ్చారని కూడా సుమన్ అంటున్నారు.
ఏపీలో జగన్ పాలన మొదలై ఇంకా తొమ్మిది నెలలు మాత్రమే అయిందని, ఇంతలో మూకుమ్మడిగా అంతా దాడి చేస్తూ విమర్శలు చేయడం దారుణమని కూడా ఈ సీనియర్ నటుడు అభిప్రాయపడ్డారు. జగన్ కి కనీసంగా రెండున్నర ఏళ్ళ పాటు సమయం ఇచ్చి విపక్షాలు విమర్శలు చేస్తే సబబు అని సలహా ఇచ్చారు. మరి ఫలితాలు వచ్చిన రోజునుంచే రెచ్చిపోతున్న ప్రతిపక్షానికి ఇవన్నీ వినిపిస్తాయా.