సినిమా రివ్యూ: నన్ను దోచుకుందువటే

రివ్యూ: నన్ను దోచుకుందువటే రేటింగ్‌: 2.75/5 బ్యానర్‌: సుధీర్‌బాబు ప్రొడక్షన్స్‌ తారాగణం: సుధీర్‌బాబు, నభా నటేష్‌, నాజర్‌, తులసి, వేణు, పృధ్విరాజ్‌, వైవా హర్ష, జీవా తదితరులు సంగీతం: అజనీష్‌ బి. లోక్‌నాధ్‌ కూర్పు:…

రివ్యూ: నన్ను దోచుకుందువటే
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌: సుధీర్‌బాబు ప్రొడక్షన్స్‌
తారాగణం: సుధీర్‌బాబు, నభా నటేష్‌, నాజర్‌, తులసి, వేణు, పృధ్విరాజ్‌, వైవా హర్ష, జీవా తదితరులు
సంగీతం: అజనీష్‌ బి. లోక్‌నాధ్‌
కూర్పు: చోటా కె. ప్రసాద్‌
ఛాయాగ్రహణం: సురేష్‌ రగుతు
నిర్మాత: సుధీర్‌బాబు
రచన, దర్శకత్వం: ఆర్‌.ఎస్‌. నాయుడు
విడుదల తేదీ: సెప్టెంబర్‌ 21, 2018

'నన్ను దోచుకుందువటే' మొదలయ్యే విధానం, పాత్రలని తీర్చిదిద్దిన తీరు, ఫ్రెష్‌గా అనిపించే షార్ట్‌ ఫిలిం బ్యాక్‌డ్రాప్‌ వగైరా అంతా 'దోచుకునేలానే' వుంటుంది. అయితే ఆ సెటప్‌ ఆహ్లాదకర ఆరంభానికి పనికొచ్చిందే తప్ప కథని ఆకట్టుకునేలా ముందుకు నడిపించాల్సిన 'కాన్‌ఫ్లిక్ట్‌' బలంగా లేకపోవడంతో దోచుకోవడం మాట అటుంచి… 'బాగుంది… బాలేదు' అనే బ్యాలెన్సింగ్‌ నడుమ దోబూచులాడుతుంది. పెళ్లిచూపులు చిత్రంలో మాదిరిగా ఇక్కడ యూత్‌ రిలేట్‌ చేసుకునే నేపథ్యాన్ని పాత్రలకి కల్పించినా కానీ కథనం ముందుకి సాగడానికి అనువైన సంఘర్షణ కానీ, ఆ రొమాన్స్‌ని నిలబెట్టడానికి బలమైన సపోర్ట్‌ కానీ కుదరకపోవడం వల్ల 'నన్ను దోచుకుందువటే' సగటు రొమాంటిక్‌ కామెడీగా మిగిలిపోతుంది.

ఉద్యోగం తప్ప మరో ధ్యాస లేని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ (సుధీర్‌) తప్పని పరిస్థితుల్లో తనకో ప్రేయసి వుందని తండ్రిని నమ్మించాల్సి వస్తుంది. దానికోసం ఓ షార్ట్‌ఫిలిం యాక్టర్‌ (నభా నటేష్‌) సాయం తీసుకుంటాడు. నటించడానికి వచ్చిన ఆమెకీ, అతనికీ మధ్య ఏమి జరుగుతుంది, ఎలాంటి పరిణామాలకి ఈ పరిచయం దారి తీస్తుంది, చివరకు ఎలా ముగుస్తుంది?

ఈ కథ ఎటు వెళుతుందీ, ఎలా ముగుస్తుంది అనేది ఎవరి ఊహలకి అయినా ఈజీగానే తడుతుంది. దర్శకుడు నాయుడు ఊహలకి, అంచనాలకి భిన్నంగా నడిపించడానికి ప్రయత్నాలేమీ చేయలేదు. ఆ ప్రయత్నం లేకపోయినా వినోదంతో బలహీనతని కప్పిపుచ్చి ఎంగేజ్‌ చేసే వీలుంది. అలా వినోదంతో రొటీన్‌ కథలు కూడా బ్లాక్‌బస్టర్లవుతాయని రీసెంట్‌గా 'గీత గోవిందం' నిరూపించింది. ఆరంభంలో వినోదం బాగున్నా ఆ తర్వాత సపోర్టింగ్‌ క్యారెక్టర్లు లేకపోవడం, వినోదం కోసం ప్రత్యేకమైన ఎఫర్ట్స్‌ లోపించడంతో ఈ రొమాన్స్‌ వన్‌ డైమెన్షనల్‌గా మారిపోతుంది. అంతే కాకుండా తదుపరి ఏమి జరుగుతుందనేది ఊహలకి అనుగుణంగా సాగుతూ వుండడంతో ముగింపు కోసం నిరీక్షించాల్సి వస్తుంది.

ప్రేమకథలకి ఆకర్షణ జత చేసే పాటలు కూడా లేకపోవడం మరో బలహీనత అయింది. 'ఇంతే ఇంతేనా' పాట మినహా మళ్లీ వినాలనిపించే పాటలు లేవు. సన్నివేశాలు కూడా ఒక దాని తర్వాత ఒకటిగా పేర్చుకుంటూ 'ఫిల్లర్స్‌' మాదిరిగా అనిపిస్తుంటాయి తప్ప ఎఫెక్టివ్‌గా అనిపించవు. ఒకసారి మాట్లాడుకుంటే సాల్వ్‌ అయిపోయే సమస్యని పట్టుకుని సాగదీయడం వల్ల ద్వితియార్థంలో కంటెంట్‌ లేక విసుగొస్తుంది. 'బ్రేక్‌' దగ్గర కథ ఎక్కడుందో… క్లయిమాక్స్‌ వరకు అదే పాయింట్‌లో వుంటుంది.

తన కొడుకు మోసం చేసాడనే సంగతి తండ్రికి తెలిస్తే అనే పాయింట్‌కి ఎఫెక్టివ్‌ పే ఆఫ్‌ లేకపోవడంతో పతాక సన్నివేశాలకి కూడా చలనం రాకుండా పోయింది. అక్కడక్కడా సునిశిత హాస్యంతో ఆకట్టుకోవాలనే ప్రయత్నమైతే జరిగింది కానీ ఆయా సన్నివేశాలు అంతగా క్లిక్‌ అవకపోవడం వల్ల సినిమాకి బెనిఫిట్‌ అవలేకపోయాయి. ఉదాహరణకి జూనియర్‌ ఆర్టిస్ట్‌ శ్యామల పాత్రని పరిచయం చేయడం, క్లయిమాక్స్‌లో ఫోన్‌ లైన్‌లోకి తీసుకురావడం కామెడీ కోసం చేసిన ప్రయత్నమే కానీ అది పూర్తిగా విఫలమయింది.

సుధీర్‌ బాబు సీరియస్‌ రోల్‌లో బాగానే ఒదిగిపోయాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో మెప్పించాడు. 'బొమ్మరిల్లు హాసిని' తరహా పాత్రలో నభా నటేష్‌ పాత్రకి తగ్గ అల్లరిని అభినయించింది. నాజర్‌ అనుభవం ఎమోషనల్‌ సీన్స్‌లో పనికొచ్చింది. తులసి, వేణు, జీవా, పృధ్వీరాజ్‌ సహాయ పాత్రలు పోషించగా, హాస్యానికి వైవా హర్ష, షణ్ముక్‌ తదితర యూట్యూబ్‌ స్టార్స్‌ నటన కొంతవరకు దోహదపడింది. సాంకేతికంగా చెప్పుకోతగిన మెరుపులు ఏమీలేవు కానీ దర్శకుడు నాయుడు నేటితరానికి నచ్చే నేపథ్యాన్ని అయితే ఎంచుకోగలిగాడు కానీ చిన్న కాన్‌ఫ్లిక్ట్‌పై బేస్‌ అయిన లవ్‌స్టోరీని ఆకట్టుకునేలా నడిపించలేకపోయాడు.

హాస్యాన్ని, భావోద్వేగాలని కూడా దర్శకుడు ప్రతిభావంతంగా తెరమీదకి తీసుకురాగలిగాడు. బలమైన కథ వుంటే దానిని జనరంజకంగా మలిచే లక్షణాలైతే తనలో పుష్కలంగా వున్నాయనిపించాడు. ఎంత కొత్త సెటప్‌ తీసుకున్నా ప్రేమకథల్లో వచ్చే మలుపులన్నీ రెగ్యులర్‌గానే అనిపిస్తాయి. ఎక్కడో ఒకటీ అరా ప్రేమకథలు తప్ప చాలా వాటిలో 'క్లీషేస్‌' తప్పవు. అలాంటి సమయంలోనే సహాయక పాత్రలని ప్రవేశపెట్టి డ్రామా రొటీన్‌ అవుతోన్న చోట 'కామెడీ'కి స్పేస్‌ క్రియేట్‌ చేస్తుంటారు. అలాంటి పాత్రలు క్లిక్‌ అయినపుడు సదరు రొటీన్‌ ప్రేమకథలే అద్భుత విజయాలు అందుకున్న ఉదాహరణలు కోకొల్లలు.

కానీ ఈ చిత్ర దర్శకుడు నాయుడు మాత్రం నాయికానాయకుల మీదినుంచి ఫోకస్‌ తప్పించడానికి అస్సలు ఇష్టపడలేదు. వారి పాత్రలకి వున్న పట్టింపులు, ఇబ్బందుల వల్ల వారి మధ్య తగినంత డ్రామా పండలేదు. ఇటు హీరో తండ్రితో, అటు హీరోయిన్‌ తల్లితో పెట్టుకున్న ఎమోషన్స్‌ ఏమో కథని తదుపరి స్థాయికి తీసుకుని వెళ్లేంత బలంగా కుదర్లేదు. ఇంటర్వెల్‌ పాయింట్‌ దగ్గర స్టక్‌ అయిపోయిన కథకి క్లయిమాక్స్‌లో విడుదల దొరుకుతుంది. కానీ ఈ పాయింట్‌ నుంచి ఆ పాయింట్‌ వరకు రీచ్‌ అవడానికి పడ్డ అవస్థలే ఈ ప్రేమకథ స్థాయిని సయితం సగటుకి పరిమితం చేసేసాయి.

బాటమ్‌ లైన్‌: దోచుకోలేదులే!
-గణేష్‌ రావూరి