గ్రామ, వార్డు వాలంటీర్ ఉద్యోగాలన్నీ వైసీపీ బ్యాచ్ కే కట్టబెట్టారంటూ ఓవైపు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. పనిలేకపోయినా వారికి నెలనెలా 5వేలు జీతమిస్తున్నారంటూ ఆడిపోసుకుంటున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరు. వాలంటీర్ వ్యవస్థను ఏ క్షణాన మొదలు పెట్టారో కానీ, జగన్ నవరత్నాలలో అన్నిటికంటే వేగంగా విజయవంతమైన వ్యవస్థ ఇదే. అందరికంటే కష్టమైన పని కూడా ఇదే.
పేరుకి వాలంటీర్లకు 50ఇళ్లు అన్నమాటే కానీ.. నిత్యం ఆ 50ఇళ్ల సమాచారం వారి వద్ద ఉండాల్సిందే. లబ్ధిదారులు ఎక్కువగా లేని పట్టణాల్లో పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నా.. గ్రామాల్లో మాత్రం వాలంటీర్లకు వాచిపోతోంది. అటు పంచాయతీ సెక్రటరీలు, ఇటు వీఆర్వోలు, మున్సిపాల్టీల్లో కమిషనర్లు వాలంటీర్లను పని విషయంలో పిండేస్తున్నారు.
ఇంటి వద్దకే పింఛన్ కార్యక్రమం మొదలైన రోజు.. ఉదయాన్నే 4 గంటల నుంచి వీరు పనిమొదలు పెట్టారు. అమ్మఒడి, రైతు భరోసా.. ఇలా ప్రతి పథకం అమలులో వీరిదే ముఖ్యపాత్ర. ఇక సచివాలయాల ఉద్యోగాలు మరోవైపు. వీరికి తల ఒక్కింటికి జీతం 15వేలు. వాలంటీర్ల కంటే మూడు రెట్లు ఎక్కువ. పరీక్షల్లో పోటీపడి ఉద్యోగం తెచ్చుకున్నారు. వాస్తవానికి వాలంటీర్ల పనిలో వీరికి సగం పనికూడా లేదు.
గొడ్డు చాకిరీ వాలంటీర్లది, జీతం మాత్రం సచివాలయ ఉద్యోగస్తులది అన్నట్టుంది పరిస్థితి. అందులోనూ వాలంటీర్ కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగమే, ఏ క్షణాన అయినా తీసేయొచ్చు. అంతమాత్రాన ఆషామాషీ వాళ్లు ఉన్నారా అంటే, వారి క్వాలిఫికేషన్లు వింటే షాకవుతాం. పీజీలు చదివినవాళ్లు కూడా 5వేల కోసం వాలంటీర్లుగా చేస్తున్నారు. టాలెంట్ సంగతి పక్కనపెడితే, వాలంటీర్ ఉద్యోగం బాగా కష్టం, అందులో శ్రమ ఉంది. పంచాయతీ సెక్రటరీలకు మాత్రాం ఇంకా పూర్తిస్థాయిలో పనివిభజన జరగలేదు. ఒకవేళ పని విభజన జరిగినా.. ఒకరిద్దరికి మినహా మిగతా వారంతా టైమ్ కి వచ్చి, టైమ్ కి వెళ్లిపోవడమేనంటున్నారు. దీంతో గ్రామాల్లో వాలంటీర్లు వర్సెస్ సచివాలయాల ఉద్యోగులు అనే భేదం మొదలైంది.
ఓవైపు సచివాలయ ఉద్యోగులకు తక్కువ పనికి, ఎక్కువ వేతనాలు చెల్లిస్తోన్న ప్రభుత్వం, తమపై ఎందుకు వివక్ష చూపుతోందని ప్రశ్నిస్తున్నారు వాలంటీర్లు. తమ కష్టాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో వాలంటీర్ల జీతం పెంచడం అసాధ్యమే కానీ, వారి కష్టాన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం జగన్ కనికరించే అవకాశముంది. మరి క్షేత్రస్థాయి వాస్తవాలు.. ఆయనదాకా ఎప్పుడు వెళ్తాయో చూడాలి.