యనమల రామకృష్ణుడు మాటల నేపథ్యంలో అధికార వికేంద్రీకరణ, అమరావతి నుంచి రాజధాని తరలింపు వ్యవహారాలు ఎంత త్వరగా ముందుకు సాగుతాయో అనుమానంగానే ఉంది. నిజమో కాదో మనకు తెలియదు గానీ… జగన్మోహన్ రెడ్డి అధికార వికేంద్రీకరణ బిల్లు గురించి… ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఎదుట ప్రస్తావించి సహకరించాలని కోరినప్పుడు… ఆ వ్యవహారం కోర్టులో ఉన్నది గనుక, కోర్టు తీర్పు వచ్చిన తర్వాత పరిశీలిద్దాం అని అన్నట్లుగా లీకులు బయటకు వస్తున్నాయి! మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఈ విధమైన సమాచారం తనకు తెలిసినదంటూ మీడియాకు వెల్లడించారు.
అదే నిజమైతే కోర్టులో పిటిషన్, విచారణ వ్యవహారం మొత్తం తేలేదాకా రాజధాని తరలింపు జరగకపోవచ్చు. ఇప్పటికే తమ ఆదేశాలను ఖాతరు చేయలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. విజిలెన్స్ కార్యాలయాన్ని కర్నూలు కు తరలించే ప్రయత్నం చేసినందుకు చిన్న వివాదం రేగింది. అసలు రాజధాని తరలింపు గురించి, ప్రభుత్వం ఇప్పుడప్పుడే కోర్టును దిక్కరించేలాగా సాహసం చేయకపోవచ్చు.
రాజధాని తరలింపు విషయంలో ఆలస్యం అంటూ జరిగితే గనుక… అది శాసనమండలి చైర్మన్ చేసిన సెలెక్ట్ కమిటీ ఆదేశాల ద్వారా జరగవచ్చునని అనుకున్నారు. ప్రభుత్వం కూడా దానికి తగ్గట్లుగానే సిద్ధపడింది. అసలు సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యమే కాదు అంటూ… శాసనసభ కార్యదర్శి చైర్మన్ ఉత్తర్వులను తిప్పి పంపడం ద్వారా ఒక సందిగ్ధావస్థ కు బీజం వేశారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శాసన సభ తీర్మానం ద్వారా శాసనమండలిని రద్దు చేసింది కూడా. ఆ రకంగా ఆ వైపు నుంచి రాజధాని తరలింపు ప్రమాదానికి ముప్పు తప్పినట్లే అని అంతా అనుకున్నారు.
అయితే రాజధాని తరలింపునకు అసలు కోర్టు కేసుల నేపథ్యంలో ఇంకా మిగిలే ఉంది. ఆదేశాలు ఇచ్చేవరకు రాజధానిని తరలిస్తే ఖర్చులను అధికారుల నుంచి వసూలు చేస్తామన్న కోర్టు హూంకరింపు.. తీవ్రమైనదే. విజిలెన్స్ కార్యాలయం విషయంలో ఎదురైన మందలింపు వలన మళ్లీ అలాంటి చొరవ ఎవరూ తీసుకోకపోవచ్చు. యనమల రామకృష్ణుడు చెబుతున్నది నిజమైతే కేంద్రం కూడా, కోర్టు తీర్పు వచ్చేవరకూ సహకరించకపోవచ్చు. ఆ రకంగా మరికొంత కాలం జాప్యం తప్పదని అనుకోవాల్సి వస్తోంది.