ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో భారతీయ క్రీడాభిమానులు ఆశించిన దానికి భిన్నంగా మన బ్యాటింగ్ సాగుతోంది. అహ్మదాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్దదైన మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైంది. ఆస్ట్రేలియా టాస్ గెలవడంతో ఫీల్డింగ్‌ను ఎంచుకుంది.
భారత్ కెప్టెన్ రోహిత్‌శర్మ, శుభమన్ గిల్ ఓపెనర్లగా బరిలో దిగారు. మొదటి ఓవర్లో మూడు పరుగులే వచ్చాయి. ఆ తర్వాత ఓవర్లో 10 పరుగులు చేసి, శుభారంభాన్ని ఇచ్చారు. 4.2 ఓవర్లో గిల్ నాలుగు పరుగులకే ఔట్ అయ్యారు. అప్పటికి భారత్ స్కోర్ 30 పరుగులు. భారత్ క్రీడాభిమానులను గిల్ నిరాశపరిచారు.
ఆ తర్వాత విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చారు. రోహిత్, కోహ్లీ ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. స్కోర్ బోర్డుపై భారత్ పరుగుల వర్షం కురిపిస్తుండగా 9.4 ఓవర్ల వద్ద రోహిత్ 47 పరుగులకు ఔట్ అయ్యాడు. అప్పటికి రోహిత్ నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 30 బాల్స్‌లో 47 పరుగులు చేయడం విశేషం. రోహిత్ ఔట్ అయ్యేసరికి భారత్ స్కోర్ 76 పరుగులు.
రోహిత్ ఔట్ కావడంతో ఆస్ట్రేలియా క్రీడాకారుల్లో జోష్ పెరిగింది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. 10.2 ఓవర్లలో 81 పరుగుల వద్ద మూడో వికెట్‌గా శ్రేయస్ కీపర్‌గా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. వరుసగా వికెట్లు పడడంతో కోహ్లి, రాహుల్ నెమ్మదిగా స్కోర్ పెంచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 16 ఓవర్లకు 100 పరుగులు చేయగలిగారు. ఇదే సందర్భంలో 56 బాల్స్‌లో కోహ్లి 50 పరుగులు చేయడం విశేషం.
ఆ తర్వాత 28.3 ఓవర్లలో 148 పరుగుల వద్ద కోహ్లి ఔట్ అయ్యాడు. దీంతో వాళ్లిద్దరి మధ్య 67 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత జడేజా బ్యాటింగ్‌కు వచ్చాడు. 22 బంతులు ఎదుర్కొన్న జడేజా 9 పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నాడు. జడేజా ఔట్ అయ్యేటప్పటికి భారత్ స్కోర్ 182 పరుగులు. జడేజా ఔట్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు వచ్చాడు.
ఈ కథనం రాసే సమయానికి 38వ ఓవర్ జరుగుతోంది. కేఎల్ రాహుల్ 58, యాదవ్ ఒక పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంకా 12 ఓవర్లు మిగిలి ఉన్నాయి. వరల్డ్ కప్‌లో ప్రతి మ్యాచ్‌లోనూ గెలుపొందుతూ ఫైనల్‌కు చేరిన భారత్ జట్టు …ఆస్ట్రేలియాతో కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో తడబడడం మన క్రీడాభిమానులను కాస్త నిరాశకు గురి చేస్తోంది. అయితే క్రికెట్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు. భారత్ జట్టు ఎంత స్కోర్‌ను టార్గెట్‌గా పెడుతుందనేది ప్రధానం. ఆ తర్వాత మన బౌలర్లు ఎంత వరకు కట్టడి చేస్తారనే దానిపై మన విజయం ఆధారపడి వుంటుంది. తినబోతు రుచి చూడడం ఎందుకు? మ్యాచ్‌ను ఆస్వాదిద్దాం.