బీజేపీ ఖర్చుతో పవన్ కల్యాణ్ ప్రాక్టీస్ మ్యాచ్!

తిరుపతి ఎంపీ ఉప ఎన్నికను పవన్ కల్యాణ్ ఎందుకు అంత సీరియస్‌గా తీసుకుంటున్నారు. తలకిందులుగా తపస్సు చేసినా సరే.. తిరుపతిలో విజయం కాదు కదా.. లక్ష ఓట్లు సాధించడం కూడా.. గగనం అని అందరూ…

తిరుపతి ఎంపీ ఉప ఎన్నికను పవన్ కల్యాణ్ ఎందుకు అంత సీరియస్‌గా తీసుకుంటున్నారు. తలకిందులుగా తపస్సు చేసినా సరే.. తిరుపతిలో విజయం కాదు కదా.. లక్ష ఓట్లు సాధించడం కూడా.. గగనం అని అందరూ అంచనా వేస్తున్న సమయంలో.. పవన్ కల్యాణ్ మాత్రం సీరియస్ గా అక్కడ ఎన్నికల ప్రచార సభను కూడా నిర్వహించి.. తన పార్టీ శ్రేణులను ఉత్తేజపరచి, తాను కోవిడ్ భయంతో క్వారంటైన్ లో ఉన్నప్పటికీ.. నాదెండ్ల మనోహర్ ను అక్కడే ఉంచి ఎందుకింత ఎఫర్ట్ పెడుతున్నారు. దీనికి సంబంధించిన సీక్రెట్.. స్వయంగా నాదెండ్ల మనోహరే.. ఆదివారం నాడు బయటపెట్టారు.

కూటమి అభ్యర్థి గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపు ఇచ్చిన నాదెండ్ల మనోహర్.. నాయుడుపేటలో జెపి నడ్డా సభకు పవన్ కల్యాణ్ డుమ్మా కొడుతున్నారనే సంగతిని చాలా తెలివిగా బయటపెట్టారు. ఆయన ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారని సెలవిచ్చారు. 

తన వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది గనుక.. తాను క్వారంటైన్ లోకి వెళుతున్నట్టుగా ఒక్క రోజు ముందే పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేయడం.. ఆ వెంటనే నాయుడు పేట సభకు రావడం లేదని.. నాదెండ్ల ప్రకటించడం గమనిస్తే.. ప్రచారానికి రెండోసారి వెళ్లకుండా డుమ్మా కొట్టడానికే.. జెపి నడ్డా సభకు తాను గైర్హాజరు కావడానికే ఈ ఎత్తుగడ అని ఎవరికైనా అర్థమవుతుంది. నిజానికి పవన్ సిబ్బందికి పాజిటివ్ వచ్చి నాలుగైదు రోజులు పైనే అయింది… అయితే.. ఆయన క్వారంటైన్ ప్రకటన మాత్రం.. తాజాగా వచ్చింది. అదీ సంగతి.

ఆ సంగతి పక్కన పెడితే.. తిరుపతి మీద ఇంత కాన్సంట్రేట్ చేయడంలొని అసలు సీక్రెట్ నాదెండ్ల మనోహర్ బయటపెట్టారు. తిరుపతి ఉపఎన్నిక మనకు వార్మప్ మ్యాచ్ వంటిదని నాదెండ్ల మనోహర్ తమ పార్టీ స్థానిక నాయకుల సభలో ప్రకటించారు. అంటే.. బీజేపీ నాయకులు ఎన్నికల ఖర్చులు పెట్టుకుంటూ ఉండగా.. వారి ఖర్చులతో జనసేన తాము ఎన్నికలకు సిద్ధం కాగల తీరు గురించి ప్రాక్టీసు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. 

జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో కార్యకర్తల వ్యవస్థ అనేది చాలా పెద్ద బలహీనత అనేది అందరికీ తెలుసు. ప్రజలే నా కార్యకర్తలు, క్షేత్రస్థాయి వ్యవస్థ.. నాకు ఇంకో వ్యవస్థ అక్కర్లేదు.. అంటూ సినిమా డైలాగులు పలికిన పవన్ కల్యాణ్.. ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆ సంగతి గుర్తెరిగారు. అలాగని ఉన్నపళంగా క్షేత్రస్థాయి వ్యవస్థను సెట్ చేసేసుకోవడం అంత ఈజీ ఏమీ కాదు.

ఇప్పుడు తిరుపతి ఉపఎన్నిక వచ్చింది. బీజేపీ పోటీచేస్తోంది. పవన్ కల్యాణ్ ప్రచారాన్ని, వారి పార్టీ సహకారాన్ని బీజేపీ కోరుకుంటోంది. వారికి కాగల సమస్త ఖర్చులను కూడా బీజేపీ నాయకులు పెట్టుకోడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ బలంతో కలిపి.. తిరుపతి ఎంపీ నియోజకవర్గ పరిధిలో వీలైనన్ని ఎక్కువ ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారు. మొత్తానికి నాదెండ్ల మనోహర్.. ఈ రకంగా బీజేపీ ఖర్చులతోనే.. జనసేన కేడర్ కు ఎన్నికల ప్రాక్టీస్ అయిపోవాలని అనుకుంటున్నట్లుగా ఉంది.

5 శాతం ఓట్లు కూడా రాకుండా.. పక్కాగా ఓడిపోయే పార్టీ కూడా.. ఫలితాలు వెలువడే వరకు.. తాము ఘంటాపథంగా గెలుస్తాం అని చెబుతుంది. కానీ నాదెండ్ల మనోహర్ మాత్రం.. ఎన్నికలకు ముందుగానే.. ఇక అంతా అయిపోయినట్లుగా.. చేతులెత్తేసినట్లుగా.. మనకిది వార్మప్ మ్యాచ్ అని ప్రకటించడం ఆలోచించాల్సిన విషయం. 

నాదెండ్ల గారికి తెలుసో లేదో.. వార్మప్ మ్యాచ్ అనేది ఎవ్వరూ కూడా.. తమ శక్తియుక్తులు, సామర్థ్యాలు మొత్తం బయటపడేలా.. ప్రత్యర్థులకు వాటి గురించి తెలిసిపోయేలా.. ఆడరు.. ఏదో ప్రాక్టీస్ కోసం మాత్రమే ఆడుతారు. బహుశా నాదెండ్ల మనోహర్ కూడా తమ పార్టీ శ్రేణులకు అదే సంకేతం ఇస్తుండవచ్చు.