ప్రజలే బలవంతులు జగన్

మొండివాడు రాజు కన్నా బలవంతుడు. ఆ మొండివాడి కన్నా బలవంతుడు జగన్. అందులో సందేహం లేదు. కానీ రాజుకున్నా, మొండివాడికన్నా, అంతకు మించి జగన్ కన్నా జనమే బలవంతులు. ఆ సంగతి జగన్ గ్రహించాలి.…

మొండివాడు రాజు కన్నా బలవంతుడు. ఆ మొండివాడి కన్నా బలవంతుడు జగన్. అందులో సందేహం లేదు. కానీ రాజుకున్నా, మొండివాడికన్నా, అంతకు మించి జగన్ కన్నా జనమే బలవంతులు. ఆ సంగతి జగన్ గ్రహించాలి. ఏ జనం అయితే మొండిగా చంద్రబాబును పక్కన పెట్టి తలకెత్తుకున్నారు అన్నది గమనించాలి. అదే మొండితనం తన మీద చూపించే అవకాశం తాను ఇవ్వకూడదని గుర్తించాలి. మాట్లాడకుండా మొండిగా వుండిపోతే పనులు అన్నీ సాఫీ అయిపోతాయని అనుకోవడానికి లేదు. 

ప్రతిపక్షాలు కావచ్చు, ప్రతిపక్ష అనుకూల మీడియా కావచ్చు. ప్రశ్నిస్తున్న, నిలదీస్తున్నఅంశాలు కొన్ని వున్నాయి. అవన్నీ అధికారంలోకి రాకముందు వైఎస్ జగన్ కావచ్చు, ఆయన సాక్షి మీడియా కావచ్చు, చాలా గట్టిగా ప్రచారంలోకి తెచ్చినవే. జగన్ పై విశాఖ విమానాశ్రయంలో దాడి సంఘటన. జగన్ బాబాయ్ వివేకా హత్య కేసు ఈ రెండూ కీలకమైనవి. ఈ రెండింటిని ఎన్నికల ముందు సిబిఐ కి ఇవ్వాల్సిందే అని జగన్ తెగ పట్టుపట్టారు. 

సరే అధికారంలోకి వచ్చారు. కానీ తను అధికారంలో వుండగానే తనే సిబిఐ కి ఇవ్వాలంటే తన ఆధీనంలో వున్న పోలీస్ శాఖను తనే అవమానించినట్లు, అనుమానించినట్లు అవుతుందని ఊరుకున్నారు. సరే, అది మంచి ఆలోచనే అనుకుందాం. కానీ నిజా నిజాల నిగ్గు తేల్చాలి కదా. కానీ జగన్ ఆ దిశగా ఆలోచిస్తున్నట్లే కనిపించడం లేదు. పోలీసు శాఖ కూడా తమ సిఎమ్ మీద గతంలో హత్యాయత్నం జరిగిన వైనం దర్యాప్తుచేయడం పై పెద్దగా ఆసక్తి కనబరుస్తున్నట్లు లేదు. 

ఇక వివేకా హత్య కేసు మరీ కీలకం. ఇది జగన్ ఇంటి కేసు. తన స్వంత బాబాయ్ ను ఎవరు? ఎందుకు? చంపారు అన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత జగన్ మీద వుంది. పైగా ఈ కేసు విషయంలో స్వంత ఇంటి నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. అందువల్ల వాటిపై క్లారిటీ కావాల్సి వుంది. జనం కూడా ఇలాంటి కేసులను నిశితంగా ఫాలో అవుతుంటారు. 

జగన్ సైలంట్ గా వుండిపోతే, ప్రత్యర్థులు చేసే ఆరోపణలు మరింత బలంగా మారిపోతుంటాయి. ఈ కేసు విషయంలో వివేకా స్వంత కూతురే గట్టిగా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి నిజాలు ఎలాంటివైనా వెలుగులోకి తెచ్చేయడం బెటర్. 

ఈ విషయాలు అలా వుంచితే వకీల్ సాబ్ అదనపు ఆటల సంగతి అలా వుంచితే టికెట్ ల వ్యవహారం లో కూడా అడ్డగోలుగా వ్యవహరించారనే చెప్పాలి.అదనుపు ఆటలకు అనుమతి ఇవ్వాలని రూలేమీ లేదు. కానీ ఇదే రూలును అన్ని సినిమాలకు అమలు చేసి, అదే విధానంగా చేసుకోవచ్చు. కానీ టికెట్ ల రేట్ల విషయంలో మాత్రం తొందరపడ్డారు. 

నిజంగా టికెట్ ల రేట్లు స్ట్రీమ్ లైన్ చేయడం అవసరమే.కానీ దానికి పద్దతి ఇది కాదు. ఇండస్ట్రీలో వాళ్లతోనే ఓ కమిటీ వేసి, దాని సిఫార్సులు తీసుకుని, వాటికి అనుగుణంగా, వాటికి కాస్త అటు ఇటుగా రేట్లు ఫిక్స్ చేసి వుంటే ఎవ్వరూ పల్లెత్తు మాట అనడానికి వీలువుండేది కాదు. కానీ ఇప్పుడేమయింది. అనవసరంగా పవన్ ఇమేజ్ ను పెంచినట్లు అయింది. 

జగన్ చుట్టూ వున్నవారు ఎవరో ఇలాంటి తప్పుడు సలహా ఇచ్చి వుంటారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే జగన్ ఒకరి సలహాలు వినే రకం కాదు. అందువల్ల ఈ 'క్రెడిట్' ఆయనదే. దీనివల్ల వచ్చే ఇబ్బందులు కూడా ఆయన ఖాతాలోకే చేరుతాయి. ఏమైనా జగన్ కొంచెం మారాలి. 

జనం మనోభిప్రాయాలు గమనించాలి. అవసరం అయితే దానికి అనుగుణంగా తమ మొండితనం వీడాలి.లేదూ అంటే జనం మొండిగా మారితే 2023 నాటికి కష్టం అవుతుంది. ఇలా చెప్పడానికి మొహమాటపడనక్కరలేదు. జనం నాడి గమనిస్తే చాలు.