అనేక సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టి బీజేపీ ఢిల్లీ పెద్దలను ఒప్పించి పవన్‌కల్యాణ్ కుదుర్చుకున్న పొత్తు ఉన్నట్టా? లేనట్టా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. బీజేపీ చీఫ్ నడ్డాతో చర్చించి ఢిల్లీ వేదికగా పొత్తుకు ఆమోద ముద్ర వేయించుకొచ్చి, అమరావతిలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కన్నా లక్ష్మినారాయణ, పురందేశ్వరి, సోము వీర్రాజు తదితర నేతలతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా బీజేపీ, జనసేన నాయకులు ఉమ్మడి కార్యాచరణ ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఏ కార్యక్రమమైనా కలిసే చేయాలని నిర్ణయానికి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరోసారి అత్యవసరంగా పోయిన నెలాఖరులో ఢిల్లీలో బీజేపీ -జనసేన నేతలు సమావేశమయ్యారు. ఫిబ్రవరి 2న అమరావతిలో రాజధాని రైతులకు మద్దతుగా లాంగ్‌మార్చ్ నిర్వహిస్తామని కన్నా లక్ష్మినారాయణ, పవన్‌కల్యాణ్ సంయుక్తంగా ప్రకటించారు.
ఆ తర్వాత ఏమైందో కానీ….ఆ కార్యక్రమం రద్దైంది. రాజధాని ప్రాంతంలో పర్యటించిన బీజేపీ, జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు రైతులు గట్టిగా నిలదీశారు. ఇంతకూ రాజధానిపై మీ పార్టీల వైఖరి ఏంటి? లాంగ్‌మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించి ఎందుకు రద్దు చేసుకున్నారు… తదితర ప్రశ్నలు వేసి రెండు పార్టీల నేతలను నిలదీశారు. ఆ తర్వాత పవన్ సినిమా షూటింగ్‌లకు పరిమితమయ్యారు. బీజేపీ నేతలు ప్రెస్‌మీట్‌లకు, సోషల్ మీడియాలకు, టీవీ చర్చలకు మాత్రమే పరిమితమయ్యారు.
మూడు రోజుల క్రితం కర్నూల్‌లో పవన్‌కల్యాణ్ బీజేపీతో సంబంధం లేకుండా పర్యటించారు. మూడేళ్ల క్రితం సుగాలి బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన దోషులను కఠిన శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆయన కర్నూల్‌లో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. ఆ మరుసటి రోజు కూడా కర్నూల్ జిల్లా పర్యటన కొనసాగించారు. ఎక్కడా బీజేపీ జెండా , కార్యకర్తలు కనిపించలేదు.
తాజాగా శనివారం పవన్ రాజధాని ప్రాంతంలో పర్యటనకు షెడ్యూల్ విడుదల చేశాడు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి ఉదయం 9 గంటలకు ర్యాలీగా బయల్దేరి యర్రబాలం చేరుకుంటారు. 10 గంటలకు మందడం, 10.30కు వెలగపూడి, 11 గంటలకు రాయపూడి, 11.30కు తుళ్లూరు, 12 గంటలకు అనంతవరం గ్రామాల్లో పర్యటించేదుకు ప్రణాళిక వేసుకున్నారు.
ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటనలు ఇచ్చిన రెండు పార్టీల నాయకులు…కనీసం రెండు మూడు వారాలు కూడా కలిసి ఉండలేకపోయారా? ఎందుకని ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహించలేకున్నారనే చర్చ ఆ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య జరుగుతోంది. ఇంతకూ బీజేపీ -జనసేన మధ్య పొత్తు ఉన్నటా? లేనట్టా?