సెలక్టు విషయంలో ప్రతిష్టంభన!

రాజుగారు కొరడా దెబ్బలు కొట్టమని ఆదేశించగలరు! అదే కొరడా చేతపట్టుకుని దెబ్బలు కొట్టవలసిన ఉద్యోగి.. ‘నేను కొట్టను పో’ అని మిన్నకుండిపోతే రాజుగారు ఏం చేయగలరు? రాజంతటి వాడు.. స్వయంగా సింహాసనం దిగివచ్చి, కారాగారానికి…

రాజుగారు కొరడా దెబ్బలు కొట్టమని ఆదేశించగలరు! అదే కొరడా చేతపట్టుకుని దెబ్బలు కొట్టవలసిన ఉద్యోగి.. ‘నేను కొట్టను పో’ అని మిన్నకుండిపోతే రాజుగారు ఏం చేయగలరు? రాజంతటి వాడు.. స్వయంగా సింహాసనం దిగివచ్చి, కారాగారానికి వచ్చి.. ఒక సాధారణ కిందిస్థాయి ఉద్యోగిలాగా కొరడా చేతిలోకి తీసుకుని.. తానై కొట్టలేడు కదా! అందుకు నిబంధనలు ఒప్పుకోవు కదా. మరైతే ఏమిటి తరణోపాయం?… ఈ సరదా కథలోని కామెడీ ట్విస్టు అచ్చంగా ఇప్పుడు శాసనమండలి విషయంలో నెలకొని ఉంది.

మండలి ఛైర్మన్ షరీఫ్.. సెలక్ట్ కమిటీలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. బిల్లును సభలో ప్రవేశ పెట్టకుండానే.. సెలక్ట్ కమిటీకి ఎలా నివేదిస్తారు సారూ.. అని అడిగితే.. నేనంతే నా ఇష్టం.. నాకు విచక్షణాధికారాలు ఉంటాయి అని సెలవిచ్చారు. అయితే ఆ ఆదేశాలను శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు పట్టించుకోలేదు. ఎందుకు అని అడిగితే.. ‘నేనంతే నా ఇష్టం.. నాకూ కొన్ని విచక్షణాధికారాలు ఉంటాయి’ అని ఆయన సెలవివ్వలేదు. నిబంధనలు ఒప్పుకోవు అని సింపుల్ గా తేల్చేశారు.

మండలి ఛైర్మన్ కు కోపం వచ్చింది. ఆగ్రహించారు. కన్నెర్ర చేశారు. చెప్పింది చేయ్.. అంటూ మళ్లీ ఆదేశాలు పంపారు. ‘కుదర్దు.. రూల్సొప్పుకోవు’ అంటూ అసెంబ్లీ సెక్రట్రీ మళ్లీ దాన్ని వెనక్కు కొట్టారు. ఏతావతా ఇప్పుడు మండలి- సెలక్ట్ కమిటీల ఏర్పాటు విషయంలో పెద్ద ప్రతిష్టంభన నెలకొంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితి ఎఫ్పుడూ ఉత్పన్నం అయినది కాదు. సెలక్టు కమిటీని ఏర్పాటుచేసే ఉత్తర్వులపై అసెంబ్లీ సెక్రటరీ సంతకాలు పెట్టాల్సిందే తప్ప.. మండలి ఛైర్మన్ ఆదేశించడం తప్ప ఇంకేమీ చేయలేరు. అందుకే ప్రతిష్టంభన!

అయితే తెలుగుదేశం నాయకులు మరో ఫీలర్ వదులుతున్నారు. దీన్ని సభాధిక్కారం కింద పరిగణించాలని అంటున్నారు. సభా ధిక్కారం కింద పరిగణించినా కూడా.. మండలి ఛైర్మన్ క్రిమినల్ చర్యలకు ఆదేశించినా కూడా.. దానిని అమలు చేయాల్సింది ఎవరు? మళ్లీ- ఆ పని రాష్ట్ర పోలీసులదే. ‘‘కుదర్దు.. ఇది నిబంధనలకు విరుద్ధం’’ అని వారు ఆ పనిచేయకపోతే.. మండలి ఛైర్మన్ పరువు మళ్లీ పోతుంది. ఈ తకరార్లన్నీ తీర్చుకునేలోగా.. మండలి రద్దు నిర్ణయం అమల్లోకి కూడా వచ్చేస్తుంది.

ఆ విధంగా మండలి రద్దయితే తప్ప.. ఈ ప్రతిష్టంభన తొలగదని.. ప్రజలు అనుకుంటున్నారు.

చంద్రబాబు పాపం పండింది..