హైకోర్టుని కర్నూలుకి కాదు, కడపకి తీసుకెళ్లండి, మీ ఇంటికి దగ్గరవుతుంది, వెళ్లి రావడానికి కాస్త సులభంగా ఉంటుందంటూ.. మూడు రాజధానుల ప్రకటన తర్వాత తెగ ఎకసెక్కాలాడేవారు పవన్ కల్యాణ్. అంతకు ముందు కూడా జైలూ, జగన్ రెడ్డీ అంటూ ఓవర్ యాక్షన్ బాగానే చేసేవారు. ఆ అతివాగుడు ఇప్పుడేమైపోయిందని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు మాజీ పీఎస్ పై జరుగుతున్న ఐటీ దాడుల్లో వెలుగుచూస్తున్న వాస్తవాలు పవన్ కళ్లకు కనపడ్డంలేదా అని దబాయిస్తున్నారు.
గతంలో టీడీపీ స్నేహితుడివే కాబట్టి నోరు కట్టేసుకుని ఉన్నావ్, ఇప్పుడు బీజేపీతో కదా నీ దోస్తీ, నీకూ టీడీపీకీ ఎలాంటి సంబంధం లేదని నిరూపించుకోవాలంటే కచ్చితంగా చంద్రబాబు బినామీల బాగోతంపై కామెంట్ చెయ్ అంటూ ఇరుకున పెట్టారు వైసీపీ నేతలు. ఈ నేతల సంగతి పక్కనపెట్టినా.. నిజంగా పవన్ కల్యాణ్ స్పందించాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. సుగాలి ప్రీతికి న్యాయం చేయండి అంటూ కర్నూలు వెళ్లిన పవన్ కల్యాణ్ కి 2వేల కోట్ల అవినీతి మీడియాలో వస్తుంటే న్యాయాన్యాయాలు ఎందుకు మర్చిపోయారో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇప్పుడు కూడా పవన్ ఈ విషయంలో నోరు మెదపకపోతే.. బాబుకు వీరవిధేయుడు అనే అనే విషయాన్ని తనకుతానుగా ఒప్పుకున్నట్టే. ఎందుకంటే జగన్ ని ప్రతి విషయంలోనూ.. ముఖ్యంగా కేసుల విషయంలో చులకనగా మాట్లాడే పవన్, చంద్రబాబు ఎంత పత్తిత్తో చెప్పాల్సిన అవసరం ఉంది. బాబు విషయంలో ఒకలా, జగన్ పేరెత్తితే మరోలా స్పందించడం అలవాటు పడ్డ జనసేనాని.. కనీసం బీజేపీతో కొత్త కాపురం ప్రారంభించిన తర్వాతైనా తన తీరు మార్చుకున్నారో లేక, బీజేపీతో కాపురం చేస్తూ చంద్రబాబు పక్కన ఉండాలనుకుంటున్నారో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ అత్యవసర పరిస్థితిలోకి పవన్ ని పూర్తిగా కార్నర్ చేసేశారు వైసీపీ నేతలు. మరి జనసేనాని ఈ సందర్భాన్ని ఎలా తప్పించుకుంటారో చూడాలి. చట్టం తనపని తాను చూసుకుంటుందంటూ రొటీన్ డైలాగుల్ని ఆశ్రయిస్తారో లేక, చంద్రబాబు అవినీతి గురించి అయిష్టంగానైనా నోరు విప్పుతారో వేచి చూడాలి.