జగన్మోహన రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చిన నాటినుంచి.. రకరకాల పుకార్లు సహజంగానే చెలామణీలోకి వచ్చాయి. కేంద్ర మంత్రివర్గంలో వైకాపా చేరబోతున్నది అనేది కూడా అలాంటి పుకార్లలో ఒకటి. పుకార్లు పుట్టించడం మామూలే కాబట్టి.. చాలా మందికి వాటిని సీరియస్ గా పట్టించుకోలేదు. కానీ.. బొత్స సత్యనారాయణ ప్రజల్ని విడిచిపెట్టేలా లేరు. తన మాటలతో ప్రజలందరూ ఆ పుకార్లు నిజమేనేమో అనుకునే పరిస్థితిని ఆయన కల్పిస్తున్నారు.
బొత్స సత్యనారాయణ విశాఖలో ఓ ప్రెస్ మీట్ నిర్వహిస్తే.. విలేకర్లు ఈ పుకార్లకు సంబంధించి ప్రశ్న అడిగారు. కేంద్రంలో చేరాలనే ప్రతిపాదన వస్తే.. పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం అని బొత్స సెలవిచ్చారు. ఇదొక్కటే మాట అయితే.. పెద్ద ఇబ్బందేమీ లేదు. ఆ వెంటనే.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరి గడ్డమైనా పట్టుకోడానికి తాము సిద్ధంగా ఉంటాం అని కూడా సెలవిచ్చారు. కేంద్రంతో ఎందుకు ఘర్షణ పడాలంటూ ప్రశ్నించారు. ఈ మాటలన్నీ గమనిస్తే.. కేంద్రంలో వైకాపా చేరుతున్నదేమో అనే అభిప్రాయమే ప్రజలకు కలుగుతుంది.
ఒక విషయం- పుకారు దశలో ఉండగానే.. దానిని గురించి తాను జోక్యం చేసుకుని మాట్లాడి.. ఆ పుకారు గురించి ప్రజలకు నమ్మకం కలిగేలా చేయడంలో బొత్స సత్యనారాయణ సిద్ధహస్తుడు. గతంలో అమరావతి రాజధాని విషయంలో కూడా ఇలాగే జరిగింది. జగన్మోహన రెడ్డి గెలిస్తే.. రాజధానిని అమరావతిలో ఉండనివ్వడనే అనుమానం కొందరిలో ఎన్నికలకు పూర్వంనుంచి ఉంది. అయితే ఎన్నికల్ తర్వాత ఆ అభిప్రాయం మార్చుకున్నారు. కానీ బొత్స సత్యనారాయణ తొలిసారిగా అమరావతి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. ప్రజల్లో సందేహాలు రేకెత్తించారు. చివరికి రాజధాని తరలిపోయింది.
ఇప్పుడు కేంద్రంలో చేరే విషయంలో కూడా అదే జరుగుతున్నదేమో అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది. బొత్స చెబుతున్నారంటే.. కేంద్రంలో చేరడం గ్యారంటీనే ఏమో అనే అభిప్రాయం కలుగుతోంది. అయితే ఇటీవలే జనసేనతో అధికారికంగా పొత్తు పెట్టుకున్న తర్వాత.. మళ్లీ జగన్ ను ఎన్డీయేలో కలుపుకుంటారా? అప్పుడిక జనసేన- వైకాపా అంతా ఒకే గొడుగుకిందనుంచి పనిచేయాలా? లాంటి అనేకానేక సందేహాలు ప్రశ్నలుగానే ఉన్నాయి.