హీరో, జనసేనాని పవన్ కల్యాణ్.. ఇవాళ అమరావతి గ్రామాల్లో పర్యటన ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఏకకాలంలో రెండు సినిమాల షూటింగుల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. అమరావతి రాజధాని గొడవలు సుదీర్ఘంగా కొనసాగుతున్న వేళ.. మరోవైపు అధికార వికేంద్రీకరణకు సంబంధించి కొన్ని కనీస అనుమతులకోసం జగన్మోహన రెడ్డి ఢిల్లీ పెద్దలను కూడా కలిసిన వేళ.. మళ్లీ అమరావతి పల్లెలలకు వస్తుండడం కీలకమైన విషయం. ఇలాంటి సందర్భంలో అమరావతి గ్రామాల ప్రజలనుంచి మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అధికార వికేంద్రీకరణ వ్యవహారాన్ని జగన్మోహన రెడ్డి ఢిల్లీ పెద్దల ఎదుట పెట్టినందున.. పవన్ కల్యాణ్ ఇక్కడి ప్రజల వద్దకొచ్చి ఏదో ఆవేశపూరిత ప్రసంగాలు చేసేసి.. తిరిగి షూటింగుకు వెళ్లిపోవడం కంటె.. ఢిల్లీ వెళ్లి అక్కడి కేంద్రప్రభుత్వంతో మాట్లాడితేనే అంతో ఇంతో ఉపయోగం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
అమరావతి లోనే రాజధాని మొత్తం ఉండబోవడం లేదన్నది ఫైనల్ అయిపోయింది. మండలి సెలక్ట్ కమిటీకి పంపినా కూడా జరిగేదేమీ ఉండదు గానీ.. అసలు సెలక్ట్ కమిటీ ఏర్పాటు కూడా నిబంధనల ప్రకారం జరగదనే అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తోంది. ఆ విషయంలో ప్రతిష్టంభన ఉంది. అసలు మండలి రద్దు నిర్ణయం కూడా త్వరలోనే అమలైపోవచ్చు. ఇక దాదాపుగా బిల్లు సభ ఆమోదం పొందేసినట్టే. లేదా, ఆర్డినెన్సు తేవడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో, అధికార వికేంద్రీకరణ రూపేణా జగన్ ఏదైతే సంకల్పించాడో.. వాటిలో కొన్ని అంశాలు కేంద్రం పరిధిలో ఉన్నాయి. అందుకే జగన్ రెండు దఫాలుగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు నివేదించి వచ్చారు. ఇప్పుడు బంతి వారి కోర్టులో ఉంది. అక్కడ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకుని సాగుతున్నారు.
అందువలన.. రాజధాని గ్రామాల పర్యటన పేరిట తమ వద్దకు వచ్చి.. ఏదో కంటితుడుపుగా కల్లబొల్లి కబుర్లు చెప్పడం కంటె.. అటు ఢిల్లీ వెళ్లి.. కేంద్రంలోని పెద్దలతో సంప్రదించి.. రాజధాని తరలింపును ఆపగలిగితే గొప్ప విషయం అని ప్రజలు అంటున్నారు. మరి ఈ సత్యాన్ని పవన్ కల్యాణ్ గుర్తిస్తారో లేదో!