నిన్నటి నుంచి సోషల్ మీడియాలోనూ, ఇతర మాధ్యమాల్లోనూ బాగా వైరల్ అవుతున్న వార్త … ‘బర్త్‌డేకు బెంజ్ కారు గిఫ్ట్.. పీఏకు సర్‌ప్రైజ్!’. ఏంటబ్బా అని ఆసక్తిగా వార్తలోకి తలదూర్చా. ఆ వార్త సారాంశం ఏంటంటే…ప్రముఖ సింగర్ మాడిసన్ బీర్ తన పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) పుట్టిన రోజు సందర్భంగా మెర్సిడస్ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చి పెద్ద మనసు చాటుకుందని. 50 వేల డాలర్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ సీ 300 కారును చూసి పీఏకు గిఫ్ట్‌గా ఇచ్చి ఆమె ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు.
కానీ ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా ప్రచారానికి నోచుకోని దాతృత్వాన్ని, పెద్ద మనసు చాటుకున్న పెద్ద మనిషి మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు. ఆయనే 40 ఏళ్ల రాజకీయ అనుభవశాలి, 14 ఏళ్ల ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. తన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు చంద్రబాబునాయుడు గిఫ్ట్‌గా వందల కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఆరు రోజుల పాటు సోదాలు, పరిశోధనలు చేసిన తర్వాత ప్రెస్‌నోట్ ద్వారా వెల్లడించారు.
కేవలం 50 వేల డాలర్లు విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ సీ 300 కారు విలువ మన దేశ కరెన్సీలో రూ.35 లక్షలు అవుతుంది. ఈ సంబరానికి సింగర్ మాడిసన్ బీర్ ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్ల విలువ చేసే ప్రచారాన్ని కొల్లగొట్టారు. ఇదేమైనా న్యాయమా? మన చంద్రబాబునాయుడిని ఇంకెంతగా అభినందించాలి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల అధినేతలను అమరావతికి పిలిపించి మన బాబుగారిని సన్మానించాలా? లేదా?
అడ్జెంట్‌గా చంద్రబాబు దాతృత్వాన్ని, ఔదార్యాన్ని, పెద్ద మనసును చాటే ఈ బృహత్ కార్యం గురించి లోకమంతా తెలిసేలా సోషల్ మీడియాతో పాటు అన్ని ప్రసార, ప్రచార వ్యవస్థల ద్వారా ప్రపంచ నలుమూలలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలి.
తన పీఎస్‌కు చంద్రబాబు ఇచ్చిన కోట్లాది రూపాయల గిఫ్ట్‌పై చంద్రబాబు తనకు తానుగా ప్రచారం చేసుకోలేకున్నాడు. ఎందుకంటే కుడిచేత్తో ఇస్తే, ఎడమ చేతికి కూడా తెలియకుండా దానం చేసే పెద్ద మనసు మన బాబు గారిది. అందుకే బాబు గారి మానవత్వం గురించి ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారులు చెప్పాల్సి వచ్చింది.
ఇంతకూ ఈ విషయంపై విస్తృత ప్రచారం చేయాల్సిన ఆ ఎల్లో మీడియా ఏం చేస్తున్నట్టు? కమాన్, ప్రముఖ సింగర్ మాడిసన్ బీర్‌కు ఒక న్యాయం, మా బాబుగారికి మరో న్యాయమా? ఇదెక్కడి వివక్ష? తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కించపరుస్తారా? మోడీ, ట్రంప్ కలసి చేస్తున్న కుట్రలను సాగనివ్వం అని యుద్ధం ప్రకటిద్దామా?