తన మాజీ భార్య రేణుదేశాయ్ కోసం, పిల్లల కోసం పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో ఓ పెద్ద ఇల్లు కొనుగోలు చేశారనే వార్త 2 రోజులుగా నలుగుతూనే ఉంది. పిల్లల భవిష్యత్ కోసం, వాళ్లకు గిఫ్ట్ గా పవన్ ఆ ఖరీదైన ఇంటిని కానుకగా ఇచ్చారని కూడా రాసుకొచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదంటున్నారు రేణుదేశాయ్. తన మాజీ భర్త (పవన్) నుంచి అన్యాయపూరితమైన భరణాన్ని పొందలేదంటూ వివరణ ఇచ్చారు.
“మీరందరూ అనుకుంటున్నట్టూ, ప్రచారం చేస్తున్నట్టూ ఇప్పుడు హైదరాబాద్‌లో నేను కొన్న ఫ్లాట్ నిజంగా మాకెవరూ కొనివ్వలేదు. అది నా కష్టార్జితంతో ఒక్కో రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్న నా సొంత ఇల్లు. అది నా మాజీ భర్త మాకు కొనిచ్చారన్న ఇలాంటి అసత్య ప్రచారాల వల్ల నా నిజాయితీకీ, ఆత్మగౌరవానికీ, నా అస్థిత్వానికీ, చివరగా నా ఉనికికే ప్రమాదం సంభవిస్తుందనే చిన్న ఆలోచన మీకెవ్వరికీ రాలేదా? నాకు తెలిసినంతవరకూ, ఈ వార్తకూ నా మాజీ భర్తకూ ఎలాంటి సంబంధం ఉండి ఉండదు… కనీసం ఈ ప్రచారం ఆయన దృష్టికి కూడా వెళ్ళి ఉండదు.”
ఇలా తన కష్టార్జితంతో ఆ ఇల్లు కొనుక్కున్నానంటూ వివరణ ఇచ్చారు రేణుదేశాయ్. మురళీమోహన్ కు చెందిన ఓ పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఈ ఇల్లు తన సొంతం అని ప్రకటించుకున్నారు. ఇప్పటివరకు తను, తన తండ్రి నుంచే ఎలాంటి ఆస్తిని తీసుకోలేదని, అలాంటప్పుడు తన మాజీ భర్త (పవన్) నుంచి ఎందుకు తీసుకుంటానని ప్రశ్నిస్తున్నారు రేణుదేశాయ్.
ఒంటరి మహిళనైన తను ఎంత కష్టపడుతున్నానో గుర్తించాలన్నారు రేణుదేశాయ్. తన జీవన గమనానికి, పోరాటానికి గుర్తింపు ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ, ఇలా కించపరిచేలా వార్తలు మాత్రం ఇవ్వొద్దని వేడుకున్నారు. తనకు, తన మాజీ భర్త (పవన్) అభిమానులకు మధ్య ఎలాంటి గొడవలు సృష్టించొద్దని మీడియాను కోరారు రేణుదేశాయ్.