నిప్పు లేకుండా పొగ సృష్టించే రంగమే సినిమా రంగం. గ్లామర్ రంగంలోని సానుకూల, ప్రతికూల అంశాలు అవే. ఏమీ లేకున్నా…ఏదో జరిగిపోతోందనే ప్రచారం నిమిషాల్లో వ్యాప్తి చెందడం సినిమా ప్రత్యేకత. అబద్ధానికి ఉన్న ప్రచారం, ఆకర్షణ…నిజానికి ఎప్పటికీ ఉండవు. అది అబద్ధానికి ఉన్న ప్రత్యేకత. దాన్ని అట్లే చూడాలి. అలాగని అబద్ధం గురించి చింతిస్తూ, ఆలోచిస్తూ ఉంటే ఎప్పటికీ ముందుకు సాగలేం.
తనపై జరుగుతున్న ఓ ప్రచారం గురించి నటి మంజు వారియర్ తెగ బాధపడుతున్నారు. ఆమె కొట్టి పారేయడాలు, ఖండించడాలు చూస్తుంటే గాసిప్స్‌కు ఈ నటి మరీ ఇంత ప్రాధాన్యం ఇస్తారా అనే అనుమానం కలుగుతోంది. రజనీకాంత్‌తో పాటు ఓ సినిమాలో కథానాయకిగా మంజు నటిస్తారనే సోషల్ మీడియాలో ఆమె సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ కథా నాయకుడిగా ‘ఖైదీ’ ఫేం లోకేశ్ కనకరాజు దర్శకత్వంలో ఓ సినిమా రానుందంటూ కొంత కాలంగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాలో రజనీకాంత్ సరసన ‘అసురన్’ ఫేం మంజు వారియర్ నటించనున్నారంటూ సోషల్ మీడియా రచ్చరచ్చ చేస్తోంది. దీనిపై ఆమె స్పందిస్తూ…
‘రజనీకాంత్ సినిమాలో హీరోయిన్గా నేను నటించనున్నానంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా విషయంపై ఇప్పటి వరకూ నన్ను ఎవరూ అధికారికంగా సంప్రదించలేదు. ఇదో అవాస్తవ వార్త. సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో నాకర్థం కావడం లేదు’ అని అసురన్ ఫేం మంజు వారియర్ అన్నారు.
సోషల్ మీడియాలో అర్థాలు వెతుక్కోకపోవడం మంచిది. ఎందుకంటే సోషల్ మీడియా అంటేనే అన్ని రకాల అభిప్రాయాలకు వేదిక. అన్నీ మంచి , అన్నీ చెడు ఉండవు. వార్తలన్నిటిలో మనకు కావాల్సిందేంటో అంత వరకే తీసుకోవాలి. అంతే తప్ప అందులోని మంచీచెడుల గురించి ఆలోచించడం, స్పందించడం మొదలు పెడితే…జీవిత కాలం సరిపోదు మంజు. అందుకే మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగండి. దట్సాల్.