అమరావతి కోసం మీరు ఏమీ చేయరా..? ఎంత సేపు మీ ఇళ్లల్లో పడుకుంటారా? మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించలేరా? బెజవాడలో వైసీపీ గెలిస్తే అమరావతి ఓడిపోయినట్టే జాగ్రత్త.. అంటూ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కట్ చేస్తే మరుసటి రోజే అమరావతి రైతులు ఆందోళనను ఉధృతం చేశారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉందన్న విషయం సైతం మరచిపోయి గుంపులు గుంపులుగా రోడ్లపైకి వచ్చారు, శాంతి భద్రతల సమస్య సృష్టించారు. మహిళా దినోత్సవం రోజు మహిళల్ని నెట్టేశారు, తొక్కేశారంటూ అనుకూల మీడియాతో కథనాలు వండి వార్చారు. రోడ్డు మీదే భోజనం అనే కాన్సెప్ట్ దీనికి పరాకాష్ట. పదే పదే ఈ వీడియోలు ప్రచారం చేసి విజయవాడ వాసుల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తోంది టీడీపీ అనుకూల మీడియా.
ప్రచార పర్వం ముగిసిన వెంటనే.. అమరావతిలో ఏదో జరిగిపోతోంది, మహిళల్ని అవమానించారు, రైతుల్ని రోడ్డున పడేశారు, రోడ్డుపైనే వారు భోజనం చేశారంటూ ఆ రెండు ఛానెళ్లు రెచ్చిపోయాయి.
ఇప్పుడే ఎందుకు..? అమరావతి ఆందోళనలు 400రోజులకి పైగా జరుగుతున్నాయి. ఆమధ్య వార్షికోత్సవం కూడా చేసుకున్నారు. కనీసం అప్పుడు కూడా ఈ స్థాయిలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకోలేదు. సడన్ గా ఇప్పుడెందుకు రోడ్డుపై భోజనాలు, దుర్గమ్మకు మొక్కులు అంటే.. 450వ రోజుకి చేరువలో ఉద్యమం ఉందని లాజిక్ బయటకు తీశారు.
ఉద్యమానికి 450 రోజులు.. అది కూడా చేరువలో.. అనడం, ఆ పేరుతో ఎన్నికల వేళ సడన్ గా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడం, దాన్ని టీడీపీ అనుకూల మీడియా హైలెట్ చేయడం, ఆ వెంటనే పవన్ కల్యాణ్ నుంచి ఖండన ప్రెస్ నోట్ విడుదల కావడం.. అన్నీ ప్రీ ప్లాన్డ్ గా జరిగాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది కాబట్టి.. కచ్చితంగా చంద్రబాబు అమరావతి అంశంతో రోడ్డుపైకొస్తారు. కనీసం జూమ్ లో నుంచైనా ఉపదేశాలు మొదలు పెడతారు. అయితే అందరి టార్గెట్ మాత్రం ఒకటే. బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ ని చేజిక్కించుకోవడం. కేవలం బెజవాడ కార్పొరేషన్ కోసమే చంద్రబాబు ఈ డ్రామాలు ఆడారు, ఆడిస్తున్నారనేది ఏపీ ప్రజలకు ఈపాటికే అర్థమైంది.
తన స్వార్థ ప్రయోజనాలకోసం అమరావతి భూముల్ని వాడుకున్న చంద్రబాబు.. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం అమరావతి ప్రజల్ని అడ్డు పెట్టుకుంటున్నారు. బెజవాడ ఎన్నికల్లో లబ్ధి కోసం వారిని రెచ్చగొట్టి రోడ్లపై నిలబెట్టారు, రోడ్లపైనే భోజనం చేసేలా పురిగొల్పారు.
అమరావతి ప్రాంతంలో సోమవారం జరిగిన పరిణామాలన్నిటికీ పరోక్షంగా చంద్రబాబే కారణం. మహిళలు ఇబ్బంది పడ్డా, రోడ్లపై అన్నం తిని అవమానంగా ఫీలయినా కారణం చంద్రబాబు మాత్రమే. బెజవాడ ఎన్నికల ఫలితాలతో ఈ సత్యం కచ్చితంగా రుజువవుతుంది. ఇంకా బాబు భ్రమల్లో బతికే ఓటర్లు ఎవరూ లేరనే విషయం బయటపడుతుంది.