చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18 డివిజన్లకు చెందిన టీడీపీ అభ్యర్థులకు ఎస్ఈసీ ఝలక్ ఇచ్చింది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 18 డివిజన్లకు చెందిన టీడీపీ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఆ డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సరికొత్త డ్రామాకు తెరలేపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫోర్జరీ సంతకాలతో తమ నామినేషన్లను విత్డ్రా చేసుకుని, ఏకగ్రీవమైనట్టు ప్రకటించారని ఆరోపిస్తూ 18 డివిజన్లకు సంబంధించి టీడీపీ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లలో వారు కోరారు. అయితే టీడీపీ అభ్యర్థులు కోరినట్టు హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు.
ఈ పిటిషన్లపై హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. ఎస్ఈసీ తరపు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదిస్తూ పిటిషనర్లకు సంబంధించిన ప్రతిపాదితులే నామినేషన్లను ఉపసంహరించారన్నారు. అందువల్ల పిటిషనర్లు కోరినట్టు ఎన్నికలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు.
ఇదే సందర్భంలో ప్రభుత్వ న్యాయవాది సుమన్ జోక్యం చేసుకుంటూ ఈ 18 డివిజన్లలో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారులు ఫారం-10 కూడా ఇచ్చారన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తి డీవీఎస్ఎస్ సోమయాజులు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు.