రాజకీయాల్లో కుల ప్రభావం ఇప్పటి మాట కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ ప్రభావం మిగిలిన చోట్లతో పోల్చుకుంటే కాస్త ఎక్కువే. టీడీపీ అంటే కమ్మ, వైసీపీ అంటే రెడ్లు, జనసేన విషయానికి వస్తే కాపుల పార్టీగా ముద్ర వేసుకున్నాయి. బీజేపీ మాత్రం మతం ముద్రతో దేశ వ్యాప్తంగా ముందుకెళుతోంది.
ఏపీ అధికార పార్టీ గురించి చర్చించుకుందాం. రెడ్ల పార్టీగా పిలుచుకునే వైసీపీలో కార్యకర్తలు మొదలుకుని, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరకూ అత్యంత అభిమానించే వ్యక్తులెవరని ప్రశ్నిస్తే మాత్రం ఇద్దరు కమ్మ నేతలు కనిపిస్తారంటే అతిశయోక్తి కాదు. ఆ ఇద్దరు మంత్రి కొడాలి నాని, ప్రముఖ సినీ రచయిత, రాజకీయ విశ్లేషకుడు పోసాని కృష్ణమురళి.
అమరావతిపై అసెంబ్లీలో చర్చలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ తన కేబినెట్‌లో తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి వ్యక్తుల్లో కొడాలి నాని ముందు వరుసలో ఉంటారని బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తనపై జగన్ పెట్టుకున్న నమ్మకం, కనబరిచే ప్రేమకు కొడాలి నాని కూడా అంతే కృతజ్ఞతగా ఉండడం వైసీపీ శ్రేణులు ప్రాణప్రదంగా ప్రేమించేలా చేసింది.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏపీలో రెడ్లు, కమ్మ నేతల మధ్య సంబంధాలు ఉప్పునిప్పులా ఉన్నాయి. అలాంటిది జగన్‌తో కొడాలి నాని, పోసాని కృష్ణమురళీకి పెనవేసుకున్న ఆత్మీయానురాగాల బంధం కులం కంటే గుణమే గొప్పదని చాటి చెబుతోంది. జగన్‌పై చంద్రబాబు ఘాటు విమర్శలు చేస్తే మొట్ట మొదటి స్పందన కొడాలి నాని నుంచే వస్తుంది. జగన్ కోసం నాని; అలాగే నాని కోసం జగన్ అన్నట్టుగా వాళ్లిద్దరి మధ్య రాజకీయాలకు మించిన అనుబంధం అల్లుకుంది.
ఇక పోసాని కృష్ణమురళి విషయానికి వస్తే …. తనకు రాజకీయాలతో సంబంధం లేదని, కేవలం జగన్ మాటపై నిలబడే నిజాయితీనే తనను ఆయనకు దగ్గర చేసిందని ఆ సినీ ప్రముఖుడు అనేక సందర్భాల్లో చెప్పారు. ముక్కుసూటిగా మాట్లాడ్డం, ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమే పోసాని బలం. తాను కూడా కమ్మవాడినే అని, జగన్ ఎప్పుడూ కుల దృష్టితో చూడరని పోసాని చెప్పడం తెలిసిందే.
సాధారణ రోజుల్లో రాజకీయాలకు దూరంగా ఉంటూ, ఎన్నికల ముంగిట ప్రజల్లోకి వచ్చి తనదైన స్టైల్‌లో టీడీపీపై పిడిగుద్దులు కురిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారాయన. నిన్నటి ప్రెస్‌మీట్‌లో పోసాని పేల్చిన పంచ్‌లు టీడీపీని చావు దెబ్బతీశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల్లో గెలవలేరు కాబట్టే తండ్రీకొడుకులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని పోసాని అన్నారు. నీతిబాహ్యంగా చంద్రబాబు మాట్లాడే మాటలు తెలుగు డిక్షనరీలో కూడా లేవని చురకలు అంటించారు. ప్రజలకు ఎన్నో చేస్తామని చంద్రబాబు చెబుతారని.. ఆయన చెప్పడమే తప్ప ఏదీ చేయరని దెప్పి పొడిచారు.
ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి పార్టీని, ముఖ్యమంత్రి పీఠాన్ని చంద్రబాబు దొడ్డిదారిన కైవసం చేసుకున్నారని ఘాటుగా విమర్శించారు. జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుని చంద్రబాబు వదిలేశారన్నారు. చంద్రబాబు పిలిచినా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రాడని తాను భావిస్తున్నానని తెలిపారు.
సీఎం జగన్ నిజాయితీపరుడు కాబట్టే ఆయనను 11 ఏళ్లుగా తాను అనుసరిస్తున్నట్టు చెప్పారు. వైఎస్ జగన్ ప్రజలకు నిజాలు మాత్రమే చెప్పి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. బాబును నమ్మి అమరావతి ప్రజలు కక్ష పెంచుకుంటున్నారని, ఇది వారికి మంచిది కాదని హితవు పలికారు. పనిలో పనిగా పవన్‌కు కూడా రెండు చురకలు అంటించారు. పవన్ కల్యాణ్ ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడటాన్ని ప్రజలు నమ్మడం లేదన్నారు. వ్యక్తిగత కక్షతో పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు.
కొన్ని విమర్శలు కొంత మంది చేస్తేనే అందంగా ఉంటాయి. బాబుపై కొడాలి నాని, పోసాని కృష్ణమురళి పంచ్‌లు విసిరితే ఆ కిక్కే వేరబ్బా అనే వాళ్లు లేకపోలేదు. ఇదే సమయంలో భూతుల మంత్రిగా ప్రత్యర్థులు కొడాలి నానిపై ఎన్ని విమర్శలు చేసినా …ఆయన మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.
చంద్రబాబును తిడుతున్నారని కొడాలి నాని, పోసాని కృష్ణమురళీని వైసీపీ శ్రేణులు అభిమానించడం లేదు. నమ్ముకున్న నాయకుడి పట్ల వారిద్దరూ కనబరిచే ప్రేమలో నిజాయితే …కులానికి అతీతంగా అభిమానించేలా చేసిందనడంలో అతిశయోక్తి కాదు. ప్రేమ ఇస్తే …ప్రేమ వస్తుందనేందుకు వీళ్లిద్దరే నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.