ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న అతిపెద్ద నిర్ణయం మూడు రాజధానుల ఏర్పాటు. అత్యంత వివాదాస్పద, సంచలన నిర్ణయం కూడా ఇదే అని చెప్పాలి. శాసనరాజధానిగా అమరావతిని కొనసాగిస్తూనే, విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి చట్ట సభల్లో ఆమోద ముద్ర కూడా వేసింది.
ఈ అంశం ఇప్పుడు హైకోర్టు పరిధిలో ఉంది. అయితే గత సార్వత్రిక ఎన్నికల ముందు అమరావతిలోనే రాజధాని కొనసాగిస్తామని జగన్మోహన్రెడ్డి నమ్మబలికి, ప్రజల్ని వంచించారని, కావున ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ, జనసేన తదితర ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఒకవేళ ప్రజాతీర్పు జగన్ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా వస్తే … ఇక తాము రాజధాని విషయమై మాట్లాడమని ప్రకటించారు.
ప్రతిపక్షాల డిమాండ్‌పై అధికార పార్టీ దీటుగా జవాబిచ్చింది. ఎక్కడైనా సవాల్ విసిరే వాళ్లు రాజీనామాలకు వెళ్తారని, అందుకు విరుద్ధంగా టీడీపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు విచిత్ర వాదన చేస్తున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని చంద్రబాబు నిర్వహించారు. చివరి రెండు రోజుల్లో ఓ పథకం ప్రకారం విజయవాడ, గుంటూరులో చంద్రబాబు ప్రచారం నిర్వహించారు.
కర్నూలు, విశాఖపట్నంలలో రాజధాని ఊసే ఎత్తని చంద్రబాబు …గుంటూరు, విజయవాడ వచ్చే సరికి సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు. విజయవాడ, గుంటూరులలో వైసీపీని గెలిపిస్తే …అమరావతి రాజధాని తరలింపునకు ఆమోద ముద్ర వేసినట్టే అని తేల్చి చెప్పారు. రాజధాని తరలిస్తుంటే రోషం, పౌరుషం లేదా అని ఆయన ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
జగన్ సర్కార్ రాజధాని వ్యతిరేక నిర్ణయానికి ఓటు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దీంతో ఈ రెండు నగరపాలక సంస్థల్లో ఫలితాలు రాజధానికి రెఫరెండంగా మారాయి. ఒక రకంగా చంద్రబాబు రాజధాని భవిష్యత్‌ను తన రాజకీయ స్వార్థం కోసం బలి పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అమరావతిపై న్యాయస్థానాల్లో విచారణ, తీర్పుల అంశాల్ని పక్కన పెడితే, ప్రస్తుతం ప్రజాకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. చంద్రబాబు ఆందోళన చెందుతున్నట్టు విజయవాడ, గుంటూరులలో వైసీపీకి అనుకూలమైన తీర్పు వస్తే మాత్రం …. ఇక శాశ్వతంగా రాజధానికి సమాధి కట్టినట్టే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ రెండు నగరాల్లో ప్రచారంలో భాగంగా చంద్రబాబు జనంపై విరుచుకు పడడం చూస్తుంటే, ఆయన ఆందోళనే నిజమయ్యేలా ఉంది. అమరావతిపై ప్రజాస్పందన లేకపోవడానికి కారణాలను అన్వేషించడానికి బదులు, తిట్ల దండకానికి దిగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏది ఏమైనా విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజాతీర్పు తప్పకుండా రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పనుంది. అందుకే ఆ రెండు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ.