545 కోట్ల రూపాయలు.. ఇదీ ‘2.0’ సినిమా బడ్జెట్ విషయంలో వినిపిస్తున్న మాట. భారీ సినిమాలకు కేరాఫ్ అయిన శంకర్ రోబోకు సీక్వెల్గా రూపొందిస్తున్న ఈ సినిమాకు భారీ ఎత్తున్న బడ్జెట్ పెట్టిస్తున్నాడని మొదటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అప్పట్లో ఈ సినిమా బడ్జెట్ 350కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. అయితే ఇప్పుడు అది భారీస్థాయికి పెరిగిపోయింది. ఏకంగా 545 కోట్ల రూపాయలట. ఇవతల యంగ్ మూవీమేకర్లు అరకోటి రూపాయల బడ్జెట్లోనే అదుర్స్ అనిపించే సినిమాలు రూపొందిస్తుంటే శంకర్ సినిమా బడ్జెట్ మాత్రం పెరుగుతూ పోతోంది.
ఇప్పుడు 2.0 సాధించిన మరో ఫీట్ ఏమిటంటే.. హాలీవుడ్ సినిమాల బడ్జెట్ స్థాయికి చేరిపోవడం. ‘డెడ్ పూల్’, ‘ది కంజూరింగ్’ వంటి సినిమాల కన్నా ‘2.0’ బడ్జెట్ పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విధంగా శంకర్ సినిమా బడ్జెట్ విషయంలో హాలీవుడ్లో వచ్చిన ప్రముఖమైన సినిమాల స్థాయికి చేరిందని అంటున్నారు.
అయితే ఒక ఇండియన్ సినిమా అంత ఈజీగా 545 కోట్ల రూపాయల వసూళ్లను తిరిగి రాబట్టుకునేంత మార్కెటింగ్ స్పేస్ ఉందా? అనేది కూడా పెద్ద సందేహం. ఈ సందేహానికి కూడా 2.0నే సమాధానం ఇవ్వాల్సి ఉంది. బాహుబలి 2, దంగల్ వంటి సినిమాలు భారీ వసూళ్లను రాబట్టిన మాట వాస్తవమే. అయితే.. వాటి బడ్జెట్ మాత్రం 545 కోట్ల రూపాయల రేంజ్ లో లేదు. కాబట్టి.. అవి సేఫ్ వెంచర్లు అయ్యాయి.
ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఇంత బడ్జెట్ పెడుతుంటారు? అనే ప్రశ్నకు 2.0 విడుదల అయితే కానీ సమాధానం లభించదు. డెడ్ పూల్, ది కంజూరింగ్ వంటి సినిమాల బడ్జెట్ను రీచ్ కావడం పెద్ద గొప్పకాదు, వాటి స్థాయి కలెక్షన్లను రాబట్టడం అసలైన గొప్ప అని సోషల్ మీడియా 2.0 విషయంలో సెటైర్లు కూడా పడుతున్నాయి.