ఈ వారం ట్రేడ్ టాక్.. వకీల్ హంగామా మొదలు

లాక్ డౌన్ తర్వాత, సినిమా హాళ్లు తెరుచుకున్న తర్వాత థియేటర్లలో మొదటిసారి జోష్ కనిపించింది ఈ వారమే. దానికి కారణం వకీల్ సాబ్ రిలీజ్. చాన్నాళ్ల తర్వాత పవన్ కల్యాణ్ నటించిన ఈ సినిమా…

లాక్ డౌన్ తర్వాత, సినిమా హాళ్లు తెరుచుకున్న తర్వాత థియేటర్లలో మొదటిసారి జోష్ కనిపించింది ఈ వారమే. దానికి కారణం వకీల్ సాబ్ రిలీజ్. చాన్నాళ్ల తర్వాత పవన్ కల్యాణ్ నటించిన ఈ సినిమా చూసేందుకు జనాలు ఎగబడ్డారు.

వకీల్ సాబ్ కంటే ముందు కొన్ని సినిమాలు హిట్టయినప్పటికీ.. వందశాతం ఆక్యుపెన్సీ వచ్చిన తర్వాత థియేటర్లలో ఆడియన్స్ వేవ్ కనిపించడం వకీల్ సాబ్ తోనే మొదలైంది.

వకీల్ సాబ్ కు అవతలి వారం కూడా ఎదురుండదు. వకీల్ సాబ్ తర్వాత వారం గ్యాప్ లో రావాల్సిన లవ్ స్టోరీ సినిమా వాయిదా పడింది. కరోనా కారణం చెప్పి ఆ సినిమాను మరోసారి వాయిదా వేశారు. దీంతో ఈవారం సోలోగా రిలీజైన వకీల్ సాబ్ కు మరో వారం కూడా ఎలాంటి పోటీ లేకుండా పోయింది.

ఇక పవన్ సినిమా రాకతో మిగతా సినిమాలన్నీ సర్దుకున్నట్టే. వైల్డ్ డాగ్, రంగ్ దే లాంటి సినిమాలు ఉన్నాయంటే ఉన్నాయంతే. రంగ్ దే బ్రేక్ ఈవెన్ అవ్వలేక కిందామీద పడుతోంది. వకీల్ సాబ్ రాకతో నితిన్ కు ఇక ఆ ముచ్చట తీరేలా లేదు.

ఇక “పేరు గొప్ప-ఊరు దిబ్బ” టైపులో ఉంది వైల్డ్ డాగ్ పరిస్థితి. అంతా మెచ్చుకుంటున్నారు. ఎవ్వరూ థియేటర్లకు వెళ్లడం లేదు. ఇప్పటివరకు బ్రేక్-ఈవెన్ లో సగం కూడా వసూళ్లు రాలేదు. ఈ రెండు సినిమాల కంటే ముందే అరణ్య, శశి లాంటి సినిమాలు మూటముల్లే సర్దేశాయి. సో.. మరో 10 రోజుల వరకు థియేటర్లలో వకీల్ సాబ్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేనట్టే.