బాబుకు ముందు మోడీ…వెనుక జ‌గ‌న్‌

ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే సామెత మాదిరిగా మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌రిస్థితి త‌యారైంది. చంద్ర‌బాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీ‌నివాస్ ఇంట్లో ఆరురోజుల పాటు ఐటీ, ఈడీ, జీఎస్టీ అధికారులు ,…

ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే సామెత మాదిరిగా మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌రిస్థితి త‌యారైంది. చంద్ర‌బాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీ‌నివాస్ ఇంట్లో ఆరురోజుల పాటు ఐటీ, ఈడీ, జీఎస్టీ అధికారులు , అలాగే క‌డ‌ప జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు శ్రీ‌నివాసుల‌రెడ్డి, లోకేశ్ స‌న్నిహితుడి ఇళ్ల‌లోనూ, కార్యాల‌యాల్లోనూ  సోదాలు నిర్వ‌హించి పెద్ద ఎత్తున వేల కోట్ల ఆర్థిక అక్ర‌మ లావాదేవీల‌కు పాల్ప‌డ్డార‌ని నిర్ధారించారు. ఈ అక్ర‌మాల వెనుక మాజీ సీఎం చంద్ర‌బాబు హ‌స్తం ఉంద‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. మున్ముందు ఈ కేసు ఎన్ని మ‌లుపులు తిరుగుతుందో అంచ‌నాకు రావ‌డం ఇప్పుడిప్పుడే క‌ష్ట‌మంటున్నారు.

కాగా గ‌త రెండేళ్లుగా ప్ర‌ధాని మోడీపై టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. అలాగే అప్ప‌ట్లో తిరుమ‌ల ద‌ర్శ‌నానికి వ‌చ్చిన బీజేపీ చీఫ్ అమిత్‌షాపై తిరుప‌తిలో టీడీపీ శ్రేణుల దాడి….త‌దిత‌ర ఘ‌ట‌న‌లు చంద్ర‌బాబు ప‌ని ప‌ట్టాల‌నే ప‌ట్టుద‌ల పెంచాయి. మోడీ భార్య‌పై బాబు అనుచిత వ్యాఖ్య‌లు, త‌న‌కంటే రాజ‌కీయాల్లో జూనియ‌ర్ అని బాబు వెట‌కారం చేయ‌డం, ఇంత అస‌మ‌ర్థ ప్ర‌థానిని ఎప్పుడూ చూడ‌లేద‌న‌డం, ఏపీలోకి సీబీఐని అనుమ‌తించ‌క‌పోవ‌డం…ఇలా అనేక అంశాలు బాబు- మోడీ మ‌ధ్య వ్య‌వ‌హారం తెగే వ‌ర‌కు వెళ్లింది.

అందులోనూ ఏపీలో గ‌త ఐదేళ్ల‌లో చోటు చేసుకున్న అవినీతిపై కేంద్రం వ‌ద్ద ప‌క్కా ఆధారాలుండ‌టంతో అద‌ను చూసి బాబు ప‌ని ప‌ట్టేందుకు ఒక ప‌థ‌కం ప్ర‌కారం మోడీ-అమిత్‌షా ఐటీ వ‌ల విసిరారు. ఆ వ‌ల‌లో బాబు స‌న్నిహితులు నేరుగా, బాబు ప‌రోక్షంగా చిక్కుకున్నారు.

మ‌రోవైపు రాజ‌ధాని అమ‌రావ‌తిలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌కు పాల్ప‌డిందంటూ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్ప‌టి నుంచి వైసీపీ అధినేత జ‌గ‌న్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తున్నాడు. అంతేకాదు అందుకు త‌గ్గ ఆధారాల‌ను కూడా చూపిస్తూ జ‌నాల్లోకి తీసుకెళ్లాడు. ఇప్పుడు ఆయ‌నే సీఎం కావ‌డంతో అమరావ‌తి అవినీతి బ‌య‌టికి వ‌స్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 4,070 ఎక‌రాల‌ను ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేసిన‌ట్టు జ‌గ‌న్ స‌ర్కార్ వేసిన ద‌ర్యాప్తు సంస్థ తేల్చింది. మ‌రోవైపు తెల్ల‌రేష‌న్‌కార్డు దారుల‌తో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయించ‌డంపై సీఐడీ ద‌ర్యాప్తు చేస్తోంది.

 ఈ నేప‌థ్యంలో మాజీ మంత్రులు నారాయ‌ణ‌, ప్ర‌త్తిపాటి పుల్లారావుల‌పై కూడా కేసులు న‌మోదయ్యాయి. మున్ముందు మ‌రింత మందిపై కేసులు న‌మోదు అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. సీఐడీ విజ్ఞ‌ప్తి మేర‌కు అమ‌రావ‌తి అవినీతిపై ద‌ర్యాప్తు చేసేందుకు ఈడీ కూడా రంగంలోకి దిగింది. దీంతో ప‌చ్చ ద‌ళం ఆర్థిక మూలాలు క‌దిలిపోతున్నాయి. టీడీపీ రాజ‌కీయ వ్యాపార‌స్తుల ఆర్థిక మూలాలు ధ్వంస‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో టీడీపీ నేత‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

తాజాగా ఆదాయ‌పు ప‌న్నుశాఖ వెలువ‌రించిన రూ.2 వేల కోట్ల అక్ర‌మ లావాదేవీల వ్య‌వ‌హారంతో చంద్ర‌బాబుకు ముందు మోడీ, వెనుక జ‌గ‌న్‌లా త‌యారైంది. ఎప్పుడేం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితిలో చంద్ర‌బాబు, ఆయ‌న బినామీలు, స‌న్నిహితులు వ‌ణికిపోతున్నారు.

అందుకే ఆయన రాజమౌళి అనిపించింది