ఐటీ దాడులు జరుగుతున్న సమయంలో.. ఆక్రోశం వెళ్లగక్కారు. ఐటీ దాడులతో బెదిరించాలని చూస్తున్నారా.. అంటూ ఆగ్రహించారు. తీరా.. సుదీర్ఘమైన ఐటీ దాడుల తర్వాత.. సుమారు రెండు వేల కోట్ల రూపాయలు కాజేసిన అక్రమాలన్నీ అధికారికంగా వెలుగులోకి రాగానే… దేశవ్యాప్తంగా దాడులు జరిగితే.. మాకు ముడిపెడతారెందుకు? అంటూ నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు. ఇవాళ ఇలా మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు.. నిన్న ఐటీ దాడులు జరుగుతున్న రోజున.. తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎందుకు ఆక్రోశించారో చెప్పగలరా?
కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా ఐటీదాడులు జరిగాయి. దాడులు దేశవ్యాప్తంగా జరిగాయి కానీ, అన్నిచోట్లా కలిపి వ్యాపారాలు నిర్వహిస్తున్న సందరు ప్రముఖ ఇన్‌ఫ్రా సంస్థలు… ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందినవే కావడం విశేషం. ఆ విషయాన్ని ఐటీ శాఖ తమ ప్రకటనలోనే స్పష్టంగా పేర్కొంది. అందులో ఢిల్లీ, పుణె పేర్లు కనిపించేసరికి.. దేశమంతా అనేకమందికి చెందిన సంస్థలపై దాడులు జరిగినట్లుగా అచ్చెన్నాయుడు అర్థం చేసుకున్నారేమో తెలియదు.
అత్యంత ప్రముఖమైన వ్యక్తి.. మాజీ వ్యక్తిగత కార్యదర్శి మరియు అత్యంత సన్నిహితులపై కూడా ఈ దాడులు జరిగినట్లు ఆ ప్రకటనలోనే పేర్కొన్నారు. సదరు అత్యంత ప్రముఖమైన వ్యక్తి.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే. ఆయనకు సన్నిహితులు, మాజీ పీఎస్ మీదనే దాడులు జరిగాయి. చంద్రబాబు పీఎస్ మీద ఐటీ దాడులనగానే అందరూ అలర్ట్ అయ్యారు. ఈ దాడులు అయిదురోజుల పాటూ సుదీర్ఘంగా సాగాయి. నేరారోపణ చేయదగిన ఆధారాలు దొరికాయని ఐటీ శాఖ స్వయంగా ప్రకటించింది.
బినామీ సబ్ కాంట్రాక్టుల పేరుతో ఇన్‌ఫ్రా సంస్థలు నాయకులు కలిసి పాల్పడుతున్న భారీ అవినీతి బాగోతాల గుట్టుమట్లు ఐటీదాడుల్లో దొరికాయి. తెలుగుదేశం నాయకులు చాలా మందికి ఇందులో పాత్ర ఉన్నట్లుగా తేలుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అలాంటి సమయంలో.. అచ్చెన్నాయుడు ఏమాత్రం తర్కబద్ధం కాకుండా.. చంద్రబాబుపై బురద చల్లేందుకు వైకాపా నేతలు వీటిని వాడుకుంటున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు.
అచ్చెన్నాయుడు తెలుసుకోవాల్సిన సంగతి ఒకటుంది. చంద్రబాబునాయుడుపై మరొకరు బురద చల్లాల్సిన అవసరం లేదు. ఆయన తన మీద తానే బురద చల్లుకోగలరు.. తన గోతిని తానే తవ్వుకోగలరు అని ప్రజలు నవ్వుకుంటున్నారు.