సహజంగానే.. ఒక నాయకుడు ఒక పని చేస్తోంటే.. దానికి అనుబంధంగా అనేకానేక పుకార్లు పుడతాయి. ఒక నేత ఢిల్లీ వెళుతున్నారంటే.. ఆయన అనుకూల, ప్రతికూల వర్గాలు.. తమ తమ ఇష్టానుసారంగా కొన్ని పుకార్లు ప్రచారంలో పెట్టడానికి ప్రయత్నిస్తుంటాయి. పవన్ ఢిల్లీ వెళ్లినా అంతే.. జగన్ ఢిల్లీ వెళ్లినా అంతే! అయితే పుకారు తామే పుట్టించి.. ఆ పుకారును ప్రమోట్ చేస్తూ.. అనుబంధ విమర్శల్ని కూడా తామే తయారు చేసుకుంటూ.. ఆ పుకార్ల ఆధారంగా ఎగస్ట్రా విమర్శలు చేయడం అనేది.. లేకితనానికి, చవకబారు రాజకీయాలకి పరాకాష్ట. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే పని చేస్తోంది.
జగన్మోహన రెడ్డి ఢిల్లీ వెళ్లి.. ప్రధాని నరేంద్రమోడీతో గంటన్నర పాటూ భేటీ కావడం, రాష్ట్ర పెండింగ్ సమస్యలను ప్రస్తావించడం, ఆయననుంచి సానుకూల స్పందనతో తిరిగిరావడం.. యివన్నీ పచ్చదళాలకు జీర్ణం కావడం లేదు. అందుకే లేనిపోని పుకార్లు పుట్టించారు.
జగన్మోహన రెడ్డి.. త్వరలోనే ఎన్డీయే కూటమిలో చేరబోతున్నారని.. వైకాపా నుంచి ఇద్దరికి కేంద్రంలో మంత్రి పదవులు లభించబోతున్నాయని ఒక పుకారు పుట్టించారు. విజయసాయిరెడ్డి, ఆదిమూలం సురేష్ లకు మంత్రి పదవులు దక్కబోతున్నాయనేది పుకారు. ఆ పుకారుతో ముడిపెట్టి.. మళ్లీ వారే విమర్శలు చేస్తున్నారు.
కేంద్రమంత్రి పదవికోసం జగన్ ఢిల్లీ వెళ్లారని, ప్రత్యేక హోదా డిమాండును తాకట్టు పెట్టారని మాజీ మంత్రి దేవినేని ఉమా అంటున్నారు. ఇంతకంటె లేకి, కామెడీ విమర్శ మరొకటి ఉండకపోవచ్చు. హోదా డిమాండును తాకట్టు పెట్టడం అనేది తెలుగుదేశానికి పేటెంట్ ఉన్న అంశం. ఆరోజు ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూ.. హోదా కోసం ఒత్తిడి చేయకుండా, తగుదునమ్మా అంటూ మంత్రి పదవులు పుచ్చుకున్నారు. రాష్ట్రంలో ఆందోళనలు చేసేవారిపై కేసులు పెట్టారు. సమూలంగా హోదా డిమాండును చంపి, పాతర వేసేశారు. తీరా సిగ్గులేకుండా ఇప్పుడు మళ్లీ హోదా ను జగన్మోహన రెడ్డి తాకట్టు పెడుతున్నారంటూ విమర్శలు చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.