ఢిల్లీ ఓటమిపై అమిత్ షా ఓ మీడియా సంస్థతో తన అభిప్రాయాలు పంచుకున్నారు. పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యానాలను ఆయన ఇంటర్వ్యూలో చేశారు. అదే సమయంలో తమ పార్టీ అసలు వైఫల్యాలు, చేసిన అసలు తప్పులను ఒప్పుకోడానికి ఆయనకు అహం అడ్డు వస్తున్నట్లుగా ఆయన ఇంటర్వ్యూను గమనిస్తే మనకు అర్థమవుతోంది.
ప్రధానంగా గెలుపోటములకోసం ఎన్నికల్లో తలపడలేదని అమిత్ షా అంటున్నారు. ఇది ఓడిపోయిన ప్రతివారూ చెప్పే మాటే! గెలిచిన వాడు తమ సిద్ధంతాల బలం అని చాటుకుంటే.. ఓడినవారు గెలుపుకోసం తాపత్రయపడలేదంటారు. అదే సమయంలో అమిత్ షా.. ఎన్నికల్లో గెలుపుకోసం దిగలేదంటూనే.. తమ భావజాలాన్ని విస్తరించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లుగా ఆయన సెలవిచ్చారు. ఆ పాయింటు నిజమే కావొచ్చు. కానీ.. అదే భావజాలమే ప్రధాన ప్రచారాస్తంగా వారు ఎన్నికల్లో వాడుకున్న తర్వాత.. సంభవించిన ఓటమి.. ఆ భావజాలానికి చెంపపెట్టు కదా! భావజాలం సరికాదని ప్రజలు తీర్పు చెప్పినట్టే కద! ఆ విషయం ఒప్పుకోడానికి మాత్రం అమిత్ షాకు ఈగో అడ్డు వస్తోంది. చింతచచ్చినా పులుసు చావలేదన్నట్టుగా.. దేశ రాజధానిలో దారుణంగా పరాజయం పాలైనప్పటికీ.. ఆ పార్టీలో అహం మాత్రం తగ్గలేదనడానికి ఇది నిదర్శనం.
మరో తమాషా ఏంటంటే.. ఆయన తమ పార్టీ చేసిన అసలు తప్పులను ఒప్పుకోడానికి కూడా ఇష్టపడడం లేదు. తమ నాయకులు చేసిన గోలీమారో, ఇండో ప్యాక్ మ్యాచ్ వంటి మాటలు నష్టం చేసి ఉంటాయని, అలాంటి మాటలు మాట్లాడి ఉండాల్సింది కాదని అంటున్నారు. నిజానికి భాజపా నాయకులు దురహంకారంతో మాట్లాడింది ఆ మాటలు మాత్రమే కాదు… అరవింద్ కేజ్రీవాల్ ను టెర్రరిస్టుగా అభివర్ణించడం చిన్న సంగతి కాదు. ఎవరో నోరు జారి అలా అన్నప్పటికీ.. కేంద్రమంత్రి స్థాయి వాళ్లు ఆ వ్యాఖ్యలను సమర్థించడమూ క్షమార్హం కాదు. అలాంటి నేపథ్యంలోనే.. పార్టీ తుడిచిపెటటుకుపోయింది. అసలు తప్పులను బయటకు ఒప్పుకోకపోయినా.. కనీసం వారు గుర్తిస్తేనే ఆ పార్టీకి మనుగడ ఉంటుంది.