రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లో కూడా బాబుమోహన్ భలే సరదా మనిషి. ఎవరూ ఊహించని విధంగా ఆయన రాజకీయాల్లోకి రావడం, రాష్ట్ర మంత్రిగా పనిచేయడం చకచకా జరిగిపోయాయి. టీడీపీలో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం …కాలక్రమంలో అనేక మలుపులు తిరిగింది. రాష్ట్ర విభజనతో తెలంగాణలో టీడీపీ దారుణంగా దెబ్బ తినడంతో ఆయన ప్రత్యామ్నాయం చూసుకున్నారు.
టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరారు. కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు మూణ్నాళ్ల ముచ్చటే అయ్యింది. టీఆర్ఎస్‌లో తనకు అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో బీజేపీ పంచన చేరారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ బీజేపీలో సినియర్ నేత.
ఇదిలా ఉండగా తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన ఆంధ్రాకు ప్రచారానికి వచ్చారు. బాబుమోహన్‌కు ఉన్న సినీ గ్లామర్ ఎంతోకొంత రాజకీయంగా పనికొస్తుందని భావించిన బీజేపీ …ఆయన్ను తిరుపతిలో ఎన్నికల ప్రచారానికి రప్పించింది.
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో ఆయన మాట్లాడుతూ జోక్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక ఎన్నికల వాతావరణం తిరుపతిలో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పడమే ఆ జోక్ సారాంశం. అతిశయానికైనా కాస్త వాస్తవానికి దగ్గర ఉంటే నమ్ముతారు. అలా కాకుండా నోటాను అధిగమిస్తే …బీజేపీ విజయం సాధించినట్టే అని తిరుపతి పార్లమెంట్ పరిధిలోని జనాలు అంటుంటే …బాబుమోహన్ ఏకంగా దుబ్బాక వాతావరణం కనిపిస్తోందని చెప్పడంతో జనం నవ్వుకుంటున్నారు.
బాబుమోహన్ ఏం మాట్లాడారనే సంగతి పక్కన పెడితే, వెండితెరపై ఇంత కాలం కనిపించిన నటుడు, ఇప్పుడు ఎన్నికల పుణ్యమా అని ప్రత్యక్షంగా చూడడం సినీ అభిమానులకు సంతోషాన్ని ఇస్తోంది.