తమకు అనుకూలంగా మాట్లాడితే ఎవరు మాత్రం వద్దంటారు. కానీ తిరుపతిలో మాత్రం ఇదో విచిత్ర పరిస్థితి. జనసేనాని పవన్ కల్యాణ్‌పై ప్రత్యర్థి పార్టీ అధినేత చంద్రబాబు వన్ సైడ్ లవ్ బరిలో నిలిచిన బీజేపీని ఇరకాటంలో పడేసింది. వకీల్‌సాబ్‌పై చంద్రబాబు చాలా తెలివిగా అభిమానం ఉన్నట్టు నటిస్తూ …జనసేనాని ఓట్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నెల్లూరు జిల్లాలో మాట్లాడుతూ జనసేనాని పవన్‌కల్యాణ్ మూవీ వకీల్‌సాబ్ గురించి మాట్లాడారు. పనిలో పనిగా సినిమా విడుదల సందర్భంగా ఏపీ ప్రభుత్వ తీరును ఎండగట్టి జన సైనికుల ఓట్లను తన వైపు తిప్పుకునే ఎత్తుగడ వేశారు.
“పవన్ కల్యాణ్ కూడా జగన్ బాధితుడయ్యారు. పెద్ద హీరోల సినిమాల విడుదల సందర్భంగా ప్రత్యేక షోలు వేసుకోవడం, రిలీజైన తొలి రోజుల్లో ధరలు పెంచుకోవడం ఆనవాయితీ. కానీ పవన్ సినిమాకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఆయనపై ఎందుకంత కక్ష? మీ అరాచకాలను ప్రశ్నిస్తున్నారనా..?” అని పవన్‌కు అండగా నిలిచారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా జనసేన-టీడీపీ ఈ విధంగానే అనుకూలంగా వ్యవహరించుకుంటూ చివరికి రెండు పార్టీలు జగన్ సునామీలో గల్లంతయ్యాయి. ఆ ఘోర పరాజయం నుంచి గుణపాఠం నేర్చుకోకుండా మరోసారి చంద్రబాబు అదే తప్పు చేయడం గమనార్హం. టీడీపీ, జనసేన వేర్వేరు కాదని మొదటి నుంచి వైసీపీ చేస్తున్న ప్రచారానికి చంద్రబాబు మాటలు బలాన్ని ఇస్తు న్నాయి. వకీల్‌సాబ్ రిలీజ్ విషయంలో ప్రభుత్వ వైఖరిని బాబు విమర్శించడం పవర్‌స్టార్ అభిమానులకు సంతోషాన్ని ఇస్తున్నా… బీజేపీకి మాత్రం ఆవేదన కలిగిస్తోంది.
చంద్రబాబు ఓ పథకం ప్రకారం తమను దెబ్బతీయడానికే పవన్‌పై సాప్ట్ కార్నర్ ఉన్నట్టు నటిస్తున్నారని బీజేపీ నేతలు మండి పడుతున్నారు. జనసేన, టీడీపీ ఒకటే అనే ప్రచారం బలంగా ముందుకొస్తే ప్రధానంగా నష్టపోయేది తామేనని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి జనసేనానిపై ప్రేమ కురిపిస్తూ …చంద్రబాబు తమకు అనుకూల శత్రువుగా మారారనే అభిప్రాయాలు జనసేన-బీజేపీ కూటమి నుంచి వినిపిస్తున్నాయి.