ఓ పని చేసే ముందు…ముందు వెనుకలు అనేవి వుంటాయి. అబద్దం ఆడితే గోడకట్టినట్లు వుండాలి. రంకు నేర్వాలంటే బొంకు నేర్వాలి అంటూ తప్పుడు పనులకు కూడా క్వాలిటీలు వుండాలన్నారు వెనకటికి. కానీ వైకాపా ప్రభుత్వానికి ఇవేమీ పట్టవు. ఎద్దు ఈనిందీ అంటే దూడను కట్టేయమనడమే. చేసేయాలి అనుకుంటే చేసేయడమే. ముందు వెనుకలు ఏమీ వుండవు.
నిన్నటికి నిన్న ఇచ్చిన సినిమా టికెట్ ల జీవో కూడా ఇలాంటి వ్యవహారమే. సినిమా టికెట్ ల వ్యవహారాన్ని ప్రభుత్వాలు చిరకాలంగా చూసీ చూడనట్లు వదిలేసాయి. అది సాకుగా తీసుకుని ఇష్టం వచ్చినట్లు టికెట్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. సినిమా విడుదలకు ముందు అంతా చకచకా ప్లాన్డ్ గా జరిగిపోతుంది. జాయింట్ కలెక్టర్ కు అప్లయ్ చేయడం, ఆయన రిజెక్ట్ చేయడం, కోర్టుకు వెళ్లడం, టికెట్ రేట్ల పెంపు అనుమతి తెచ్చుకోవడం. ఇదంతా ఓ రెగ్యులర్ ప్రాసెస్ గా చకచకా జరిగిపోతోంది.
ఏనాడో బిసి కాలంలో టికెట్ ల జీవో ఇచ్చారు. దానిని సవరించలేదు. అది సాకుగా దొరికింది థియేటర్ల జనాలకు. కోర్టులు ఏనాడో చెప్పాయి జీవో ఇస్తే ఇక సమస్య వుండదని. వినియోగదారుల ఫోరమ్ లు ఈ విషయంలో ఏనాటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకున్నాయి. జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం కూడా అదే చేస్తూ వచ్చింది.
ఇప్పుడు ఉన్నట్లుండి జివో ఇచ్చింది. ఆ ఇచ్చే జీవో ఏదో వకీల్ సాబ్ విడుదలకు పది రోజుల ముందు ఇచ్చి వుండొచ్చుగా. ఎవ్వరూ ఏ మాట అనేవారు కాదు. కోర్టుల కెక్కే వ్యవహారమూ వుండేది కాదు. టార్గెట్ వకీల్ సాబ్ అనే మాటా వచ్చి వుండేది కాదు. కానీ ఇప్పుడేమయింది. ఇదేదో వకీల్ సాబ్ కోసమే చేసారనే కలర్ వచ్చింది. చిత్రమేమిటంటే ఎవరైతే ప్రభుత్వానికి లీగల్ సలహాలు ఇచ్చే వారో వాళ్లే మళ్లీ ఈ టికెట్ రేట్ల విషయంలో డిస్ట్రిబ్యూటర్ల కోసం కోర్టులో ఫైట్ చేసేది.
ఇదిలా వుంటే అదనపు షో ల వ్యవహారం. దీనిపై కూడా ఓ నిర్దిష్టమైన పాలసీ తీసుకోవచ్చు కదా. ఇస్తాము..ఇవ్వము అన్నది ఒకేసారి నిర్ణయం తీసుకుంటే ప్రతి సినిమా ముందు ప్రభుత్వానికి లెటర్ పెట్టడం, మంత్రులు, ఎమ్మెల్యేలు పైరవీలు ఇలాంటివి అన్నీ ఇక వుండవు కదా. ప్రభుత్వం ఒక పాలసీ అన్నది డిఫైన్ చేసి వదిలేయాలి కదా.
ఇప్పుడేమయింది. అర్థరాత్రి జీవో ఇచ్చారు. అది కోర్టులో సవాల్ చేసారు. ఇక ఆ వ్యవహారం అలా నడుస్తూనే వుంటుంది. ప్రతి సినిమాకు మళ్లీ కోర్టుకు వెళ్లడం, టికెట్ లు పెంచడం ఆ ట్రాక్ కూడా అలాగే నడుస్తూనే వుంటుంది. వకీల్ సాబ్ కోసం అనే మాట పడ్డారు. ప్రభుత్వం చేయాలనుకున్నది చేయలేకపోయింది.
అసలు ఇప్పటికే ఆలస్యం అయింది. సినిమా టికెట్ వ్యవస్థను సమూలంగా ప్రభుత్వం ప్రక్షాళన చేయాలి. నూటికి నూరు శాతం ఆన్ లైన్ టికెట్ వ్యవస్థను ప్రవేశపెట్టాలి. దాని వల్ల పక్కాగా టాక్స్ వసూళ్లు వుంటాయి. థియేటర్ల నుంచి నూటికి నూరుశాతం పన్నులు రావడం లేదని ఎప్పటి నుంచో చాలా మంది చెబుతున్నారు. కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఇదే సమయం. ఎలాగూ తేనెతుట్ట కదిలింది.
కమిటీలు కాలయాపనలు లేకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటే, రాబోయే సమ్మర్ సినిమాల దగ్గర సమస్య వుండదు. లేదంటే ఇలాగే కక్షసాధింపు ట్యాగ్ లైన్లు వుంటాయి. పని జరగదు. ఫలితం వుండదు. ప్రభుత్వానికి సలహా ఇచ్చేవారు తమ మెడ మీద వున్న తలకాయతో కాస్త ఆలోచిస్తే బెటర్ లేదూ అంటే చెడ్డ పేరు వచ్చేది ప్రభుత్వానికి దాన్ని నడిపేవారికి.