ప్రత్యేక హోదాపై తనకు ఎంత మాత్రం చిత్తశుద్ధి లేదని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రుజువు చేసుకున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా, తిరుపతి బరిలో నిలిచిన బీజేపీని నిలదీయకుండా బాధితులనే దోషులుగా నిలబెట్టాలనే చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు తిరుపతి ఉప పోరు ప్రచారంలో బట్టబయలయ్యాయి.
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని పొదలకూరులో రోడ్‌షో, బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై బాబు విమర్శలను చూస్తే… బాబు ఎంత పిరికి నేతో అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు నిరాకరించిన మోడీ సర్కార్‌ను, బీజేపీని మాట మాత్రం కూడా విమర్శించకుండా, కేవలం జగన్‌నే టార్గెట్ చేసిన చంద్రబాబు పిరికితనానికి పెద్దన్న అనే అభిప్రాయాలు బలపడుతున్నాయి.
‘ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాను. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తాను. అభివృద్ధి పథంలో నడిపిస్తానని పాదయాత్రలో పదేపదే చెప్పిన జగన్ …అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ మరిచిపోయారు. గతంలో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తారా? అని అడిగారు. ఇప్పుడు మేం చేస్తాం. మీకు ఆ దమ్ము ఉందా? ’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చంద్రబాబు సవాల్ విసిరారు.
‘25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని చెబితే …ప్రజలు నమ్మారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్కసారైనా ఆ ప్రస్తావన తెచ్చారా? ప్రత్యేక హోదాను ఎందుకు తేలేదో ప్రజలకు మీరు తిరుపతి వేదికగా సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా పేరు చెప్పి ప్రజలను మోసం చేసిన జగన్‌రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా’ అని జగన్‌పై బాబు తన అక్కసు వెళ్లగక్కారు.
తనను అధికారం నుంచి జగన్ దింపారనే ఆవేదన, ఆక్రోశం తప్ప …ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శలే ప్రతిబింబిస్తున్నాయి. అసలు ప్రత్యేక హోదాకు శాశ్వత సమాధి కట్టిందే చంద్రబాబు అనే విషయం ఏపీ ప్రజానీకానికి బాగా తెలుసు. పోనీ తన హయాంలో జరిగిన తప్పు సరిదిద్దుకోడానికైనా బాబు చిత్తశుద్ధితో ప్రవర్తిస్తున్నారా? అంటే లేదనే సమాధానం వస్తోంది.
నిజంగా చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా… ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడని జగన్‌తో పాటు ఇవ్వనని మొండి కేసిన మోడీ సర్కార్‌ను చంద్రబాబు చీల్చి చెండాడాలి. అప్పుడు ప్రజల మద్దతు కూడా లభిస్తుంది. అలా కాకుండా కేవలం జగన్‌పై మాత్రమే విమర్శలు సంధిస్తే ప్రయోజనం లేదు.
తిరుపతి ఉప పోరులో నిలిచిన బీజేపీపై మాట వరుసకైనా విమర్శ చేయని చంద్రబాబును ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. బాబు పిరికితనాన్ని కూడా జనం పసిగట్టారు. జగనే బాబు టార్గెట్ ఎందుకయ్యారో తెలుసుకోలేని అజ్ఞానంలో జనం లేరని గ్రహించి బాబు తన వైఖరి మార్చుకుంటే మంచిది.