తిరుపతి లోక్సభ ఉప పోరులో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో సాహసోపేత నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ఇప్పటికే ఈ విషయమై తన పార్టీ ఎమ్మెల్యేలకు సూచన ప్రాయంగా సమాచారం ఇచ్చారు. జగన్ నిర్ణయం వైసీపీ ఎమ్మెల్యేల్లో ఆందోళన కలిగిస్తోంది.
మరోవైపు జగన్ నిర్ణయం తమ నేత్తిన పాలుపోసిన చందంగా ఉందని ప్రతిపక్షాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతి ఉప బరిలో ఓటర్లకు ఒక్క రూపాయి కూడా పంచకూడదని జగన్ దృఢ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వస నీయ సమాచారం. ఇలాంటి నిర్ణయం తీసుకోడానికి ఎంతో సాహసం ఉండాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నిజానికి అవినీతిమయమైన సమాజంలో నీతిగా బతకడానికి భయపడాల్సిన పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏటికి ఎదురీత ఈదడమే. ఆదర్శాలు చెప్పుకోడానికి బాగుంటాయి. కానీ ఆచరణే కష్టసాధ్యం. రాజకీయాలన్నా, రాజకీయ నేతలన్నా అవినీతికి, అబద్ధాలకు, అక్రమాలకు పర్యాయ పదాలుగా జనం ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చారు.
ఈ నేపథ్యంలో తమ సొమ్మును దోచు కుంటూ, కనీసం ఎన్నికలప్పుడైనా దాన్ని బయటకు తీయలేదంటూ జనం జీర్ణించుకోలేని పరిస్థితి సమాజంలో నెలకుంది. మరో వైపు ఓటర్లకు డబ్బు ఇవ్వగలిగే ఆర్థిక స్తోమత ఉన్న అధికార పార్టీ …ఓటర్లకు డబ్బు ఇవ్వకపోతే నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుందనే ఆందోళన వైసీపీ ఎమ్మెల్యేల్లో బలంగా ఉంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాదన మరోలా ఉంది. అధికారంలోకి వచ్చిన రోజు మొదలుకుని గత 22 నెలలుగా నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి ఎలాంటి లోటు లేకుండా అందిస్తున్నామని, అలాంటప్పుడు మళ్లీ ఓట్లను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏంటని తన పార్టీ ఎమ్మెల్యేలను జగన్ ప్రశ్నించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలు ప్రభావం జనంలో ఏ మాత్రం ఉందో తెలుసుకోడానికి తిరుపతి ఉప పోరును ప్రయోగాత్మకంగా చేపట్టాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం.
అయితే సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేసినా, ఓట్లప్పుడు మాత్రం డబ్బు ఇవ్వడం ఓ సంప్రదాయంగా వస్తోందని, ఇవ్వని పార్టీలను శత్రువులుగా చూసే ప్రమాదం ఉందనే ఆందోళన వైసీపీ ప్రజాప్రతినిధులను వేధిస్తోంది.
ఓటుకు నోటు ఇవ్వకూడదనే జగన్ ఆదర్శం మంచిది, ఆహ్వానించదగినది అయినప్పటికీ, ఆచరణకు వచ్చే సరికి వాస్తవాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని వైసీపీ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఐదు లక్షలకు పైగా మెజార్టీ సాధించాలన్న సీఎం లక్ష్యంపై ఓటర్లకు డబ్బు పంపిణీ చేయకపోవడం ఏ విధంగా ప్రభావం చూపుతుందోననే ఆందోళన మాత్రం వైసీపీని వెంటా డుతోంది.
మరోవైపు జగన్ తన నిర్ణయానికి కట్టుబడి డబ్బు పం పిణీ చేయకపోతే మాత్రం …పరోక్షంగా తమకు లబ్ధి చేకూర్చినట్టే అని ప్రతిపక్ష పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఓ మంచి పని చేపట్టాలంటే, ఎవరో ఒకరు ఎపుడో ఒకప్పుడు మొదలు పెట్టాలని, అందుకు కొంత మూల్యం కూడా చెల్లించుకోక తప్పదని ప్రజాస్వామికవాదులు చెబుతున్నారు. అది జగన్ రూపంలో మొదలైతే మరీ మంచిదంటున్నారు.