టాప్ ఫైవ్ హీరోల సరసన విజయ్

ఈ ఏడాది టాలీవుడ్ మాంచి జోష్ మీద వుంది. రంగస్థలం సినిమానే ఓ కమర్షియల్ అద్భుతం అనుకుంటే, గీత గోవిందం ఇంకానూ అన్నట్లు వుంది. అది పెద్ద సినిమాగా బ్లాక్ బస్టర్ అయితే, ఇది…

ఈ ఏడాది టాలీవుడ్ మాంచి జోష్ మీద వుంది. రంగస్థలం సినిమానే ఓ కమర్షియల్ అద్భుతం అనుకుంటే, గీత గోవిందం ఇంకానూ అన్నట్లు వుంది. అది పెద్ద సినిమాగా బ్లాక్ బస్టర్ అయితే, ఇది చిన్న సినిమాగా బ్లాక్ బస్టర్ అయింది. రంగస్థలం సినిమా విడుదయిన తరువాత అమెజాన్ ప్రయిమ్ లో పెట్టేసినా కూడా కలెక్షన్లు కుమ్ముతూనే వచ్చింది. ఒక్క రంగమ్మ.. మంగమ్మ పాట మీద యూట్యూబ్ లోనే భయంకరమైన ఆదాయం వచ్చి వుంటుంది మైత్రీ జనాలకు. లేదా డిజిటల్ రైట్స్ తీసుకున్నవారికి.

ఇప్పుడు గీత గోవిందం వ్యవహారం కూడా అలాగే వుంది. సినిమా విడుదల మూడువారాల తరువాత నిన్నటి శుక్రవారం కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దగ్గర దగ్గర 30 లక్షల షేర్ వసూలు చేసింది. రెండు రాష్ట్రాలకు కలిపి 29.76 లక్షల షేర్ వచ్చింది. శుక్రవారం ఏకంగా కాస్త టాక్ వున్న సినిమాలు మూడు, మరో అరడజను చిన్న సినిమాలు విడుదలయ్యాయి. నన్ అనే హాలీవుడ్ డబ్బింగ్ కూడా వచ్చింది.

అయినా వీటన్నింటిని తట్టుకుని 30 లక్షల షేర్ రాబట్టడం అంటే చిన్న విషయం కాదు. పైగా కొన్ని సెంటర్లలో ఈవారం విడుదల అయిన వాటికన్నా, గీత గోవిందం షేర్ ఎక్కువ వుంది. ఈ లెక్కన ఈ వీకెండ్ లో ఒక కోటి రూపాయలు షేర్ లాగేలా వుంది. ఇప్పటికే 60కోట్లను దాటేసింది గీత గోవిందం షేర్.

ఈ సినిమా పుణ్యామాని, విజయ్ దేవరకొండ తరువాత సినిమా నోటా ఆంధ్ర ఏరియా హక్కులే 30 కోట్లకు పైగా చెబుతున్నారట. ముఫై కోట్లకు పైగా అంటే టాప్ హీరోల సినిమాల కింద లెక్క. రంగస్థలం ముఫై మూడుకోట్లు, భరత్ అనే నేను నలభై కోట్ల రేషియోలో అమ్మారు.

ఇప్పుడు విజయ్ సినిమా కూడా ఆ రేంజ్ లో చెప్పడం అంటే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో విజయ్ టాప్ ఫైవ్ హీరోల సరసన చేరిపోయినట్లే. ప్రస్తుతం ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ వున్నారు. చిరంజీవి లెవెల్ వేరు. పవన్ రిటైర్డ్ అనుకోవాల్సిందే. ఇప్పుడు విజయ్ కూడా జాబితాలో ఫ్లేస్ తెచ్చుకున్నట్లే.