cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: సిల్లీ ఫెలోస్‌

సినిమా రివ్యూ: సిల్లీ ఫెలోస్‌

రివ్యూ: సిల్లీ ఫెలోస్‌
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ
తారాగణం: అల్లరి నరేష్‌, సునీల్‌, చిత్ర శుక్లా, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, పూర్ణ, నందిని రాయ్‌, రఘు కారుమంచి, బ్రహ్మానందం, రాజా రవీంద్ర, రాంప్రసాద్‌ తదితరులు
సంగీతం: శ్రీవసంత్‌
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: అనీష్‌ తరుణ్‌ కుమార్‌
నిర్మాతలు: కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి
దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు
విడుదల తేదీ: సెప్టెంబర్‌ 7, 2018

సునీల్‌ హీరో వేషం పక్కనపెట్టి మళ్లీ తన కంఫర్ట్‌ జోన్‌లోకి వచ్చేసాడు. కామెడీతో టచ్‌ పోయి చాలా కాలమైందిగా ఎలా చేస్తాడో అనే చింతలేకుండా అంతా తానే నడిపించాల్సిన భారం తనపై లేకపోతే ఎంత అవలీలగా హాస్యం పండించగలడో చూపించాడు. సునీల్‌కి 'సిల్లీ ఫెలోస్‌' ఎక్కువ స్కోప్‌ ఇవ్వకపోయినా తానే స్పేస్‌ క్రియేట్‌ చేసుకుని మరీ వింటేజ్‌ సునీల్‌ని గుర్తు చేసాడు. ఇక తనకంటూ ప్రత్యేకమైన పాత్రలు రాసే దర్శకులతో మరొక్కమారు నవ్వులతో చెలరేగిపోతాడనడంలో సందేహంలేదు.

ఇక సినిమా విషయానికి వస్తే... చాలా సాధారణ స్టోరీ. నాలుగైదు ఇన్సిడెంట్స్‌ బేస్‌ చేసుకుని రాసుకున్న కామెడీ. ఎంఎల్‌ఏ జాకెట్‌ జానకిరామ్‌ (జయప్రకాష్‌రెడ్డి) జరిపించే మూకుమ్మడి వివాహాలలో ఒక జంట తక్కువ అయితే వీరబాబు (అల్లరి నరేష్‌) తన స్నేహితుడు సూరిబాబుని (సునీల్‌) పెళ్లి చేసుకున్నట్టు నటించమంటాడు. కంగారులో పుష్ప (నందిని రాయ్‌) అనే రికార్డింగ్‌ డాన్సర్‌కి నిజంగానే తాళి కట్టేస్తాడు సూరిబాబు. ఆమెతో విడాకులు తీసుకుంటే గానీ పెళ్లి చేసుకోను పొమ్మంటుంది అతని గాళ్‌ఫ్రెండ్‌ (పూర్ణ). పోలీస్‌ కావాలనే ఆశ వున్న వాసంతి (చిత్ర) తల్లి పలుకుబడి వున్నవాడని పదిలక్షలు లంచం ఇచ్చి ఉద్యోగం వేయించమని వీరబాబుని కోరుతుంది. పదిలక్షలు జానకిరామ్‌కి ఇస్తాడు కానీ అదే రోజు అతనికి యాక్సిడెంట్‌ అయి కోమాలోకి వెళతాడు. మరోవైపు అయిదు వందల కోట్ల రహస్యం కూడా జానకిరామ్‌కే తెలియడంతో అతడి నుంచి నిజం రాబట్టాలని చూస్తుంటారో రౌడీ గ్యాంగ్‌ (పోసాని). ఎంఎల్‌ఏ కోమాలోంచి బయటకి వస్తే కానీ వీళ్ల సమస్యలు తీరవు. తీరా అతను కోమాలోంచి బయటకి వచ్చేసరికి గతం మరచిపోతాడు.

రెండు మూడు ఘట్టాలు మినహా మేటర్‌ లేకపోవడంతో నటీనటుల మీదే డిపెండ్‌ అవ్వాల్సి వచ్చింది. వారిలో సునీల్‌ ఒక్కడే ఫామ్‌లో వున్నట్టు అనిపిస్తాడు. ఇష్టంలేని వ్యక్తిని పెళ్లి చేసుకున్న సునీల్‌కి తన భార్య అయిన పుష్పకి వున్న బ్యాడ్‌ నేమ్‌ గురించి తెలిసివచ్చే సీన్లతో హాస్యం బాగానే పండింది. ప్రథమార్ధంలో చాలావరకు ఇదే సన్నివేశాలతో గడిచిపోతుంది. వాసంతితో వీరబాబు లవ్‌స్టోరీ మాత్రం కామెడీకి అడ్డుపడడానికి తప్ప వినోదానికి దోహదపడలేదు. నరేష్‌, సునీల్‌ ఇద్దరూ కలిసి కనిపించిన సన్నివేశాల్లో కెమిస్ట్రీ బాగా కుదిరింది. సీన్‌లో కంటెంట్‌ లేకపోయినా కానీ ఇద్దరూ తమ అనుభవంతోనే కాన్వర్‌జేషన్స్‌ వర్కవుట్‌ అయ్యేట్టు చూసుకున్నారు. నరేష్‌ కాస్త డల్‌గా అనిపించినా సునీల్‌ మాత్రం హోమ్‌ పిచ్‌ అడ్వాంటేజ్‌ వున్న బ్యాట్స్‌మన్‌లా రెచ్చిపోయాడు. హీరో కావడం కోసం సిక్స్‌ ప్యాక్‌లు గట్రా చేసిన సునీల్‌ తిరిగి మునుపటి 'బంతి' ఆకారానికి వచ్చేయడం అతనికి పెద్ద ప్లస్సు.

ఎక్కువ కంటెంట్‌ లేకపోయినా ప్రథమార్ధం సాఫీగా సరదాగానే సాగిపోతుంది. ద్వితియార్ధంలో అదే జోరుని కొనసాగించడంలో విఫలమయ్యాడు భీమనేని. దాదాపుగా సెకండ్‌ హాఫ్‌ మొత్తం జయప్రకాష్‌రెడ్డి క్యారెక్టర్‌ చుట్టే తిరుగుతుంది. కోమాలోంచి బయటకి వచ్చిన తర్వాత చిన్న పిల్లాడిలా ప్రవర్తించడం, లాలీపాప్‌ లాక్కున్న వారి చెవులు కొరికేయడం లాంటివి నవ్వించకపోగా బాగా విసిగిస్తాయి. దీనికి బదులుగా ఏదైనా కన్‌ఫ్యూజన్‌ కామెడీ పెట్టి, సునీల్‌ని వాడుకుని వుంటే బాగుండేది. ఈ పార్ట్‌లో నరేష్‌, సునీల్‌ కంప్లీట్‌గా సైడ్‌లైన్‌ అయిపోవడంతో కాసేపు సిల్లీ ఫెలోస్‌ టార్చర్‌ పెడుతుంది. ఎంతకీ కట్‌ చేయని సదరు పిల్లాడి కామెడీని హాస్పిటల్‌ నుంచి రోడ్ల మీదకి తెచ్చి మరీ సాగతీయడంతో అంతకుముందున్న సరదా మొత్తం పోయి చిరాకు కలుగుతుంది.

క్లయిమాక్స్‌కి ఒక పావుగంట ముందు జానకిరామ్‌కి గతం గుర్తురావడంతో కాస్త గాడిన పడుతుంది. ఏది గుర్తు చేసుకోవాలన్నా కానీ పొద్దున్న లేచిన దగ్గర్నుంచీ చేసిందంతా చెబితే తప్ప గుర్తు రాకపోవడం అనే పాయింట్‌పై చేసిన కామెడీ ఓకే అనిపిస్తుంది. చాలా కామెడీ సినిమాల్లో మాదిరిగానే క్లయిమాక్స్‌లో అన్నిపాత్రలు ఒకేచోట చేరి నవ్వించడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తాయి. సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌లో జెపి కామెడీ అక్కడక్కడా నవ్విస్తుంది. బ్రహ్మానందం సీన్‌ వల్ల ప్రయోజనం లేకపోయింది. రఘు కారుమంచి కామెడీ సోకాల్డ్‌ మాస్‌ కామెడీ ఇష్టపడేవారిని నవ్విస్తుందేమో మరి. పోసాని ఎప్పటిలానే లౌడ్‌ కామెడీతో ఇబ్బంది పెడితే, హీరోయిన్‌ చిత్ర శుక్లా కామెడీ చేయాలో, సీరియస్‌గా వుండాలో తెలియని అయోమయంలో కనిపించింది.

పెంచల్‌ దాస్‌ పాడిన 'హెడ్డేకురా మామ' క్యాచీగా వుంది. మిగతా సాంకేతిక విభాగాల గురించి చెప్పుకోవాల్సినదేమీ లేదు. సీన్‌ టు సీన్‌ రీమేక్‌ సూత్రానికి కట్టుబడే భీమనేని శ్రీనివాసరావు వేలైను వందుట్ట వేలైకారన్‌ చిత్రాన్ని యథాతథంగా దించేసాడు. ఒకటీ అరా ఎపిసోడ్లతో నవ్వించే ఈ చిత్రం నరేష్‌-సునీల్‌ కాంబినేషన్‌ నుంచి ఆశించే స్థాయి హాస్యాన్ని అయితే అందించలేకపోయింది. కాస్త కామెడీ వుంటే కాలక్షేపమైపోతుందనే వారికి ఈ డోస్‌తో టైమ్‌పాస్‌ అయిపోతుంది. నీటు కామెడీని ఇష్టపడే వారికి మరీ సిల్లీగా తోచే ఈ చిత్రం నాటు కామెడీ ఇష్టపడే వారి సాయంతో ఒడ్డునపడాలి.

బాటమ్‌ లైన్‌: సునీల్‌ ఈజ్‌ బ్యాక్‌!
-గణేష్‌ రావూరి