ఇద్దరు అమాయకులు లేదా ఇమ్యెచ్యూర్ పర్సన్స్ కాపురం చేస్తే.. అదెంత క్రేజీగా సాగినా, కొంతకాలానికి గొడవలొస్తాయి! పెళ్లి చేసుకుని కాపురం చేసే ఆడ, మగ ఇద్దరూ అతి తెలివైన వాళ్లు అయితే.. ఒకరి తెలివి మరొకరిపై చూపుతూ.. సహనం కోల్పోయి గొడవలకు దారి తీయవచ్చు. బయటి జనాలకు ఎంత ఒద్దికగా కనిపించినా.. లోలోన మాత్రం వీరి వ్యవహారం వేరేగా ఉంటుంది.
భార్యాభర్తల్లో ఒక్కరు అతి తెలివైన వారు మరొకరు అమాయకులు అయితే.. తెలివైన వారు తమ మ్యానిపులేటివ్ టెక్నిక్స్ అన్నింటినీ వీరిపై ప్రయోగిస్తే.. ఆ కాపురమూ గందరగోళమే. ఒకరు అమాయకులు, అశక్తులు కాబట్టి అన్నీ భరిస్తూ సాగిపోతూ ఉంటారంతే! మరి ఇంతకీ సవ్యంగా కాపురం చేయగల జంట ఏది? అంటే.. మాత్రం ఎవ్వరూ చెప్పలేరు!
ఇద్దరూ అమాయకులు అయినా.. ఏదో ఒక దశలో అనసరమైన వ్యవహారంలో గొడవలు వస్తాయి. కనీసం ఇద్దరూ రాజీ కూడా పడలేరు. వీరికి సర్దిచెప్పడానికి బంధుగణం పంచాయతీలు జరగాల్సిందే. చిన్న వయసులో పెళ్లిళ్లు జరిగే కాలాల్లో ఇలాంటి రచ్చలు ఎక్కువగా ఉండేవి. అయితే ఇప్పుడు బాల్య వివాహాలు లేవు, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలను రచ్చకీడ్చుకోవడానికి ఇప్పుడు పెద్దగా ఎవ్వరూ ఇంట్రస్ట్ తో లేరు.
గతంలో బంధువులను పిలిచి కూర్చోబెట్టి.. రాజీ మార్గాన్ని అనుసరించే వారు. ఇప్పుడు అలా చేస్తే నవ్వులపాలవుతామని డైరెక్టుగా విడాకులు అనేస్తున్నారు. నలుగురిలో చర్చ కన్నా.. విడాకులే నయమనుకునే రోజులు వచ్చాయి. మరి వివాహం అంటే.. దానికి ఫిజికల్ మెచ్యూరిటీ సంగతెలా ఉన్నా, మెంటల మెచ్యూరిటీ చాలా ముఖ్యమని అంటున్నారు రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్.
వివాహం చేసుకోవాలనుకుంటే.. కొన్ని రకాల మెచ్యూరిటీలో మనలో ఉందా.. లేదా.. అని చెక్ చేసుకుని, ఆ తర్వాత ముందుకు వెళ్లడం మంచిదని వారు చెబుతూ ఉన్నారు. మరి అందుకు సెల్ఫ్ చెక్ ఏమిటంటే..
బాధ్యత తీసుకోగలరా?
అంత వరకూ గడిపిన జీవితం వేరే, పెళ్లి అయ్యాకా.. మాత్రం ఎంత లేదన్నా కొన్ని రకాల బాధ్యతలు కచ్చితంగా ఉంటాయి. సమయానికి ఇంటికి వెళ్లడం, స్నేహితులంటూ తిరిగే సమయం తగ్గిపోవడం, లేదా విపరీతంగా ఆఫీస్ లో సమయం కేటాయించే తత్వాన్ని తగ్గించుకోవడం.. ఇలాంటి వాటిల్లో మార్పు రావాల్సి ఉంటుంది. పెళ్లి తర్వాత.. ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లికి ముందులా ఉండదు పరిస్థితి! ఈ విషయాన్ని కచ్చితంగా గ్రహించాల్సి ఉంటుంది. ఉద్యోగానికో, వ్యాపారికో కేటాయించే సమయం అయిపోయాకా.. మిగిలిన సమయాన్ని మాత్రం పార్ట్ నర్ కోసమే కేటాయించాల్సి ఉంటుంది. అలా చేయలేం అనుకుంటే, పెళ్లి ఆలోచనే మానుకోవడం మంచిది!
కమ్యూనికేషన్ స్కిల్స్!
ఈ రోజుల్లో ఏ మంచి ఉద్యోగం చేయాలన్నా.. మంచి స్థాయి కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యం. అలాగే వైవాహిక జీవితాన్ని సవ్యంగా సాగించాలన్నా.. పార్ట్ నర్ తో అనుసంధానం కావడానికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యం. అంటే ఏ ఇంగ్లిష్ లోనో అందంగా చెప్పడం కాదు, ఎలా చెబితే పార్ట్ నర్ కు అర్థం అవుతుందనే విషయాన్ని గ్రహించగలగాలి. అప్పటి వరకూ ఏ స్నిహితులనో, లేదా ఇంట్లో వాళ్లనో డీల్ చేసినట్టుగానే పార్ట్ నర్ ను డీల్ చేస్తే తేడా కొట్టొచ్చు. కాబట్టి.. వాళ్లు వేరు, పార్ట్ నర్ వేరు అనే విషయాన్ని ఎరిగి మసలు కోవాలి!
నేనే అంతా అనుకోరాదు!
తమ పార్ట్ నర్ నుంచి విపరీతంగా అటెన్షన్ ను గ్రాబ్ చేయాలనే ఇమ్మెచ్యూరిటీ కొందరిలో ఉంటుంది. పెళ్లి అయిన వారిలో కూడా ఇదొక అలవాటుగా ఉంటుంది. ఒకవేళ పార్ట్ నర్ ఆ విషయాన్ని అర్థం చేసుకోగలిగే వారు అయితే ఫర్వాలేదు కానీ, లేకపోతే తేడా కొట్టవచ్చు. ప్రతి విషయాన్ని పెద్దదిగా చెప్పడం, ఇంటికి తనే కేంద్రీకృతం అన్నట్టుగా, అన్నీ తన ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉండాలన్నట్టుగా వ్యవహరిస్తే.. పార్ట్ నర్ కు విసుగు వచ్చినా ఆశ్చర్యం లేదు.
ఎమోషన్స్ ను హ్యాండిల్ చేయాలి!
కేవలం కాపురమే కాకుండా.. మనిషిని నియంత్రించే చాలా రకాల ఎమోషన్స్ రోజులో ఎదురవుతూ ఉంటాయి. ఆఫీసు విషయాలు, మరోటో.. బంధువులతోనో, తోబుట్టువులతోనో ఇబ్బందులో, సంతోషాలో ఏవో ఒకటి.. పార్ట్ నర్ అని చెప్పి అన్నింటినీ రుద్దడమో, మీ ఎమోషన్లే కాపురానికి ప్రాతిపదిక అనుకుంటే మాత్రం పార్ట్ నర్ లో విసుగును రేకెత్తిస్తున్నట్టే!
మరి పెళ్లిళ్లు చేసుకుని దశాబ్దాలకు దశాబ్దాలు కాపురాలు చేసుకుంటున్న వారందరిలోనూ ఈ మెచ్యూరిటీ లెవల్స్ ఉంటాయని కాదు, ఈ మాత్రం కూడా లేకుండా చాలా మంది కాపురాలు సాగిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి విషయాలను గ్రహించని వారి కాపురంలో కచ్చితంగా చిటపటలుంటాయి. అవి ఉండకూడదనుకుంటే.. కనీస మెచ్యూరిటీ అవసరం అనేది ఎక్స్ పర్ట్స్ మాట!