పట్టుతప్పిన నాయకత్వంతో వైసీపీ

వ్యక్తిగతం వేరు, రాజకీయం వేరు. వ్యక్తిగతమైన వ్యవహారాలకి రాజకీయాన్ని ముడిపెట్టాలంటే సాధారణంగా పార్టీ పెద్ద అనుమతి ఉండాలి. ఫలానా పని చేయడం వల్ల పార్టీకి ప్రయోజనమేంటి అనే దిశలో ఆలోచన చెయ్యాలి. కానీ అలాంటివేమీ…

వ్యక్తిగతం వేరు, రాజకీయం వేరు. వ్యక్తిగతమైన వ్యవహారాలకి రాజకీయాన్ని ముడిపెట్టాలంటే సాధారణంగా పార్టీ పెద్ద అనుమతి ఉండాలి. ఫలానా పని చేయడం వల్ల పార్టీకి ప్రయోజనమేంటి అనే దిశలో ఆలోచన చెయ్యాలి. కానీ అలాంటివేమీ వైకాపా కనిపిస్తున్న దాఖలాలు లేవు. 

మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఆఫీసర్లైనా…ఇలా ఎవ్వరైనా సరే ఎవరికి తోచినట్టు వాళ్లు తమ వ్యక్తిగత ఉనికిని చాటుకునే పనులే చేస్తున్నారు. ఇది పార్టీకి లాభమా నష్టమా అని ఆలోచించే నాథులు లేరు. అయితే ఇదంతా ఐ-పాక్ వారి అదుపానల్లో జరుగుతోందా అంటే అదీ అనుమానమే. ఎందుకంటే అక్కర్లేని విషయాల్లో హడావిడి చేసి అసలు విషయాల్ని విస్మరిస్తే ప్రమాదముంటుందని ఐ-పాక్ లాంటి సంస్థలు సాధరాణంగా చెప్తాయి. ఒకవేళ అలా చెప్పట్లేదన్నా, ఏదో ఊహించి ఈ స్ట్రాటజీని వాళ్లే పన్నినా అంతకంటే దుష్ప్రయోజనం మరొకటి ఉండదు. 

ప్రజలంటే వైకాపా అభిమానులు మాత్రమే కాదు. అందరూ ఉంటారు. నిజానికి ఒక పార్టీ విజయాన్ని నిర్ణయించేది లాయల్ ఓటర్స్ కంటే న్యూట్రల్ ఓటర్సే. లాయల్ ఓటర్స్ ని ఎంటెర్టైన్ చేసే క్రమంలో న్యూట్రల్ ఓటర్స్ ని చిరాకు పెట్టే పనులు చేయకూడదు. 

ఇప్పుడు తాజాగా నడుస్తున్నది అంబటి రాంబాబు “బ్రో” గొడవ. తొలి ప్రెస్మీటులో తానేమీ పట్టించుకోను అంటూనే మలి ప్రెస్మీట్లో నిర్మాత టిజి విశ్వప్రసాద్ ని కూడా గొడవలోకి లాగారు. పవన్ కల్యాణ్ ని అన్నంతవరకూ పర్వాలేదు. అదంతా వైకాపా-జనసేన మధ్య గొడవ అన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే విశ్వప్రసాద్ ని లాగారో తీగని లాగాల్సిన దానికంటే ఎక్కువ లాగిన ఫీలింగొచ్చింది చాలామందికి.

ఆ నిర్మాతపైన హవాలా అభియోగాలు వేయడం, ఈడీకి ఫిర్యాదు చేస్తారా అంటే…”అలా బయట అనుకుంటే అనుకోనీయండి” అనడం ..ఇవన్నీ పార్టీ పెద్ద జగన్ మోహన్ రెడ్డికి తెలిసే జరుగుతున్నాయా అంటే తెలీదు. 

అసలు రెండు మూడు బిట్ సీన్స్ లో కనిపించే ఆ పాత్రని పట్టుకుని అసలు సినిమాయే తన మీద తీసినంతగా రాద్ధాంతం చేయడం అవసరమా? దీనికంటే పవన్ ని ఇరకాటంలో పెట్టే బలమైన అంశాలు ఎన్నో ఉన్నాయి కదా. 

ఏదో ఒక రకంగా ప్రత్యర్థులని, వారికి అండగా నిలిచే వారిని ఇబ్బంది పెడుతూ ఉంటే పార్టీ అధినేత మెప్పు పొందవచ్చనే అభిప్రాయం ఒకటి బాగా ప్రబలిపోయింది వైకాపాలో. సైలెంటుగా కూర్చోకుండా ఏదో ఒక యాక్షన్ చేస్తుంటేనే జగన్ మోహన్ రెడ్డి కళ్లల్లో పడతామనుకునే వాళ్లే ఎక్కువగా ఉన్నారు పార్టీలు. నిజంగా డబ్బు చేసుకుంటున్నవాళ్లు మాత్రం లో ప్రొఫైల్లో ఉంటూ సైలెంటుగానే ఉంటున్నారు. 

అంతెందుకు.. మొన్నీమధ్య జగన్ మోహన్ రెడ్డి దగ్గరకి మరీ పాజిటివ్ సర్వేలు మాత్రమే ఎందుకు మోసుకెళ్తున్నారని అడిగితే, “నూటపదో, నూట ఇరవయ్యో వస్తాయంటే ఆయన లోపలికి కూడా రానీయరు మరి” అని బదులిచ్చాడొక ఆంతరంగికుడు. 

జగన్ కి ఏది మంచో చెప్పకుండా ఏది నచ్చుతుందో మాత్రమే చెప్పి ప్రశాంతంగా బతికేస్తున్నారు చుట్టూ ఉన్నవాళ్లు. ఇది మంచికా చెడుకా అంటే కాలమే చెప్పాలి. 

అయినా నిత్యం దైవాన్నే నమ్ముకునే జగన్ మోహన్ రెడ్డిని ఆ దైవమే కాపాడాలి తప్ప చుట్టూ ఉన్న ఏ ఒక్క నాయకుడూ కాపాడే లెక్కల్లో లేరు. అయితే వార్తల్లో నలిగి బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం, లేదా సైలెంటుగా ఉంటూ భారీగా సంపాదించుకోవడం…ఇది మాత్రమే చేస్తున్నారు నాయకులు, ఆఫీసర్లు. 

జనం తానిచ్చే పథకాలకి ఓట్లు కచ్చితంగా వేస్తారని, పేదప్రజలకి మంచి చేసినందుకుగాను పైనున్న దేవుడు కచ్చితగా ఈ సారి 175/175 స్కోరిచ్చి గెలిపిస్తాడని బలంగా నమ్ముతున్న జగన్ మోహన్ రెడ్డికి ఫలితం సానుకూలంగా వస్తుందా లేదా అనేది కాలమే చెప్పాలి. 

ఏది ఏమైనా ఫలితాన్ని బట్టే ఆయన ధోరణి సరైనదా కానిదా అని కాలం నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికి వైకాపా పరిస్థితి పట్టుతప్పిన నాయకత్వం ..ఆపైన దైవాధీనం అన్నట్టుగా ఉంది. 

శ్రీనివాసమూర్తి