రివ్యూ: కేరాఫ్ కంచరపాలెం
రేటింగ్: 3.25/5
బ్యానర్: పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్
తారాగణం: సుబ్బారావు, రాధా బెస్సి, మోహన్ భగత్, విజయ ప్రవీణ, కార్తీక్ రత్నం, ప్రణీత పట్నాయక్, కేశవ కర్రి, నిత్యశ్రీ గోరు తదితరులు
సంగీతం: స్వీకర్ అగస్తి
కూర్పు: రవితేజ గిరిజాల
ఛాయాగ్రహణం: వరుణ్ షాఫీకర్, ఆదిత్య జవ్వాది
సమర్పణ: రానా దగ్గుబాటి
నిర్మాత: పరుచూరి విజయ ప్రవీణ
రచన, దర్శకత్వం: వెంకటేష్ మహా
విడుదల తేదీ: సెప్టెంబర్ 7, 2018
సినిమా అనే కళ ఎందుకు పుట్టిందనే దానికి సిసలైన ఉదాహరణగా నిలుస్తాయి 'కేరాఫ్ కంచరపాలెం'లాంటి ఆణిముత్యాలు. 'సినిమా అంటే ఏమిటి?' అనే దానికి ప్రతి ఫిలింమేకర్ దగ్గర ఒక్కో సమాధానం వుంటుంది. వారి ఆలోచనలే వారు తీసే సినిమాలవుతాయి. కొందరికి నవ్వించి పంపించడం సినిమా అయితే, మరొకరికి ఏడిపించడం, ఇంకొకరికి 'లార్జర్ దేన్ లైఫ్' హీరోయిజం చూపించడం. 'సినిమా అంటే జీవితం… వెండితెరపై జీవితాన్ని ఆవిష్కరించడం' అని ఎప్పుడో అరుదుగా వస్తుందిలాంటి సమాధానం.
'మంచి సినిమా ఎంతలో తీయవచ్చు?' సినీ నగర వీధుల్లో తరచుగా వినిపించే ప్రశ్న ఇది. దీనికి కూడా పలు రకాల సమాధానాలొస్తాయి. జీవితాన్ని చదివిన అనుభవం వుంటే, జీవితంలోని చేదు, తీపి స్మృతులకి తెరరూపం ఇవ్వగలిగే నేర్పు వుంటే, నువ్వు చెప్పే కథలో నన్ను నేను చూసుకునేంత నిజాయితీ వుంటే… ఒక పెద్ద సినిమాకి అయ్యే క్యాటరింగ్ ఖర్చుతోను మంచి సినిమా తీసేయవచ్చు. పైన చెప్పినవన్నీ వుంటే ముక్కు, మొహం తెలియని 'సుబ్బారావు'ని హీరోగా పెట్టి కదలకుండా అతని కథ సాంతం చూసేట్టు చేయవచ్చు.
ఓ గవర్నమెంట్ ఆఫీసులో అటెండర్‌గా పని చేసే రాజు (సుబ్బారావు), అక్కడికి ట్రాన్స్‌ఫర్‌పై వచ్చిన ఒరియా ఆఫీసర్ రాధ (రాధా బెస్సీ) మధ్య స్నేహం చిగురిస్తుంది. ఇద్దరి మధ్య తాహతులోనే కాక ఇంకా చాలా వ్యత్యాసాలున్నా వాటన్నిటినీ అధిగమించిన బంధం ఏర్పడుతుంది. అదే గ్రామంలో ఎక్కడో ఒక పక్కన ఎనిమిదో తరగతి చదువుతోన్న సుందరానికి (కేశవ) సునీతే (నిత్యశ్రీ) ప్రపంచం. తనకిష్టమైన రంగు అని పింక్ చొక్కా కోరి మరీ కొనుక్కున్న సుందరం ఆమెతో స్టేజీపై పాట పాడించడానికి 'మరో చరిత్ర' పాటల పుస్తకం కొనిస్తాడు. అక్కడే ఇంకోచోట ఎక్కడో వైన్ షాపులో పని చేసే గడ్డం (మోహన్ భగత్) రోజూ తమ షాప్ దగ్గరకి వచ్చి 'క్వార్టర్' కొనుక్కు వెళ్లే సలీమ (విజయ ప్రవీణ) కళ్లు చూసే ప్రేమించేస్తాడు. ఆమె వేసుకొచ్చే ముసుగు చాటు ముఖం తెలుసుకున్నపుడు అతనేం చేస్తాడు? కంచరపాలెంలో 'అమ్మోరు వ్యాయామశాల' నడిపే లోకల్ దాదా దగ్గర కిరాయికి పని చేసే జోసెఫ్ (కార్తీక్) తననే కొట్టించిన గడసరి భార్గవితో (ప్రణీత) ప్రేమలో పడ్డాక ఏమవుతాడు?
ఫలానా పాత్రని కథానాయకుడు, కథనాయకి అనుకోవడానికి వుండదు. అసలు తెరపై జరిగేది ఎవరో తీసి చూపిస్తున్న సినిమాలా అనిపించదు. నిజంగానే ఆ కంచరపాలెంకి వెళ్లి ఈ పాత్రలన్నిటినీ ఎదురుగా కూర్చుని చూస్తోన్న భావన కొద్ది సేపట్లోనే కలిగిస్తుంది. ఎంత వాస్తవ కథలని తెరకెక్కించినా సినిమా అనేసరికి ఆ రంగు, హంగు ఆటోమేటిగ్గా వచ్చి చేరిపోతుంది. కానీ 'కేరాఫ్ కంచరపాలెం'లో ఏ సందర్భంలోను ఆ మట్టి వీధులు, మురికి గోడలని కలర్‌ఫుల్‌గా చూపించడానికి, లేదా సేపియా టింట్‌లతో అక్కడ లేని దానిని వున్నట్టు భ్రమ కలిగించే ప్రయత్నాలేమీ చేయలేదు. ఈ విషయంలో ఛాయాగ్రాహకులని ఎంత ప్రశంసించినా తక్కువే. ఆ ఇరుకు వీధుల్లో అంత సహజంగా సన్నివేశాలని తెరకెక్కించిన విధానం అద్భుతంగా వుంది. తెరపై ఏది జరుగుతున్నా చూస్తోన్న మన కళ్ల ముందే జరుగుతోందనే భావన కలిగించేలా రూపొందించిన తీరుకి మెచ్చుకుని తీరాలి.
తెలిసీ తెలియని వయసులో 'నచ్చిన' అమ్మాయితో మాట్లాడ్డానికి తపన పడే సుందరంలో ఇప్పటి పెద్దలు తమ బాల్యాన్ని వెతుక్కుంటారు. ఆ పసితనంలోని ఇష్టాలకి తగ్గట్టే ఇంత మలినం లేకుండా ఆ సన్నివేశాలు, సంభాషణలు దర్శకుడిపై గౌరవాన్ని పెంచుతాయి. 'అబ్బాయ్ సుందరం…' అంటూ ఆ పిల్ల పిలిస్తే, 'అమ్మాయ్' అంటూ ఆ పిల్లాడు పిలవడం, పాటల పుస్తకాలు, తాటాకు గొడుగులు.. చిన్న సాయానికి కూడా రెండ్రూపాయల లంచం అడిగే స్నేహితుడూ… ప్రతి ఘట్టం గురించి ఒక గ్రంథం రాయవచ్చుననేంతగా దర్శకుడు మహా మహ గొప్పగా తీసాడు. అన్నట్టు స్నేహితుడంటే గుర్తొచ్చింది… కొత్తగా వచ్చిన టీచర్ పిల్లల ఇష్టాయిష్టాలు అడుగుతూ వుంటే, 'నీకో ఐడియా చెప్తా. రేపు నాకు రెండు రూపాయలు ఇవ్వాలి' అంటాడు సుందరంతో స్నేహితుడు. 'ఆ అమ్మాయి ఏది ఇష్టమని చెబితే నువ్వూ అదే చెప్పు' అని సలహా ఇస్తాడు. తను చెప్పిందే చెప్దామని సుందరం ఫుల్ ప్రిపేర్ అయ్యేసరికి బెల్ అయిపోతుంది. స్నేహితుడి బ్యాడ్ టైమ్‌ని తిట్టుకుంటూనే 'అయినా కానీ నా రెండ్రూపాయలు మాత్రం నాకు ఇచ్చేయాలిరోయ్' అంటాడు. ఇంత హాయిగొలిపే హాస్యం చూసి ఎన్నాళ్లయిందో అనిపించక మానదు.
పసితనపు అమాయకత్వంలోని తెలిసీ తెలియని ప్రేమకి సుందరం అద్దం పడితే, కుర్రతనం దుందుడుకు స్వభావం… పర్యవసానాలు ఆలోచించకుండా ప్రేమలో పడ్డాక, అసలు పంతం చూపించాల్సిన చోట తలొంచేయడం భార్గవి పాత్ర ద్వారా చూపిస్తారు. ప్రేమలోని స్వఛ్ఛతని, నిజమైన ప్రేమికుడు ఎందాక వెళ్లగలడనే దానికి నిదర్శనంగా 'గడ్డం' నిలుస్తాడు. (స్పాయిలర్స్) ప్రేమించిన అమ్మాయి కోసం తనని తాను స్వఛ్ఛంగా వుంచుకోవాలని భావిస్తాడు గడ్డం. కానీ తను ప్రేమించేదే ఓ వేశ్యనని ఆలస్యంగా తెలుసుకుంటాడు. ఉన్నపళంగా తనతో వృత్తి మానిపించే స్తోమత తనకి లేదు. ఎయిడ్స్‌తో ఆమె తల్లి చనిపోయిందని తెలిసాక విటుల దగ్గరకి వెళ్లే ముందు జాగ్రత్త అంటూ తన చేతిలో కాండొమ్ ప్యాకెట్స్ పెడతాడు. 'నిన్నొకటి అడగొచ్చా' అంటూ మెలికలు తిరుగుతూ మొహమాటంగా 'నీతో కలిసి మందు తాగొచ్చా' అని తాపీగా చెప్పిన గడ్డంతో 'ఓస్ ఇదా… నేను ఇంకేదో అనుకున్నా' అని సలీమా అంటే 'ఛీ.. అవన్నీ పెళ్లయ్యాకే…' అంటాడు ఎంతో నిజాయితీగా. స్వఛ్ఛమైన ప్రేమని చూపించడానికి క్లాసీ క్యారెక్టర్లనే సృష్టించాల్సిన పని లేదనే దానికి ఇంతకంటే వుండదే ఉదాహరణ.
రాజు-రాధల బంధం మోహాలకి, ఆకర్షణలకి అతీతంగా… జీవితపు చివరి అంకంలో చేయూతగా ఓ తోడుని కోరుకునే దశని, అలాంటి పరిస్థితి తలెత్తినపుడు వచ్చే సమస్యలని కూడా దర్శకుడు అంత గొప్పగా చూపెట్టిన పరిణితికి ఫిదా అవ్వాల్సిందే. ఇరవయ్యేళ్ల కూతురున్న విధవ అయిన సోదరి ఆ వయసులో పెళ్లి చేసుకుంటానంటే ఆమె సోదరుడికి కోపం వచ్చి 'ఈ వయసులో ఏంటిది?' అంటాడు. అదే సమయంలో ఇరవయ్యేళ్ల తన మేనకోడలు తాను ప్రేమించానంటే 'ఈ వయసులో ఏంటి?' అని అదే ప్రశ్న అడుగుతాడు. 'నా వయసులోను తెలియక, మా అమ్మ అంత వయసు వచ్చాక కూడా తెలియకపోతే ఇక మాకు ఎప్పటికి తెలుస్తుంది ఏది రైట్ అని' అని ఆమె అడిగే ప్రశ్న ఆమె మామకే కాదు… స్త్రీ స్వేఛ్ఛని అడుగడుగునా ఆటంకపరిచే మైండ్‌సెట్ వున్న ప్రతివారికీ ఛెళ్లున తగులుతుంది.
ఇదంతా చదువుతోంటే ఇదో సీరియస్ సోషల్ డ్రామాలా అనిపించవచ్చు. కానీ దీనినంతా ఎంతో సరదాగా, పగలబడి నవ్వించే హాస్యంతో రూపొందించారు. ఓ ముసలావిడ 'ఒరేయ్ రాజూ.. నేను ఇంకో ఏడాది బతుకుతానంటున్నారు డాక్టర్లు. ఈ యేడాది అయినా నీ పెళ్లి చూసే అవకాశం వుందా లేదా?' అంటే పెళ్లి వాకబుతో విసిగిపోయిన రాజు 'ఒక పని చెయ్యవే. ఆ తాళేదో నీకే కట్టేస్తాను. ఎలాగో ఒక ఏడాది బతుకుతావు కదా. ఒక బిడ్డని కనేసి నా చేతిలో పెట్టు' అంటాడు కసిగా. ఇలాంటి సందర్భోచిత హాస్యంతో పాటు రియాక్షన్ కామెడీ కూడా బాగానే పండింది. పెళ్లి కావడం లేదని 'నట్టుగాడు' అంటూ ఊళ్లో టముకు వేయించి మరీ పంచాయతీ పెట్టడం కాస్త మోతాదుకి మించినట్టున్నా కానీ ఈ కథని ఆద్యంతం హాస్యభరితంగా నడిపించిన తీరు మాత్రం విశేషంగా మెప్పిస్తుంది. విశాఖ యాసలో వాడుక భాషలోని కొన్ని ఆక్షేపణీయ పదాలని కూడా మాటల్లో కలిపేయడం మరింత సహజత్వాన్ని, అలాగే హాస్యాన్ని జోడించింది.
ప్రధాన పాత్రలనే కాదు… సపోర్టింగ్ క్యారెక్టర్లు కూడా అలా గుర్తుండిపోతాయి. ఆపదలో కాసేపు ఆశ్రయమిచ్చిందని ఆ అమ్మాయిని కూతురిలా చూడడమే కాకుండా, తనకి ఎలాంటి కష్టం వచ్చినా నిలబడిపోయే 'అమ్మోరు' లాంటి 'బాబాయ్'లు మనకి ఊళ్లల్లో నిజంగానే తారసపడుతుంటారు. పాడే పాట అర్థం తెలియక 'భలే భలే మగాడివోయ్' లాంటి అడల్ట్ పాటల్ని పాడుతున్న పిల్లల టాలెంట్‌ని ఎంకరేజ్ చేసే ఆ టీచర్ చిన్నతనంలో ఎక్కడో చోట పరిచయమయ్యే వుంటారు. వినాయకుడి బొమ్మలు చేసే పాత్రకి జరిగే అన్యాయంతో విలవిల్లాడిపోతామంటే ఆ పాత్రలని, సన్నివేశాలని తీర్చిదిద్దిన విధానమే కారణం.
దేవుడంటూ ఏ మతంలోను లేడు… సాటి మనిషిలోనే దేవుడిని చూడు అంటూ అంతర్లీనంగా వున్న సందేశం మెప్పిస్తుంది. సినిమా అంతా వాస్తవికతే వుంటే ఇక సినిమాటిక్ కిక్ కోరుకునే వారి సంగతేంటి అంటారా? ఏ కమర్షియల్ మసాలా సినిమాకీ తీసిపోని ఫైనల్ కిక్ ఇవ్వడంలోను వెంకటేష్ మహా సూపర్ సక్సెస్ అయ్యాడు. డీటెయిల్స్‌లోకి వెళితే మొదటిసారి చూసేవారి ఎక్స్‌పీరియన్స్ స్పాయిల్ అవుతుంది కనుక వాటి జోలికి పోవద్దు. తెరపై, తెర వెనుక అంటూ వేరు చేసి చూడకుండా పని చేసిన ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యం నిర్వర్తించి దీనినో అరుదైన మణిపూసగా తీర్చిదిద్దారు.
ఒక సీనరీ లేదు… ఒక రంగురంగుల పూల మొక్కా కానరాదు. కానీ ఈసారి వాల్తేరు వెళ్తే మాత్రం కంచరపాలెం ఒక చుట్టు చుట్టి రావాలనిపిస్తది. ఎక్కడ ఏ వీధి చివర అయినా, ఏ అరుగు మీద అయినా రాజునో, సుందరమో కనిపిస్తే పలకరిద్దామని. వారానికి చాలా సినిమాలొస్తుంటాయి, వాటిలో ఎన్నిటినో చూడకుండానే మిస్ అవుతుంటాం. అప్పుడు పోగొట్టుకున్నది ఏమైనా వుందో లేదో తెలీదు కానీ… 'కేరాఫ్ కంచరపాలెం' మిస్ అయితే ఒక మధురానుభూతిని మిస్ అవడం ఖాయం.
బాటమ్ లైన్: పవరాఫ్ చలనచిత్రం!
-గణేష్ రావూరి